స్కూలు వదలగానే నాలుగో తరగతి చదువుతున్న అభిరామ్, భాస్వంత్‌లు కొందరు స్నేహితులతో కలిసి పక్కనే ఉన్న పార్కుకి వెళ్లి జారుడు బల్ల, ఉయ్యాల, దాగుడు మూతలు.. ఎంతో సంబరంగా అడుకున్నారు. తర్వాత ఇసుకలో దూదుం పుల్ల ఆడుతున్నారు. వారి ఆటలకు సంబరపడుతూ నింగినుంచి మహాకవి శ్రీశ్రీ కిందికి దిగారు. ఆ చిన్నారులను దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఆయనకు తను రాసిన కవిత్వం స్ఫురించింది.‘‘మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకసమున హరివిల్లు విరిస్తేఅవి మీకే అని ఆనందించే కూనల్లారా...
ఈలలు వేస్తూ ఎగురుతు పోయే పిల్లల్లారా పిల్లల్లారాగరిక పచ్చ మైదానాల్లోనూ తామరపూవుల కోనేరులలోపంట చేలలో బొమ్మరిళ్లలో తండ్రి పందిటా తల్లి కౌగిటానోళుల వ్రేళులు, పాలబుగ్గలూ ఎక్కడ చూస్తే అక్కడ మీరైవిశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మలు ఓ చిరుతల్లారాఉడుతల్లారా బుడతల్లారా ఇది నా గీతం... వింటారా...’’ అంటూ శైశవగీతి వినిపించాడు.పాట వింటున్న బుడతలు, ‘తాతా! మాకు హరివిల్లు ఎలా ఉంటుందో తెలియదు, గరికపచ్చ మైదానాలు, తామర కొలనులు ఏవీ తెలియవు. అవన్నీ ఎక్కడ ఉంటాయి’ అని అమాయకంగా ప్రశ్నించారు. శ్రీశ్రీ నోట మాట రాలేదు. ఆ పసికూనలకు ఎక్కడ ఎలా చూపించాలో తెలియలేదు.‘మీ స్కూల్ టీచర్లు ఇవేవీ చూపించలేదా, మీ అమ్మానాన్నలు వీటి గురించి చెప్పలేదా’ అని అడిగాడు. అందుకు ఆ చిన్నారులు, ‘లేదు తాతా!’’ అన్నారు. వారి స్థితికి చింతిస్తూ, బరువెక్కిన గుండెతో మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు శ్రీశ్రీ.అంతలోనే యశోదమ్మ వచ్చింది, ‘ఓయమ్మ మీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగ మననీడమ్మా, పోయెదమెచ్చటికైనను మాయన్నుల సురభులాన మంజులవాణీ’ అని చదివాడు కాస్త తెలుగు తెలిసిన పెద్ద బుడతడు. ఆ మాటలు చెవిన పడ్డాయో లేదో యశోదలోని మాతృత్వం బయటకు వచ్చింది, ‘ఏం నాయనా! ఇలా నా కుమారుడి మీద నేరాలు చెబుతున్నారు’ అని అడిగింది.
‘అవ్వా! మీ అబ్బాయి ఇంత అల్లరి చేస్తే నువ్వు ఎన్నడూ కొట్టలేదా’ అని అడిగారు. ‘కొట్టలేదురా పిల్లలూ! మీలాంటి చిట్టిచిట్టి పిల్లలు అల్లరి చేస్తేనే సరదాగా ఉంటుంది. ఇరుగుపొరుగమ్మలు నేరాలు చెప్పినా, చిన్నారి కృష్ణుడు ఏం చేశాడో తెలుసుకుని, అది పెద్ద తప్పయితే, నెమ్మదిగా మందలించేదాన్ని. చిన్నపిల్లలు దేవుడితో సమానం, అందుకే పిల్లలు అల్లరి చేసినా దేవుడి చేష్టగానే భావించేదాన్ని’’ అని చెప్పి వెళ్లిపోయింది యశోద. చిన్నారులకు ఆ యశోదమ్మ పిల్లవాడిని కొట్టలేదన్న విషయం అర్థమైంది. ‘శ్రీశ్రీ తాతయ్య, యశోద అమ్మమ్మ మాటలు వింటుంటే నాకు కూడా తాతయ్య ఇంటికి వెళ్లాలనుంది’ అన్నాడు ఒక చిన్నారి.‘నాకూ వెళ్లాలనే ఉంది. కాని స్కూల్‌కి సెలవులు ఉండవుగా. ఒకవేళ ఇచ్చినా, ఏవో ఒకటి నేర్చుకోమంటుంది అమ్మ’ అంటూ దిగాలుగా అన్నాడు మరో చిన్నారి. వీళ్ల మాటలు వింటున్న దశరథుడు వారి దగ్గరగా వచ్చి, ‘నాయనలారా! ఎందుకురా ఇలా డీలాపడుతున్నారు’ అని ప్రశ్నించాడు. ‘తాతా! రాముడు ఒకసారి చందమామ కావాలి అని ఏడుస్తుంటే, నువ్వు అద్దం తీసుకువచ్చి ఆ అద్దంలో చందమామను చూపించావు. చందమామ కోసం పేచీ పెట్టాడని కొట్టలేదు కదా! కాని మా అమ్మనాన్నలు నేను ఏది అడిగినా తెచ్చివ్వకపోగా గట్టిగా కోప్పడతారు.
అంతేనా ఒకసారి నేను పార్కుకి తీసుకెళ్లమని అడిగినందుకు నన్ను హాస్టల్‌లో చేర్పించేశారు’’ అంటూ ముఖం చిన్నబుచ్చుకున్నాడు. దశరథుడి పితృహృదయం పరితపించింది. నా రామచంద్రుడు అరణ్యాలకు వెళ్లినందుకేగా నేను విలపించి విలపించి మరణించాను. మరి నేటి తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నారు అనుకున్నాడు. చిన్నారులకు కొద్దిసేపు ఒడిలోకి తీసుకుని, సముదాయించి, బుజ్జగించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆటల సమయం మించిపోవడంతో ఆ చిన్నారులంతా ఇంటికి వెళ్లిపోయారు. ఆ రాత్రంతా వారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. వారి ఆనందానికి అవధులు లేవు. అందమైనది బాల్యంరాముడు, కృష్ణుడు, వివేకానందుడు.. ఎందరో మహానుభావులు బాల్యాన్ని అందంగా అనుభవించారు. విశాలమైన ఆటస్థలంలో ఆడుకున్నారు. అమ్మనాన్నల ప్రేమను సంపూర్ణంగా ఆస్వాదించారు. సెలవులకి తాతయ్యల ఇళ్లకు వెళ్లి వారి దగ్గర కథలు విన్నారు, వారు పెట్టే సున్నుండలు తిన్నారు, ఎండల్లో మామిడిచెట్లు ఎక్కారు, వానలో పడవలు వేశారు, చలిలో చలి మంటలు వేసుకున్నారు. గాలిలో గాలిపటాలు ఎగురవేశారు... పంచభూతాలతో చెట్టపట్టాలేసుకుని ఆడుకున్నారు. వారి జీవితం నిజమైన శైశవగీతి అయ్యింది.
– డా. వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment