
హైదరాబాద్, బేగంపేటలో ఉంది ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌కు వేదిక ఆ స్కూలే. ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్. ఇది తొమ్మిదో ఎడిషన్. నిన్న మొదలైన ఈ మూడు రోజుల పండుగ రేపటితో ముగుస్తుంది. ఈ ఏడాది ఫెస్టివల్‌కి అతిథి చైనా దేశం. గాంధీజీ 150వ జయంతి ఏడాది కావడంతో గుజరాత్ సాహిత్యం సాహిత్యం, గాంధీజీ ప్రధానాంశాలుగా రూపొందిందీ ప్రోగ్రామ్. సాహిత్య సభలో సిరాచుక్క సాక్షిగా ‘మీటూ’ సామాజికాంశం ప్రధానమైన చర్చనీయాంశమైంది. అనేక ఆవేదనలకు సంగ్రహరూపంగా ‘మీటూ; ద వే ఫార్వార్డ్’ ప్యానల్ డిస్కషన్ జరిగింది. ఇందులో చిన్మయి శ్రీపాద, సంధ్య మెనన్, సుతప పాల్‌లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది వసుధా నాగరాజ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఎవరికి చెప్పుకోవాలి
‘బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ ద కంట్రీ’ అంటూ ప్రశంసపూర్వకంగా ఆహ్వానించారు వసుధ. ‘‘సమాజం అధికార సమీకరణల మీద నడుస్తోందని, అది విద్యార్థిని– టీచర్ నుంచి అధికారి – ఉద్యోగిని వరకు అన్ని చోట్లా విస్తృతంగా రాజ్యమేలుతోందని నిరసించారామె. ‘మీటూ’ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ ‘నా దేహాన్ని పణంగా పెట్టడం ఎందుకు’ అంటూ శ్రీరెడ్డి గళం విప్పినప్పుడు తెలిసింది సినిమా ఇండస్ట్రీకి విశాఖ గైడ్‌లైన్స్ గురించి తెలియదని. ధైర్యంగా బయటకు వచ్చిన తనుశ్రీదత్తా నుంచి ఎవరు కూడా కంప్లయింట్ ఫైల్ చేసే అవకాశమే లేని విధంగా నడుస్తోంది మన వ్యవస్థ. పని ప్రదేశంలో సెక్సువల్ హెరాస్‌మెంట్ ప్రివెన్షన్ సెల్ ఉండాలనే నిబంధన అమలు చేయించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి’’ అన్నారు వసుధ. ‘‘మగవారికి ప్రతికూలమైన అంశాల మీద కనీస చర్చ లేకుండా వీలయినంత త్వరగా తుడిచేయడానికే చూస్తుంది సమాజం. బేటీ బచావో, బేటీ పడావో అనే నినాదం మంచి ఫలితాలనివ్వాలంటే మహిళలకు ఉద్యోగం చేసే చోట సురక్షితమైన వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం కల్పించే వరకు ప్రభుత్వాలు పర్యవేక్షిస్తూనే ఉండాలి’’ అని రచయిత సంధ్యా మెనన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అసత్యపు ఆరోపణలు అంటూ గొంతుచించుకోవడం మీద తన అధ్యయనాన్ని వివరిస్తూ ‘‘నేపాల్ నుంచి కేరళ వరకు రకరకాల మహిళలను కలిశాను. వారి అనుభవాలను తెలుసుకున్నాను. నా ఫోన్‌కు 250 మెసేజ్‌లు వచ్చాయి. వాటిలో మూడు మాత్రమే పెద్దగా ప్రాధాన్యం లేనివి. మిగిలినవన్నీ ఏ మాత్రం సందేహం లేకుండా వేధింపు అని అంగీకరించాల్సినవే. ఆ మూడింటిని కూడా అసత్యపు ఆరోపణలు అనడానికి వీల్లేదు. చిన్నపాటి అపార్థాల కారణంగా లేవనెత్తిన ఆరోపణలవి.మీటూ ఉద్యమంలో స్పందించే గొంతుకలు ఉన్నాయి. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించుకోవాలి’’ అన్నారు సుతప పాల్.
గళం విప్పినందుకు..
సమంత, భూమిక, కాజల్, త్రిష, పూజా హెగ్డే, సోనాక్షి సిన్హా, నయనతార, లావణ్య త్రిపాఠి... వంటి అనేక మంది హీరోయిన్ల ద్వారా మనకు స్వర పరిచితురాలు చిన్మయి శ్రీపాద. సింగర్‌గా సింగిల్ కార్డుతో పాటలు పాడిన అమ్మాయి. నంది, ఫిలింఫేర్, స్టేట్ అవార్డు వంటి లెక్కలేనన్ని అవార్డులందుకున్న అమ్మాయి. బ్లూ ఎలిఫెంట్ కంపెనీ సీఈవోగా విజయవంతంగా నడుస్తున్న కెరీర్ ఆమెది. తమిళనాడు నుంచి ఫార్చ్యూన్ గ్లోబల్ ఉమెన్స్ మెంటరింగ్ పార్ట్‌నర్ షిప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన తొలి మహిళ. ఒకప్పుడు గడియారంతో పాటు పరుగులు తీస్తూ... రోజుకు ఐదారు పాటలు పాడిన అమ్మాయి. ఇప్పుడు రోజుకు ఒక పాటకు మించడం లేదు. దీనంతటికీ కారణం తమిళ కవి, పాటల రచయిత వైరముత్తు అకృత్యాలను బయటపెట్టడమే. ‘మీటూ’ అంటూ బయటకొచ్చిన బాధితులకు ఆలంబనగా నిలిచినందుకు ఆమె చెల్లిస్తున్న మూల్యం ఇది.
‘‘సక్సెస్‌లో ఉన్నావు కెరీర్‌ని కోల్పోవద్దు... అని చెప్పింది మా అమ్మ. కెరీర్ కంటే స్త్రీగా ఆత్మగౌరవం ముఖ్యం కదా అమ్మా అన్నాను. వైరముత్తు మీద నోరు తెరిచిన క్షణం నుంచి ఈ క్షణం వరకు వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. వైరముత్తు వేసుకున్న జెంటిల్మన్ ముసుగును తొలగిస్తూ వందల మంది బయటకు వచ్చారు. అప్పటివరకు నా కులం ప్రస్తావన రాలేదు, వాళ్ల అఘాయిత్యాలను బయటపెట్టినప్పటి నుంచి కుల సమీకరణలు మొదలయ్యాయి. అవి రాజకీయ సమీకరణలకు దారితీశాయి. వాటంతటగా అవి దారి తీయలేదు. అలా తీయించారు. ‘పబ్లిసిటీ కోసం సమాజంలో పేరున్న వాళ్ల మీద ఇలాంటి ఆరోపణలు చేయడం మామూలే’ అన్నాడా పెద్దమనిషి. పదిహేడేళ్లపాటు నిర్మించుకున్న కెరీర్ నాది. నేనందుకున్న అవార్డులకు లెక్కేలేదు. అలాంటి నేను పబ్లిసిటీ కోసం అర్థరహితమైన ఆరోపణలు చేయడం నాకవసరమా? పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు అందుకున్న వ్యక్తి (వైరముత్తు) అనాల్సిన మాటలు కావవి. సోషల్ మీడియాలో నా మీద ట్రోలింగ్ ఎక్కువైంది. ప్రాణ హాని ఉంటుందని, ఒక్కదానినే ప్రయాణం చేయవద్దని స్నేహితులు, బంధువులు జాగ్రత్తలు చెబుతున్నారు. ఏరోజు ఏదైనా జరగవచ్చనేటంతగా భయానక వాతావరణం ఏర్పడి ఉంది. ఇది కూడా పవర్ ఉన్న వాళ్లు వ్యూహాత్మకంగా సృష్టించినదే.ఇలాంటి విషయాల్లో భారతీయ సమాజం మారాలి. పితృస్వామ్య భావజాలంతోపాటు స్త్రీ అంటే తేలిక భావం, ఏదైనా అనవచ్చు అనే ఆధిక్య భావన కరడు గట్టుకుని ఉంది. మహిళను నమ్మరు, ఆమె మాటను విశ్వసించరు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ఏమిటంటే... వివాదాన్ని ఎదుర్కొంటున్న మహిళ తాను చెప్పదలచుకున్న విషయాన్ని రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నప్పుడే ఆమె మాటను విశ్వసిస్తారు. బతికి ఉండి చేసే పోరాటానికి మద్దతు ఇవ్వడానికి పురుష సమాజానికి మనసు రాదు. ఈ పోకడ మారనంత వరకు ఈ పోరాటాలు తప్పవు’’ అన్నారు గాయని చిన్మయి శ్రీపాద.
– వాకా మంజులారెడ్డిఫొటోలు: అనిల్ కుమార్
మహిళ తాను చెప్పదలుచుకున్న విషయాన్ని రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నప్పుడే ఆమె మాటను విశ్వసిస్తారు. బతికి ఉండి చేసే పోరాటానికి మద్దతు ఇవ్వడానికి పురుష సమాజానికి మనసు రాదు.
మంచి పరిణామం కోసమే
‘‘నా మీద ఏ క్షణాన అయినా దాడి జరగవచ్చు. దాడి జరుగుతుందని వెనక్కి పోవడం ఉండదు. ఇప్పటి వరకు జరిగిన దాని పట్ల నాకు ఎటువంటి విచారమూ లేదు. జరగాల్సినదే జరిగింది. జరగాల్సిన మంచి పరిణామానికి వేసిన అడుగు ఇది. ఒక మంచి జరగాలంటే కొంత ఘర్షణ తప్పదు. అలాంటి ఘర్షణే ఇది. లక్ష్యాన్ని చేరే వరకు ప్రయాణం కొనసాగుతుంది. – చిన్మయి శ్రీపాద, గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్
Comments
Please login to add a commentAdd a comment