లైంగిక వేధింపుల ఆరోపణలను తప్పించుకోడానికి లైంగిక వివక్షను మెడ మీదకు తెప్పించుకోవడం లేదు కదా ఈ మగవాళ్లు! ఏమైనా ఈ న్యూ ఇయర్ హ్యాపీగా మొదలవ్వాలి. ఏడాదంతా హ్యాపీగా ఉండాలంటే ఏం చెయ్యాలన్నది కలసి డిన్నర్ చేస్తూ మాట్లాడుకోగలిగితే మరీ మంచిది.
‘మీటూ’ ఎఫెక్ట్‌తో కోపంగా ఉన్న మగవాళ్లు ఈ ఏడాది డిసెంబర్ 31న ఆడవాళ్లపై అంతకు అంతా తీర్చుకోబోతున్నారు! ఎప్పటిలా వాళ్లతో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయబోవడం లేదు. ఆఫీస్ పని మీద ఒకే హోటల్‌లో దిగినప్పటికీ ఒకే ఫ్లోర్‌లోని గదులలో దిగబోవడం లేదు. విమాన ప్రయాణాల్లో కూడా పక్కన పక్కన సీట్లు, ముందు వెనుకా సీట్లు కాకుండా నాలుగు వరుసల దూరంలో వేరుగా బుక్ చేసుకుని కూర్చుంటున్నారు. ఆడవాళ్లను దగ్గరకు రానివ్వకూడదన్న కసి కాదు కదా ఇది! కసే కనుక అయితే.. వాళ్ల జీవితాలను మరింత దుర్భరం చెయ్యడమే అది. ఇప్పటికే కొన్నాళ్లుగా వాల్‌స్ట్రీట్‌లో మగాళ్లంతా ఆడవాళ్లతో ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్తల్లా వ్యవహరిస్తున్నారు. ‘వుడ్యూ ప్లీజ్’ అనే మాటను కూడా వాళ్లు మరింత సంస్కారవంతంగా పలకడానికి తమ సమీపంలో ఉన్న మార్గాలన్నిటినీ అన్వేషిస్తున్నారు. బహుశా ఇది ‘పెన్స్’ ఎఫెక్ట్ కావచ్చు! ట్రంప్ తర్వాత ట్రంప్ అంతటివారు ఆయన. ట్రంప్ ప్రెసిడెంట్ అయితే, పెన్స్ వైస్ ప్రెసిడెంట్. తన భార్యతో తప్ప పరస్త్రీతో డిన్నర్‌కి కూర్చోకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన బాహాటంగానే చెప్పేశారు. చూస్తుంటే యు.ఎస్. పురుష పుంగవులంతా ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నట్లే ఉంది! ఇక ఆడవాళ్లతో కలిసి పని చేయడమంటే కోడి గుడ్డు పెంకులపై నడవడమేనని మోర్గాన్ స్టాన్లీ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసి మానేసిన డేవిడ్ బాన్సెన్ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. పెంకులు గుచ్చుకుంటాయని కాదు అయన అనడం. పెంకులెక్కడ పుటుక్కుమని హర్ట్ అవుతాయోనని! మీటూ ఉద్యమంలో ఉన్నవాళ్లకు ఈ దెప్పిపొడుపు బాగానే అర్థమై ఉంటుంది. ప్రస్తుతం ఆయన హ్యాపీగా ఉన్నారట.. ఇండిపెండెంట్ అడ్వైజర్‌గా లక్షల కొద్దీ డాలర్లు సంపాదిస్తూ. ఇంకా హ్యాపీ ఏంటంటే.. ఉమన్ కొలీగ్ అనే ప్రాణి ఆయన దరిదాపుల్లో ఉండదు!
‘మీటూ మిమ్మల్ని ఎంత ఎఫెక్ట్ చేసింది?’ అని ఓ అమెరికన్ సంస్థ రకరకాల కంపెనీల్లోని ముప్పై మంది మగ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను డిసెంబరు మొదటివారంలో ఇంటర్వ్యూ చేసింది. వాళ్లంతా టై సర్దుకుని, ఒక దగ్గు దగ్గి, గొంతు సవరించుకున్నారు కానీ, ఏమీ మాట్లాడలేదు. ‘పర్లేదు చెప్పండి’ అంటే.. ‘చెప్పడానికి ఏముంటుంది. మా జాగ్రత్తలో మేం ఉంటున్నాం’ అన్నారు. ఉమెన్ ఎంప్లాయిస్‌తో పూర్తిగా మాటలు తగ్గించేయడం, వాళ్లొచ్చినప్పుడు క్యాబిన్ డోర్‌లు తెరిచి మాట్లాడ్డం, ఆఫీస్ బయటి ఈవెంట్స్‌కి వాళ్లను పిలవకపోవడం, లిఫ్ట్‌లలో ఎడంగా నిల్చోవడం, కిటికీలు లేని గదుల్లో మీట్ అవకపోవడం.. ఇవీ ఆ జాగ్రత్తలు. ఒక ఎగ్జిక్యూటివ్‌కి అయితే వాళ్లావిడ సలహా ఇచ్చారట. ముప్పై ఐదేళ్లు, అంతకన్నా తక్కువ వయసున్న ఫిమేల్ కొలీగ్స్‌తో బిజినెస్ డిన్నర్స్ పెట్టుకోవద్దని! అయితే ఇదంతా కూడా ‘తమ జాగ్రత్తలో తాము ఉండడం’ అనే ముసుగులో మగవాళ్లు ఆడవాళ్లపై సాధిస్తున్న కక్షగానే కనిపిస్తోంది. మహిళా ఉద్యోగులు ‘మీటూ అనే పొయ్యి’లోంచి ‘మీటూ ఎఫెక్’్ట అనే పెనం మీద గానీ పడ్డారా?! యు.ఎస్.ని వదిలిపెట్టండి. ఇండియా వచ్చి మీటూ ఉద్యమానికి ఊపిరి ఊదిన తనుశ్రీ దత్తా ఒక నిట్టూర్పుతో తిరిగి యు.ఎస్. వెళ్లిపోతున్నారు. అయితే ఆమె ఎఫెక్ట్ సామాన్యంగా ఏమీ లేదు. కొన్ని కుదుళ్లు కదిలాయి. కొన్ని కంపెనీలు ఆడవాళ్లకు కాళ్లు తగలకుండా సర్దుకుని కూర్చున్నాయి. దీనికి రెండో వైపు కూడా ఉంది. చిన్న చిన్న ఆఫీస్‌లలో, పెద్ద పెద్ద కార్పొరేట్ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులను కలుపుకుని పోవడం తగ్గిపోయింది.
మంగళవారం నరేంద్ర మోదీ ముంబై వచ్చినప్పుడు ఆయనతో సినిమా ఇండస్త్రీ కష్టసుఖాలు చెప్పుకునేందుకు బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, నటులు వెళ్లి కలిశారు. కరణ్ జోహార్, సిద్ధార్థ రాయ్ కపూర్, రాకేశ్ రోషన్, ప్రసూన్ జోషి, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్.. అంతా పురుషులే. మొత్తం పదహారూ పదిహేడు మంది. ఫొటోను చూస్తే వెంటనే వచ్చే డౌటు.. ఒక్క స్త్రీ కూడా లేరేమిటని?! ‘ఫిమేల్ రిప్రజెంటేషన్ కూడా ఉంటే బాగుండేది. ఇది 2018 కదా’ అని ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’ దర్శకురాలు అలంకృత శ్రీవాత్సవ ట్వీట్ చేశారు. కొందరైతే.. ‘దేశ ప్రధానితో చెప్పుకునేంత తీవ్రమైన సమస్యలు బహుశా బాలీవుడ్‌లోని మహిళలెవరికీ లేవేమో! సెక్సువల్ హెరాస్‌మెంట్, కాస్టింగ్ కౌచ్, పే గ్యాప్, మిస్ రిప్రెజెంటేషన్, సెక్సిజం.. ఈ సమస్యలన్నీ పరిష్కారమైనట్లే ఉంది’ అని కామెంట్ చేశారు. ‘ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ అధ్యక్షుడు సిద్ధార్థ రాయ్.. ముందుగా అనుకునే మేల్ గ్రూప్‌తో ప్రధానిని కలిసినట్లు స్పష్టమైపోయింది. ఒకవేళ మన ప్రధాని నరేంద్ర మోదీ కాకుండా, నర్మదా మోదీ అయి ఉంటే ఈ మేల్‌గ్రూప్ వెళ్లి కలిసేవాళ్లే కారేమో! అయితే ‘మీటూ’కి ప్రతీకారంగా తమపై జరుగుతున్న ఈ వివక్ష దాడులకు మహిళలు పట్టించుకునే స్థితిలో లేదు. ‘‘మీటూను తిప్పికొట్టడానికి మగాళ్లు వేస్తున్న ఈ ఎమోషనల్ వేషాలకు సాటి మహిళా ఉద్యోగులు చిన్నపాటి గమనింపును కూడా ఇవ్వలేనంతగా ఇంటికి ఆఫీస్‌కి మధ్య నిత్యం గృహాంతరయానం చేస్తుంటారన్న సంగతిని మగవాళ్లు గ్రహించాలి’’ అంటున్నారు కరేన్ ఎలిన్‌స్కీ. యు.ఎస్.లోని వెల్స్ ఫార్గో కంపెనీ వైస్–ప్రెసిడెంట్ ఆవిడ.లైంగిక వేధింపుల ఆరోపణలను తప్పించుకోడానికి లైంగిక వివక్షను ఆరోపణలను మెడ మీదకు తెప్పించుకోవడం లేదు కదా ఈ మగవాళ్లు! ఏమైనా ఈ న్యూఇయర్ హ్యాపీగా మొదలవ్వాలి. ఏడాదంతా హ్యాపీగా ఉండాలంటే ఏం చెయ్యాలన్నది కలసి డిన్నర్ చేస్తూ మాట్లాడుకోగలిగితే మరీ మంచిది. ∙
∙మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment