
పొడిబారిన జుట్టుకు...
ప్రశ్న - పరిష్కారం
నాకు జుట్టురాలడం, చుండ్రు సమస్యలు ఉన్నాయి. చలికాలం కావడంతో ఈ సమస్య మరీ అధికంగా ఉంది. హెర్బల్ షాంపూలు, నూనెలు వాడినా ఫలితం లేదు. ఈ సమస్యల నివారణకు మంచి సలహా చెప్పగలరు.
- వి.ఆర్.మాధురి, ఇ-మెయిల్
మానసిక ఒత్తిడి, విటమిన్లు, మినరల్స్, ఐరన్ శరీరానికి తగినంత అందకపోవడం, కాలుష్యం, వంశపారంపర్యం, నిద్రలేమి, హార్మోన్లలో హెచ్చుతగ్గులు, అనారోగ్యం.. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలకు ఇలా అనేక కారణాలు ఉంటాయి. మీరు నెలలో రెండు సార్లు ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనెను కుదుళ్లకు పట్టేలా మసాజ్ చేసుకోవాలి. ఉసిరి, శికాకాయ, ఎండిన నిమ్మ ఆకులను కలిపి తయారుచేసుకున్న మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తర్వాత నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. చలికాలమైనా సరే కొబ్బరి నీళ్లు తరచూ తాగుతూ ఉండండి. అలాగే రోజూ రెండు బాదంపప్పులు తింటూ ఉండండి. వెంట్రుకలు రాలడం, పొడిబారడం, చుండ్రు సమస్యలు తగ్గుతాయి.
నా తల వెంట్రుకలు చాలా బిరుసుగా ఉంటాయి. వారానికి ఒకసారి నూనె రాసుకుంటాను. డ్రై నెస్ పోవడానికి ఎన్నిషాంపూలు మార్చినా ఫలితం కనపించడం లేదు. ఏం చేస్తే నా జుట్టు సిల్కీగా అవుతుంది?
- విక్కి, ఇ-మెయిల్
చర్మానికి లాగే జుట్టుకు కూడా మాయిశ్చరైజర్ అవసరం. మీరు వారానికి రెండు సార్లు పెరుగుతో జుట్టు కుదుళ్లకు మాడుకు మసాజ్ చేయండి. పదిహేను, ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరచండి. అలాగే షాంపూతో తలంటుకున్న తర్వాత, తడి జుట్టుకు తప్పనిసరిగా కండిషనర్‌ని ఉపయోగించండి. అయితే, కండిషనర్‌ని నేరుగా మాడుకు పట్టించవద్దు. బయటకు వెళ్లేటప్పుడు తలను క్యాప్‌తో కవర్ చేయండి. గుడ్లు, నట్స్, పాల ఉత్పత్తులలో ప్రొటీన్లు అధికం. వీటిని రోజూ తీసుకోండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ జుట్టు సిల్కీగా అవుతుంది.
నా వయసు 19. నా పై పెదవి మీద వెంట్రుకలు వస్తున్నాయి. నలుపుగా కూడా ఉంటోంది. దీని వల్ల చాలా ఇబ్బందిగా ఉంటోంది. పరిష్కారం చెప్పగలరు.
- ఈషా, ఇ-మెయిల్
ఆడవారిలో పై పెదవి మీద వెంట్రుకలు రావడం అనేది హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల జరుగుతుంది. దీనికి థ్రెడింగ్, వ్యాక్సింగ్ మేలైనవి. నలుపు కూడా ఉంది కాబట్టి టొమాటో గుజ్జును పై పెదవి మీద రాసి, ఆరనివ్వండి. తర్వాత శుభ్రపరుచుకోండి. టొమాటోలోని సహజ సిద్ధమైన బ్లీచింగ్ నలుపును తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఈ పద్ధతిని పాటించవచ్చు.
- గీతాంజలి ప్రియ, బ్యూటీషియన్