దుర్గాపూజ స్పెషల్స్‌ | durga puja special | Sakshi
Sakshi News home page

దుర్గాపూజ స్పెషల్స్‌

Published Thu, Sep 28 2017 11:32 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

durga puja special - Sakshi

నిన్నటి వంటల శీర్షికలో రకరకాల బొబ్బట్లు ఇచ్చాం. ఇప్పుడు ఫుల్‌గా నవరాత్రి స్పెషల్‌ దుర్గాపూజ నైవేద్యాలు. మాతను ప్రసన్నం చేసుకోండి. దసరాను సంతోషంగా స్వీట్‌గా చేసుకోండి.

సూజీ కా హల్వా
కావలసినవి: బొంబాయి రవ్వ – కప్పు, పంచదార – అర కప్పు, పాలు – కప్పు, నెయ్యి – అర కప్పు, కిస్మిస్‌ – 2 టే బుల్‌ స్పూన్లు, బిర్యానీ ఆకు – 1, ఏలకుల పొడి – టీ స్పూను, కుంకుమ పువ్వు – చిటికెడు, జీడి పప్పులు –  2 టేబుల్‌ స్పూన్లు

తయారి: ∙పెద్ద పాత్రలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక జీడిపప్పులు వేసి వేయించాలి .ఏలకుల పొడి, బిర్యానీ ఆకు వేసి మరో మారు వేయించాలి. జీడిపçప్పులు బంగారు రంగులోకి వచ్చాక బొంబాయి రవ్వ వేసి బాగా వేయించాలి ∙ఒక పాత్రలో పాలు పోసి వేడి చేయాలి ∙రవ్వ వేగుతున్న పాత్రలో కాచిన పాలు పోస్తూ బాగా కలిపి నాలుగు నిమిషాలు ఉడికించాలి ∙పంచదార, కిస్మిస్‌ వేసి మరోమారు బాగా కలపాలి ∙చివరగా కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి సర్వ్‌ చేయాలి.

లొబోంగో లతికా
కావలసినవి: మైదా పిండి – కప్పు, బేకింగ్‌ పౌడర్‌ – అర టీ స్పూను, ఉప్పు – చిటికెడు, పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు, వేడి నీళ్లు – అర కప్పు,

స్టఫింగ్‌ కోసం: కొబ్బరి తురుము – అర కప్పు, పచ్చి కోవా – కప్పు, ఏలకుల పొడి – టీ స్పూను, బెల్లం తురుము – అర కప్పు, జాజికాయ పొడి – చిటికెడు.
పంచదార పాకం కోసం: పంచదార – ఒకటిన్నర కప్పులు, నీళ్లు – 2 కప్పులు, ఏలకుల పొడి – అర టీ స్పూను, నూనె – డీప్‌ ఫ్రైకి తగినంత

తయారి: ∙ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు, పంచదార, బేకింగ్‌ పౌడర్, నెయ్యి వేసి బాగా కలపాలి. కొద్దికొద్దిగా  వేడి నీళ్లు జత చేస్తూ మిశ్రమాన్ని చపాతీ పిండిలా కలపాలి. ∙కొద్దిగా నూనె జత చేసి పిండిని బాగా మర్దిస్తూ కలిపి, ఓ గంట సేపు పక్కన ఉంచాలి.

స్టఫింగ్‌ తయారి: ∙స్టౌ మీద బాణలిలో కొబ్బరి తురుము, పచ్చి కోవా, ఏలకుల పొడి, బెల్లం తురుము, జాజికాయ పొడి వేసి బాగా కలపాలి ∙మిశ్రమం అంతా ఉడికి, గట్టి పడిన తరవాత స్టౌ మీద నుంచి దింపి, చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙ఒక్కో ఉండను చిన్న పూరీలా ఒత్తి, కొబ్బరి తురుము మిశ్రమం ఉండను ఇందులో ఉంచి నాలుగు వైపులా పువ్వు ఆకారం వచ్చేలా మడిచిపెట్టి, విడిపోకుండా మధ్యలోకి లవంగం గుచ్చాలి ∙ఇలా అన్నీ తయారుచేసుకుని పక్కన ఉంచాలి ∙స్టౌ మీద పెద్ద పాత్రలో పంచదార, నీళ్లు, ఏలకుల పొడి వేసి, తీగ పాకం వచ్చే వరకు కలిపి దింపేయాలి ∙సౌ ్టమీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న లొబోంగో లతికాలను వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి ∙కొద్దిగా చల్లారగానే వీటిని పంచదార పాకంలో వేసి అరగంట తరవాత సర్వ్‌ చేయాలి

నోలెన్‌ గుర్‌ పాయష్‌
కావలసినవి: చిక్కటి పాలు – లీటరు, బియ్యం – 4 టేబుల్‌ స్పూన్లు (సాధారణంగా గోబిందో భోగ్‌ బియ్యం ఉపయోగిస్తారు. ఇక్కడ లభించవు కనుక బాస్మతి బియ్యం ఉపయోగించుకోవచ్చు), బెల్లం తురుము – 6 టేబుల్‌ స్పూన్లు, బిర్యానీ ఆకు – 1, ఏలకుల పొడి – టీ స్పూను

తయారి: ∙ఒక పాత్రలో పాలు, బిర్యానీ ఆకు, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి ∙పాలు మరుగుతుండగా కడిగి ఉంచుకున్న బియ్యం వేసి బాగా కలపాలి ∙మరో పాత్రలో బెల్లం, తగినన్ని నీళ్లు వేసి స్టౌ మీద ఉంచి లేత పాకం పట్టి దింపేయాలి ∙పాలలో బియ్యం బాగా ఉడికిన తర్వాత బెల్లం పాకం వేసి బాగా కలిపి మూడు నిమిషాలు ఉంచి దించేయాలి ∙ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా తినొచ్చు ∙ఈ పాయసం రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది.

షోర్‌  భోజో
పంచదార పాకం కోసం: పంచదార – 2 కప్పులు, నీళ్లు – కప్పు, నిమ్మ రసం – అర టీ స్పూను, ఏలకుల పొడి – కొద్దిగా, రోజ్‌ ఎసెన్స్‌ – కొద్దిగా

షోర్‌ భోజో కోసం: చిక్కటి పాలు – 2 లీటర్లు, పంచదార – టేబుల్‌ స్పూను, మైదా పిండి – 2 టేబుల్‌ స్పూన్లు, బాదం + పిస్తా పప్పులు – అలంకరణ కోసం కొద్దిగా, నెయ్యి – తగినంత

పాకం తయారి: ∙ఒక పాత్రలో పంచదార, నీళ్లు వేసి మరిగించాలి ∙ఏలకుల పొడి, రోజ్‌ ఎసెన్స్‌ జత చేసి, తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి ∙నిమ్మరసం జత చేసి మరోమారు కలిపి స్టౌ మీద నుంచి దింపి పక్కనుంచాలి ∙ఒక పాత్రలో పాలు పోసి బాగా మరిగించాలి. మీగడ మందంగా వచ్చినప్పుడల్లా, తీసి జాగ్రత్తగా ఒక ప్లేట్‌లో ఉంచాలి ∙కొద్దిగా చల్లారగానే మీగడ పొర మీద పంచదార వేయాలి ∙అదేవిధంగా మళ్లీ మీగడ తీసి, మళ్లీ పంచదార చల్లాలి ∙ఈ విధంగా మొత్తం పాలు ఇగిరిపోయేవర కు చేయాలి ∙మొత్తం పూర్తయ్యాక మీగడలో పాలు ఏమైనా మిగిలి ఉంటే, మీగడను నెమ్మదిగా ఒత్తి పాలు తీసేసి, మీగడను ముక్కలుగా కట్‌ చేయాలి ∙వీటి మీద కొద్దిగా మైదా పిండి చల్లి, కాసేపు పక్కన ఉంచాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఒక ప్లేట్‌లో కొద్దిగా మైదా పిండి చల్లి, ముందుగా తయారుచేసి ఉంచుకున్న ముక్కలను అందులో వేసి జాగ్రత్తగా పిండి అంటేలా చేసి, సరైన ఆకారంలోకి జాగ్రత్తగా ఒత్తుకోవాలి ∙రెండేసి ముక్కల చొప్పున నేతిలో వేసి సన్నని మంట మీద బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేయించాలి ∙ముందుగా తయారుచేసి ఉంచుకున్న పాకాన్ని మళ్లీ స్టవ్‌ మీద ఉంచి, వేయించిన ముక్కలను అందులో వేసి బాగా కలిపి దింపేయాలి ∙పది నిమిషాల తర్వాత, బాదంపిస్తా పప్పులతో అలంకరించి సర్వ్‌ చేయాలి.

కదమ్‌ ఖీర్‌
కావలసినవి: రసగుల్లాలు – 8 (పొడిగా ఉన్నవి), పచ్చి కోవా – 150 గ్రా. (100 గ్రా. లడ్డూ తయారీ కోసం, 50 గ్రా. పైన అద్దడం కోసం), పంచదార పొడి – 2 టేబుల్‌ స్పూన్లు, పాలు – 2 టేబుల్‌ స్పూన్లు, రోజ్‌ ఎసెన్స్‌ – 2 చుక్కలు

తయారి: ∙కదమ్‌ ఖీర్‌ తయారుచేయడానికి అరగంట ముందు రసగుల్లాలను పంచదార పాకంలో నుంచి బయటకు తీయాలి ∙ఒక పాత్రలో సన్నగా తురిమిన పచ్చికోవా, పంచదార పొడి, పాలు, రోజ్‌ ఎసెన్స్‌ వేసి మెత్తగా అయ్యేలా నెమ్మదిగా కలిపి, ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙ఒక్కో ఉండను చేతిలోకి తీసుకుని వడ మాదిరిగా ఒత్తి, అందులో రసగుల్లా ఉంచి అన్నివైపులా మూసేసి, పై భాగం నున్నగా ఉండేలా లడ్డూలాగ చేతితో సరిచేయాలి ∙కోవాలో మిగిలిన భాగాన్ని సన్నగా తురిమి ప్లేట్‌లో వేసి, తయారుచేసి ఉంచుకున్న లడ్డూలను అందులో దొర్లించి, తీసి పేపర్‌ కప్‌లో ఉంచాలి. (లడ్డూలను ముందుగా పంచదార పాకంలో దొర్లించిన తరవాత కోవాలో దొర్లించాలి. అలా చేయకపోతే లడ్డూలకు కోవా అంటుకోదు)

మిష్టీ ధోయ్‌
కావలసినవి: చిక్కటి పాలు – లీటరు, గడ్డ పెరుగు – 4 టేబుల్‌ స్పూన్లు, పంచదార – పావు కేజీ

తయారి: ∙మందపాటి పాత్రలో పాలు పోసి, మధ్యమధ్యలో కలుపుతూ, అరలీటరు అయ్యే వరకు పాలను మరిగించి, దించి చల్లార్చాలి  స్టౌ మీద బాణలి వేడయ్యాక, పంచదార వేసి గోధుమరంగులోకి వచ్చి, కరిగే వరకు కలిపి దించేయాలి  పాలను జత చేసి మెత్తగా గిలక్కొట్టాలి ∙చివరగా పెరుగు జత చేసి, జాగ్రత్తగా కలపాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసి, మూత పెట్టి సుమారు నాలుగు గంటలు అలా ఉంచేయాలి ∙మిస్టీ ధోయ్‌ తయారయిందనిపించాక, ఆ పాత్రను ఫ్రిజ్‌లో ఉంచి, రెండు గంటల తర్వాత చల్లగా సర్వ్‌ చేయాలి.
– సేకరణ: డా. వైజయంతి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement