
ఏ ముఖానికి ఏ లోలకులు?
బ్యూటిప్స్
రకరకాల ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ఫ్యాషనే. చెవుల నుంచి భుజాల వరకు వేలాడే హ్యాంగింగ్స్‌ను చూస్తే ఎవరికైనా ఒకసారి పెట్టుకోవాలని మనసు పోతుంది. ఎవరైనా చూసి ముచ్చటపడి అలాంటివే కొని ధరిస్తే చాలా సందర్భాలలో మిగిలేది అసంతృప్తే. ముఖాకృతిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్ అందంగా కనిపిస్తుంది.
ఓవల్ షేప్: ఈ ముఖాకృతి ఉంటే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ముఖానికి ఏ మోడల్ అయినా చక్కగా నప్పుతుంది. చెవులకు అంటినట్లుండే దిద్దులు, చెవి అంతటికీ కప్పినట్లు ఉండే డిజైన్ల నుంచి మీడియం సైజు లోలకుల వరకు అన్నీ బాగుంటాయి. ఇక భుజాలను తాకే హ్యాంగింగ్స్ అయితే చెప్పక్కరలేదు. ఎంతమందిలో ఉన్నా ప్రతి ఒక్కరి దృష్టి వాటి మీద, వాటిని అలంకరించుకున్న వాళ్ల మీద కొన్ని సెకన్లపాటు కేంద్రీకృతమవుతుంది. వీరికి మెటల్, బీడ్స్, స్టోన్స్ హ్యాంగింగ్స్ కూడా నప్పుతాయి.
స్క్వేర్ షేప్: ఈ ముఖాకృతికి ఇయర్ రింగ్స్‌ను కొంచెం జాగ్రత్తగా ఎంచుకోవాలి. ముఖం ఆకారానికి పూర్తి విరుద్ధంగా ఉండాలి చెవి ఆభరణాలు. కొట్టొచ్చినట్లు కనిపించేవిగా కాకుండా పొందికగా ఉన్నట్లనించే మోడల్స్ తీసుకోవాలి. అందులో వాడిన బీడ్స్ రంగులు కూడా హుందాగా ఉండాలి.
హార్ట్ షేప్: దీనినే ట్రయాంగిల్ ఫేస్ అని కూడా అంటారు. ఈ ముఖం ఉన్న వారు చెవుల దగ్గర తక్కువగా ఉండి కింద వేళ్లాడే భాగం వెడల్పుగా ఉండే ఇయర్ హ్యాంగింగ్స్ ధరిస్తే అందంగా కనిపిస్తారు. వీరికి నుదురు వెడల్పుగా ఉండి చెంపలు పలుచగా, కింది దవడలోపలికి, గడ్డం కొనదేలి ఉంటుంది. చెవుల నుంచి గడ్డం మధ్యలో ఉన్న గ్యాప్‌ని హ్యాంగింగ్స్ ద్వారా కవర్ చేయగలిగితే ఆ ఇయర్ రింగ్స్ వాళ్ల కోసమే డిజైన్ చేశారా అన్నట్లుంటుంది.
రౌండ్ షేప్: ఈ ముఖానికి ఇయర్ రింగ్స్ సైజు, పొడవు మీద దృష్టి కేంద్రీకరించాలి. మెడ పొడవును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముఖాకృతి హైలైట్ అయ్యేటట్లు ఇయర్ రింగ్స్ ఉంటే మంచిది. పొడవు హ్యాంగింగ్స్ కాని మీడియం సైజువి లేదా చెవిని అంటిపెట్టుకుని ఉంటే దిద్దులు ఏవైనా సరే వాటి డిజైన్‌లో రౌండ్ ఉండకూడదు. ఓవల్ షేప్ కాని, నలుచదరం లేదా ఒకదాని కింద మరొకటిగా వేలాడదీసినట్లున్న బీడ్స్ వంటివి అందగిస్తాయి.