గుడ్డిగా నమ్మొద్దు!
వేదిక
వృత్తిని బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొద్దు. నా విషయంలో నా తల్లిదండ్రులు చేసిన పొరపాటు అలాంటిదే. నేను ఇంటర్ చదువుతుండగా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొదట వచ్చిన సంబంధంలో అబ్బాయి చదువుకోలేదని మావాళ్లు ఒప్పుకోలేదు.
రెండో సంబంధం అబ్బాయి చాన్నాళ్ల నుంచి పట్నంలో ఉన్నాడు...ఎలాంటి చెడు అలవాట్లుంటాయోనని వద్దన్నారు. ఇంతలో మా బంధువులబ్బాయి ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ బాగానే సంపాదిస్తున్నాడని, అబ్బాయి కూడా బాగానే ఉంటాడని మా మేనత్త చెప్పింది.
కానీ అబ్బాయికి స్నేహితులెక్కువనీ, ఖర్చు కూడా ఎక్కువని మా నాన్న ఒప్పుకోలేదు. ఒక్కగానొక్క బిడ్డను కావడంతో మావాళ్ళు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొనేవారు. ఇంతలో నాన్న స్నేహితుడు ఒక సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి సిఐగా పనిచేస్తున్నాడనగానే మా నాన్న ఎగిరి గంతేశారు. ‘పోలీసంటే పెళ్లి తర్వాత మనమ్మాయి గురించి పూర్తిగా మరచిపోవచ్చు. ఎంచక్కా పోలీసాయన చేతిలో పెడితే ఏ గొడవా ఉండదు’ అన్నారు.
అబ్బాయి ఎలా ఉంటాడు, ఎక్కడ పనిచేస్తున్నాడు, ఎంత జీతం వస్తుంది, కుటుంబం వివరాలు ఏమిటన్నది కనుక్కున్నారు. తర్వాత ఒక్క నిమిషం కూడా ఆగలేదు...హడావిడిగా పెళ్లి చేసేశారు. పెళ్లయిన కొత్తలో అంతా బాగానే ఉంది. ఉన్నట్టుండి ఆయనకి పక్కజిల్లాకి ట్రాన్స్‌ఫర్ అయింది. ఒకోరోజు ఇంటికి వచ్చేవారు కాదు. అదేంటంటే...డ్యూటీ అనేవారు.
ఒకసారి క్యాంపు పని అని చెప్పి నాలుగురోజులు రాలేదు. ఆ సమయంలో ఒక కానిస్టేబుల్ వచ్చి ‘సార్ ఉన్నారా మేడమ్...’ అన్నాడు. క్యాంపుకెళ్లారని చెప్పగానే ‘క్యాంపు ఏమిటి మేడమ్! సార్ సెలవులో ఉన్నారు కదా!’ అన్నాడు. అప్పుడిక అనుమానం వచ్చి ఆయన గురించి ఆరా తీయడం మొదలుపెట్టాను. ఆయనకు చాన్నాళ్ల నుంచి ఒకమ్మాయితో అక్రమసంబంధం ఉంది.
నాకేం చేయాలో అర్థం కాలేదు. ఇదే పని మరొక వ్యక్తి చేసుంటే వెంటనే పోలీసులను ఆశ్రయించేదాన్ని. కానీ, పోలీసు వృత్తిలో ఉండి కూడా ఇలాంటి ఘోరాలు చేస్తే ఇంకెవరికి చెప్పాలి. పదిమందికీ రక్షణ కల్పించాల్సిన వాళ్ల గురించి చెడుగా చెప్పడానికి మనసు రావడంలేదు. కానీ, చేస్తున్న వృత్తుల్ని చూసి మోసపోకండని నలుగురి కళ్లు తెరిపించే ప్రయత్నం చేయాలని ఉంది.
నాకు అసలు విషయం అర్థమైనట్లు ఇంకా నా భర్తకు తెలియదు. తెలిస్తే...నాకు భయపడి తను చేస్తున్న తప్పుని సరిదిద్దుకుంటారని నేను అనుకోవడం లేదు. అందుకే నా చదువుని కొనసాగింద్దామనుకుంటున్నాను. ఈ ‘వేదిక’ ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులకు నేను చెప్పేదేమిటంటే...అబ్బాయి ఫలానా ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి బుద్ధిమంతుడై ఉంటాడనే అపోహల్లో ఉండకండి!
- ఓ సోదరి, ఖమ్మం