ఎబోలా... దేవుడు విధించిన శిక్షా?! | Ebola is God's punishment? | Sakshi
Sakshi News home page

ఎబోలా... దేవుడు విధించిన శిక్షా?!

Published Thu, Aug 14 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM

ఎబోలా... దేవుడు విధించిన శిక్షా?!

ఎబోలా... దేవుడు విధించిన శిక్షా?!

దైవికం

ప్రజల్లో భయం తగ్గించడానికి దేవుడిని భూమి మీదకు లాగడంలో తప్పులేదు. ప్రజల్ని భయపెట్టడానికి దేవుడిని తోడు తెచ్చుకోవడాన్ని మాత్రం బహుశా ఆ దేవుడు కూడా హర్షించకపోవచ్చు.

చరిత్రలో క్రూరులైన పాలకులు చాలామందే ఉన్నారు. వారిలో దేవుడిని అడ్డు పెట్టుకుని పరిపాలించినవారు కూడా అక్కడక్కడ కనిపిస్తారు. సాధారణంగా.. దేవుడంటే నమ్మకం లేని రాజులు, చక్రవర్తులే కదా క్రూరులుగా తయారవుతారు. మరి క్రూరులు అయి ఉండీ, దేవుడిని కూడా ఒక ‘శిక్షల అధికారి’గా అడ్డు పెట్టుకున్నవారిని ఏమనాలి? మహా క్రూరులు అనాలేమో. దేవుడిని అడ్డం పెట్టుకున్నంత మాత్రాన దేవుడిపై నమ్మకం ఉన్నట్లా? కాదు. దేవుడిపై నమ్మకం ఉన్నవారిని దేవుడి పేరుతో అదుపు చెయ్యడానికి ఈ మహాక్రూర పాలకులు దేవుణ్ణి అవసరార్థం తమ రాజ్యంలోకి తెచ్చుకుంటారు. అటువంటి పాలకులలో చెంఘీజ్‌ఖాన్ ఒకరని డి.డబ్ల్యు.విల్కిన్ అంటాడు. నేరుగా అనడు. చెంఘీజ్‌ఖాన్ చేతే అనిపిస్తాడు.
 
డి.డబ్ల్యు. విల్కిన్ అమెరికన్ రచయిత. మంచి కథకుడు. రొమాన్స్, సైన్స్‌ఫిక్షన్, ఫాంటసీ ఆయన ప్రత్యేకతలు. వీటన్నిటి కన్నా కూడా చరిత్రకు కాల్పనికతను జోడించి రాసే ఆయన రచనలు విషయాన్ని తేలిగ్గా అర్థం చేయిస్తాయి. ఆయన రాసిన ‘చెంఘీజ్‌ఖాన్స్ రూల్స్ ఫర్ వారియర్స్’ పుస్తకంలో ఓ చోట చెంఘీజ్ ఇలా అంటాడు. ‘‘నేను దేవుడి చేతి ముళ్ల కొరడా ను. మీరు గనుక ఘోర పాపాలు చేయకపోయి ఉంటే, దేవుడు నన్నొక శిక్షగా మీ మీదకు ప్రయోగించేవాడు కాదు’’ అని.

చెంఘీజ్‌ఖాన్ నిజంగానే ఇలా అన్నాడా? లేక ఇది రచయిత విల్కిన్ కల్పించిన మాటా? ఏదైనా కావచ్చు. అయితే చెంఘీజ్ స్వభావాన్ని బట్టి అతడు నిజంగానే అలా అని ఉంటాడని అనుకోవడంలో తప్పు లేదు. క్రీ.శ. 1206-1227 మధ్య మంగోలు సామ్రాజ్యాన్ని పరిపాలించిన చెంఘీజ్‌ఖాన్‌కు అత్యంత క్రూరుడైన పాలకుడిగా పేరు. అతడి మతం ‘షామనిజం’. పితృదేవతలను పూజించడం షామనిజంలోని ఆచారం. అయితే చెంఘీజ్ షామనిజంతో పాటు తక్కిన మతాల మీద కూడా ఆసక్తి కనబరిచాడని, భిక్షువులను రప్పించుకుని బౌద్ధం గురించి, ముల్లాలను పిలిపించుకుని ఇస్లాం గురించి, ప్రబోధకులకు ఆహ్వానం పంపి క్రైస్తవ మతం గురించి తెలుసుకునేవాడని విల్కిన్ లాంటి చరిత్రకారులు రాశారు. దీన్ని బట్టి చెంఘీజ్‌ఖాన్‌ను ఆస్తికుడైన మహాక్రూరుడు అనుకోవాలి. ఎలా అనుకోవడం? ఆస్తికత్వానికి, క్రౌర్యానికీ పొంతన కుదరదే! కుదుర్చుకుని ఉంటాడు. సామ్రాజ్యవాది ఎంతకైనా గుర్రాన్ని దౌడు తీయిస్తాడు.
 
ఇటీవల లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్‌లీఫ్ ఒక ప్రకటన విడుదల చే శారు. దేశ పౌరులంతా మూడు రోజుల పాటు నిరాహారంగా ఉండి, దేవుని క్షమాభిక్ష కోసం ప్రార్థించాలని; అప్పుడు గానీ ఎబోలా వైరస్ నుంచి లైబీరియాకు విముక్తి లభించదని! ఆమె ఎందుకిలా చేశారు? చెంఘీజ్‌ఖాన్‌లా తన పాలనకు దేవుడిని అడ్డు పెట్టుకున్నారా? లేదు. లైబీరియాలో ఇప్పటికే ఎబోలా వ్యాధితో వందల మంది మరణించారు. దానికి చికిత్సగానీ, మందులు గానీ లేకపోవడంతో ఎబోలా ప్రబలుతుందేమోనని లైబీరియాతో పాటు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి.  ఈ తరుణంలో ‘లైబీరియన్ కౌన్సిల్ ఆఫ్ చర్చస్’ ఎబోలాకు దేవుడిని ముడిపెట్టి ప్రజలంతా నీతిమంతులుగా ఉండాలని కోరింది. ‘‘లైబీరియా మీద దేవుడు కోపంగా ఉన్నాడు. అందుకే ఎబోలాతో శిక్షిస్తున్నాడు.  కనుక ప్రజలంతా తక్షణం తమ పాప కార్యాలను కట్టిపెట్టి దేవుడిని క్షమాపణ కోరాలి. అప్పుడుగానీ ఎబోలా శాంతించదు’’ అని కౌన్సిల్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఆ పిలుపునకు స్పందించిన లైబీరియా అధ్యక్షురాలు తనూ అదే రకమైన ప్రకటన చేశారు తప్ప ఇంకేమీ కాదు.
 
అయితే దీనిపై పశ్చిమ ఆఫ్రికా దేశాల్లోని క్రైస్తవ మండళ్లు, ముఖ్యంగా ఘనా క్రిస్టియన్ కౌన్సిల్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ఎబోలాకు, దేవుడికి ఏ మాత్రం సంబంధంలేదు. ఎబోలా ఒక వ్యాధి. దానిని నిర్మూలించేందుకు, వ్యాపించకుండా చూసేందుకు ఘనా వైద్య శాఖ ఉంది’’ అని కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి రెవరెండ్ క్వబేనా తనూ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఆ ప్రకటనతో నిమిత్తం లేకుండా ఘనా నాయకులు లైబీరియా నాయకురాలు ఎలెన్ జాన్సన్ మాదిరిగా ఎబోలా భారాన్ని దేవుడి మీదే వేశారు. సర్వశక్తి సంపన్నుడైన ప్రభువు ఘనాను తప్పక కాపాడతాడని అంటూ, ‘‘ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొఱ్ఱపెట్టుము. నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరచెదవు’’. (కీర్తనలు 50:15) అనే బైబిల్ వాక్యాన్ని గుర్తుచేస్తున్నారు.
 
ప్రజల్లో భయం తగ్గించడానికి దేవుడిని ఇలా భూమి మీదకు లాగడంలో తప్పులేదు. చెంఘీజ్‌ఖాన్‌లా ప్రజల్ని భయపెట్టడానికి దేవుడిని తోడుతెచ్చుకోవడాన్ని మాత్రం బహుశా ఆ దేవుడు కూడా హర్షించకపోవచ్చు.
 - మాధవ్ శింగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement