
పొదుపుతో సంపాదించండి!
ఆర్థికం
కొందరు మహిళలు డబ్బు వ్యవహారాలు తమ పని కానే కాదని, అంతా పురుషులే చూసుకుంటారని వారి మీద వదిలేస్తారు. అలా కాకుండా, ఇంటి సరుకులు, పిల్లల ఫీజులు అన్నీ ఒక పద్ధతి ప్రకారం ఖర్చు పెడితే మీరు కూడా కొద్ది మొత్తాన్ని సంపాదించినట్టే! ఇప్పటివరకు ఆర్థిక విషయాలలో అనుభవం లేకపోయినా సరే, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీ పద్ధతిలో పొదుపు చేయండి
ఇలా...
కొద్ది కొద్దిగా కొనుక్కోవడమే ఉత్తమం: కూరగాయలు కొద్ది కొద్దిగా కొనుక్కునే కంటే టోకున కొనేస్తే చౌకగా వచ్చే మాట నిజమే. అయితే ఇందులో లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఎందుకంటే వారం పదిరోజులకి సరిపడా కూరలు ఒకేసారి కొనేసి ఫ్రిజ్‌లో కుక్కేస్తుంటారు అందరూ. దీనివల్ల ఫ్రిజ్ ఎక్కువ విద్యుత్‌ను వాడుకుంటుంది. దానితోపాటు కూరగాయలు ఎంత ఫ్రిజ్‌లో ఉన్నా వడలటం, కుళ్లిపోవటం, చెడిపోవటం సహజం. అలా కాకుండా ఖరీదు కొద్దిగా ఎక్కువైనా, ఎప్పటికప్పుడు కొనుక్కోవడం వల్ల తాజాగా ఉంటాయి. విటమిన్లు నష్టపోకుండా ఉంటాయి.
ఉచితం జోలికి వెళ్లనే వద్దు... ఒకటి కొంటే ఇంకొకటి లేదా రెండు ఉచితం అనే ప్రకటన చూసి ఇట్టే బుట్టలో పడిపోతుంటారు. అలా అమ్మే వాటిలో ఒకదానికే రెండిటి ధర వేస్తారు. ఒకవేళ చవకగానే ఇచ్చినా, నిల్వ ఉన్నవి, కాలం చెల్లిపోయినవి (ఔట్ డేటెడ్ లేదా ఫెయిల్యూర్ మోడల్స్), అంతగా మన్నికలేనివే ఉంటాయి. పైగా, మరోటి ఉచితంగా వచ్చిందే కదా అనే ధీమాతో, అంత జాగ్రత్త తీసుకోం. అందుకే ఉచితం వద్దు... ధర ఎక్కువైనా, నాణ్యమైనవి, మన్నికైనవే తీసుకోండి.
ఆన్‌లైన్‌లో కొనండి... కానీ... ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌లో అమ్మకాలు, కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. బయట మార్కెట్‌లో దొరికే వాటితో పోల్చితే, ఇవి కాస్తంత చవకగానే వస్తాయి. కొన్ని ఆన్‌లైన్ విక్రయ సంస్థలు నిర్ణీత మొత్తానికి మించి కొంటేనే షిప్పింగ్ ఛార్జీలు ఉచితం అని నిబంధన విధిస్తాయి. దాంతో మనం షిప్పింగ్ ఛార్జీలు తప్పించుకోవడం కోసం అవసరానికన్నా ఎక్కువ వస్తువులు లేదా అంతగా ఉపయోగం లేని వాటిని కూడా కొనుగోలు చేయవలసి వస్తుంది. కాబట్టి షిప్పింగ్ ఛార్జీలు చెల్లించండి... దానివల్ల అదనపు వస్తువులు కొనవలసిన భారం తప్పుతుంది.