ఆ బొమ్మ నాది కాదు... ఆయనదే
విద్య - విలువలు
‘‘నేనిది చేసి తీరుతా’’ అని సంకల్పం చేయడం తప్పుకాదు. ‘‘కానీ ఇది నేను చేస్తా. నేనెందుకు చేయలేను’’ అని అనుకున్నాననుకోండి. కానీ నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే వేరొకడున్నాడన్నమాటకు అర్థం లేదు. నేను అనుకున్నవన్నీ జరగకుండా ఆపగలిగినవాడు ఒకడున్నాడనే స్పృహ అవసరం.
అందుకే రేపటి రోజున అయోధ్యకు రాజుగా రాముడికి పట్టాభిషేకం చెయ్యాలనుకున్న దశరథ మహారాజు అలా చెయ్యగలిగాడా! రాత్రికి రాత్రి చేయలేకపోయాడు. లక్ష్మణస్వామి వచ్చి ‘‘రాజ్యం ఇవ్వకుండా ఉండడానికి నాన్నగారెవరు? అన్నయ్యా, అనుజ్ఞ ఇయ్యి, దశరథుణ్ణి చంపేస్తా’’ అన్నాడు. దానికి రాముడేమన్నాడో తెలుసా ‘‘నాన్నగారు నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇస్తానన్నా, ఈవేళ కూడా ఆయనకు ఇవ్వాలని ఉన్నా... ఇవ్వకుండా ఎలా ఆగిపోయింది? ఆయనకు కోరికలేక కాదుగా. నాన్నగారికి ఇవ్వాలని ఉన్నా, నాకు పుచ్చుకోవాలని ఉన్నా ఆయన ఇవ్వలేక, నేను పుచ్చుకోలేక ఎవ్వరం కాదనలేని ఒకానొక స్థితిని కల్పించినవాడు మన మాంసనేత్రాలకు కనబడనివాడు ఒకడున్నాడు. దానికి నాన్నగారినెందుకురా నిందిస్తావ్! ఆ దైవాన్ని అనుసరించు’’ అన్నాడు.
సుందరకాండలో సీతమ్మ అద్భుతమైన మాట ఒకటంటుంది. హనుమ వెళ్లి అంత కష్టంలో ఉన్న సీతమ్మకు రాముని క్షేమవార్త చెప్పాడు. అదే పరిస్థితిలో కనుక మనం ఎవరమైనా ఉంటే ఏమంటాం... ‘‘ఇక్కడినుంచి నేను బయటపడే రోజు ఉంటుందంటావా హనుమా’’ అని. కానీ ఆమె ఏమన్నదో తెలుసా...
‘‘హనుమా, నేను కనబడడం లేదన్న బెంగతో రాముడు తాను చేయవలసిన పనులు మానేసుకున్నాడా? లేకపోతే నన్ను పొందే కార్యక్రమం పెట్టుకుని దాని వ్యగ్రతలో ‘నాకు ఈశ్వరుడు ఏనాడు అనుకూలించాడు కనుక, నేనెందుకు పూజించాలి ఆయన్ని’ అనుకుని భగవంతుడిని పూజించడం మానేశాడా? ఎలా ఉన్నాడు రాముడు చెప్పు’’ అని అడిగింది.
ఆమె ఎందుకలా అడిగిందంటే... కష్టాల మధ్యలో భగవంతుడి ఉదాసీనత మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఏదో ఒకనాడు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. నూరేళ్ళు బతికినవాడు ఎప్పుడో ఒకప్పుడు శుభవార్త వింటాడు. కాబట్టి ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, దాన్ని నెరవేర్చాలనే పట్టుదల ఉండడం మంచిదే. కానీ ఆ కార్యాన్ని ఏ కారణం చేతనో నీవు చేయలేకపోతే ‘ఇది నీవు చేయవద్దు. చేస్తే ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇక వద్దు’ అని ఆ పని చెయ్యకుండా ఆపినవాడు ఒకడున్నాడని గుర్తించినవాడిది పండిన బతుకు. అంతే తప్ప-నేను చేయాలనుకున్నా, వాడు నన్ను చేయనివ్వడం లేదనే వ్యగ్రత పెట్టుకుని పూజ మానేస్తే నీకొరిగేదేమిటి?’’
ఒక కార్యం చేయాలన్న ధైర్యం ఉండాలి. ఆటుపోటు తట్టుకోగలగాలి. కానీ ఈ పని అయి తీరాలి. కాకపోతే?? పరమేశ్వరుడి దగ్గరినుంచి కనబడిన ప్రతివాడినీ బాధ్యుడిని చేస్తాననే భావన, అందరినీ నిందించే తత్త్వం ఉండకూడదు. లక్ష్య సాధన తాను ఏ స్పష్టతతో మొదలు పెట్టాడో అదే స్పష్టతతో అంతే చిరునవ్వుతో ముందుకు తీసుకెళ్ళగలగాలి. ఇదీ ధృతి అంటే. ఇది ఎవరికి ఉందో వాడు మాత్రమే లక్ష్యాన్ని సాధించగలడు. అది లేని వాడు ఏదైనా సాధించిన రోజున పొంగిపోతాడు. లేకపోతే కృంగిపోతాడు. వాడితో కార్యములు సాధింపబడవు. ఒకవేళ సాధింపబడినా ఆ పని లోకంలో నిలబడుతుందేమో గానీ, ఆ సంకల్పం చేసిన వ్యక్తి మాతం ఆదర్శవంతుడిగా నిలబడలేడు. అందుకే ధృతి కలగడం అన్నది అంత తేలికైన విషయం కాదు. అది జీర్ణమైనవాడికే చెల్లుతుంది.
గుంటూరులో నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ ఇంటి పెద్దకు ఒక కుమారుడున్నాడు. వాడు తండ్రితో ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. రాత్రి నాన్నగారి కాళ్లు పడుతూండగా, ఇంట్లోవాళ్లు ఏవో సరుకులు కావాలంటే ‘‘నాన్నగారండీ, ఇప్పుడే షాపుకెళ్లి పట్టుకొచ్చేస్తా’’ అని చెప్పి బయటకు వెళ్లినవాడిని ఒక వాహనం తొక్కేస్తే చనిపోయాడు. ఈ విషయం నాకు తెలియదు. ఆ మరుసటి సంవత్సరం నేను వెళ్లి మాటల సందర్భంలో ‘‘మీ అబ్బాయి ఎలా ఉన్నాడండీ’’ అని అడిగా.
‘‘ఆ బొమ్మను ఈశ్వరుడు తీసుకున్నాడండి’’ అన్నాడు. ‘‘మీరేవంటున్నారో నాకర్థం కాలేదు’’ అన్నా. ‘‘ఆ బొమ్మతో ఆడుకోమని నాకు ఆయన కొన్నాళ్లు ఇచ్చాడండీ. ఏమైనా అది ఆయనదే కదూ. నా వస్తువు నాకు కావాలని ఆయన దానిని పట్టుకెళ్ళిపోయాడు. అంత ఆప్యాయతతో నాకు ఆ బొమ్మ ఇచ్చి, అంతే స్వతంత్రంగా నా దగ్గర నుంచి ఆయన ఆ వస్తువు తీసుకున్నందుకు, ఇన్ని మధుర స్మృతులు మిగిల్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నాడు. అది ధృతి. నరనరాన జీర్ణమయిన వేదాంతం. ఆ స్థాయికి ఎదగడం మనం నోటితో చెప్పినంత తేలిక కాదు. ఆయన నిజమైన వేదాంతి.
ధృతి, సంకల్పం ఎప్పుడూ భక్తితో ముడిపడి ఉంటాయి. ‘ఈశ్వరానుగ్రహం చేత నేను చేస్తున్నాను తప్ప నా అంతట నేను చేసేది కాదు’ అన్న స్థితి. అది సంకల్ప శుద్ధి. అది లక్ష్య శుద్ధి. అందుకే లంకకు బయల్దేరే ముందు హనుమ ఏం చెబుతాడంటే... ‘‘నేను యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలను. నాకా శక్తి ఉంది. నేను ఉత్తర తీరాన నిలబడి వంగి దక్షిణ తీరాన్ని ముట్టుకోగలను. కానీ నేను ఎలా వెడతానంటే... బంగారు కోదండాన్ని పట్టుకున్న రామచంద్రమూర్తి వింటినారిని సంధించి ఆ కర్ణాంతం లాగి వదిలినప్పుడు బాణం ఎలా వెడుతుందో అలా వెడతాను. బాణం విడిచిపెడితే రాముడి శక్తి బాణంలోకి చేరి అది వెడుతుంది. అది నా శక్తి కాదు. రాముడి శక్తి’’ అంటాడు.
అందుకే కేవలం ఒక లక్ష్యం పెట్టుకోవడం కాదు, అది చెదిరిపోకుండా నిలబడగలిగిన శక్తిని ఒకడివ్వాలి. వాడు ఉన్నాడు. అలా వాడు ఉన్నాడన్న నమ్మకమే భక్తి. వాడు నాకు సంకల్ప బలాన్ని ఇస్తాడని, దానియందు నిలబడగలిగిన శక్తిని ఇస్తాడని నమ్మడమే లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. అటువంటి సంకల్పం నెరవేరిననాడు అది పదికాలాల పాటూ, పదిమందికి పనికి వచ్చేదిగా ఉండడమే కాక, సాధకుడు కూడా ఆదర్శంగా చిరకాలం నిలిచిపోతాడు.