టూకీగా ప్రపంచ చరిత్ర 73
వ్రాత ఉపరితలంగా ఈజిప్టులో పుట్టుకొచ్చిన మరో సాధనం ‘పపైరస్’. ఈ పదం నుండే ‘పేపర్’ అనే పదం పుట్టుకొచ్చింది. వెదురు చువ్వకు సమానమైన చుట్టుకొలతతో పెరిగే నీటి మొక్క పపైరస్. బెరడు గోకేసి, కాండాన్ని 40 సెం.మీ. నిడివితో పల్చటి పొరలుగా చీల్చి, అంచులను అతికించి తొలి పొరమీద మరో పొరను అంటించి కాగితపు టావులాగా తయారుచేస్తారు. క్రీ.పూ. తొలి శతాబ్దంలో పుట్టిన ఈ సాధనం మధ్యధరా తీరంలోని అన్ని నాగరికతలకూ వేగంగా విస్తరించింది. ఇదే తరహాలో ప్రవేశించిన మరో సాధనం ‘తాళపత్రం’. రాతకు అనుకూలించేంత నునుపుగా తీర్చిన తాటాకు మీద, కంచు ఘంటంతో ఆకారాలు గోకి, స్పష్టంగా కనిపించేందుకు వీలుగా ఆ గాట్లను నల్లటి మసితో నింపుతారు. తాటిచెట్టు దొరకని ఉత్తరభారతదేశంలోని దీని స్థానాన్ని ఆక్రమించింది ‘భూర్జపత్రం’. అడుగు పెట్టీ పెట్టకముందే ఈ పరికరాలన్నిటినీ ఒక్క విసురుతో తోసేసింది ‘కాగితం.’ క్రీ.శ. 206-220ల మధ్య కాగితం అనే సాధనం చైనాలో రూపుదిద్దుకుని, ‘సిల్క్ రూట్’ ద్వారా నాగరిక ఫ్రపంచానికి విస్తరించి, గత 1600 సంవత్సరాలుగా సార్వభౌమాధికారం చెలాయిస్తూనే వుంది.
తిరిగి మరోసారి వెనుకటి తరాకు చేరుకుంటే,చిత్రలిపికి సంభవించిన మార్పులు కూడా మనం తెలుసుకోవచ్చు. క్రీ.పూ. 3000 నాటికి వ్యాపారం ఎంత విస్తరించినా, అది సమాజంలో ఒక భాగమే తప్ప సర్వస్వం కాదు. అనాది నుండి కాలక్షఏపం కోసం ఆదరించబడిన కథాగానాలు ఇప్పుడు లిఖితరూపంలోకి మార్చుకునేందుకు పురోహిత, పూజారి వర్గాలు తాపత్రయపడుతున్నాయి. కానీ, ఆ భావాల విస్తృతిని ఇమిడించుకునేందుకు తొలితరాల చిత్రలిపి పొలిమేరలు చాలకొచ్చాయి. చిత్రలిపి ప్రధానంగా ప్రాతినిధ్యం వహించేది ఆకృతులకు మాత్రమే. మేక గుర్తు గీస్తే ఒక మేక, ఐదు మేకలను సూచించాలంటే అదే బొమ్మను మరో నాలుగుసార్లు వరుసగా చిత్రించేంత స్థలం అవసరమౌతుంది. అందువల్ల, స్థలాన్ని పొదుపు చెయ్యాలంటే, మేక బొమ్మకు సంఖ్యను తెలిపే సంకేతం అదనంగా జతచెయ్యాలి.
ఇబ్బందులు అంతటితో తీరేవిగావు. చిత్రలిపి గోచర పదార్థాలకు పరిమితమైన సంకేతం. చూపుకు అతీతమైన పదార్థాలనూ, దృశ్యాలనూ, భావాలనూ తెలియబరిచే మార్గమేది? అంతేకాకుండా, చిత్రలిపిలో క్రియలకు స్థానం తక్కువ. తనకు తానుగా భావాన్ని సంపూర్ణంగా వ్యక్తం చేయడం చిత్రలిపికి సాధ్యపడదు. ఉదాహరణకు - ఒక యక్షుని శిల్పం ఉంది. శిల్పంలో యక్షుని కుడిచేతి చూపుడువేలు అతని బొడ్డు మీద ఉంటుంది. ఎడమచేతి చూపుడు వేలు విగ్రహానికి ఎడమవైపు ఆనించి వున్న గదను చూపిస్తూంది. ఆ గదతో తన పొట్టను పగలగొట్టమని ఆ యక్షుడు కోరుతున్నట్టు మనకు తెలియజేయాలంటే మార్మిక సంకేతాలతో పరిచయముండే మధ్యవర్తి అవసరం. వ్యాఖ్యాత లేకుండా, తనకు తానుగా ఆ శిల్పం మనకు అర్థం కాదు. అందువల్ల క్రీ.పూ. 3500 కాలంలో ఏర్పడిన ముడి లిపి, కాలానుగుణ్యమైన మార్పులూ చేర్పులతో మెరుగుపడుతూ వచ్చింది.
మెసొపొటేమియా ప్రాంతంలోని క్యూనిఫాం లిపికి, పరిణామ క్రమంలోని ఒకానొక దశలో, సాహిత్యానికి వీలయ్యే రూపం ఏర్పడిందనటానికి తార్కాణం ‘గిల్‌గమేష్’ గ్రంథం. ఎడమనుండి కుడికి నడిచే పంక్తులతో, క్యునిఫాం లిపిలో రచించిన ‘పదకవిత’ ఈ గ్రంథం. మెసొపొటేమియా పీఠభూమి దక్షిణ కొసలో ఏర్పడిన ‘బాబిలోనియా’ సామ్రాజ్యానికి చిట్టచివరి పాలకుడైన ‘అషుర్‌బానిపాల్’ (క్రీ.పూ. 668-627) గ్రంథాలయంలో, అక్కాడియన్ భాషలో రచించిన ఈ పదకవితా కథ 12 మట్టిపలకలుగా దొరికింది. క్రీ.పూ. 1800 ప్రాంతానికే ఇది ఉనికిలోకి వచ్చినా, పరిష్కరించబడిన పాఠ్యాంతరం క్రీ.పూ. 1300-1000 మధ్యలో వెలువడిందిగా నిర్ధారించబడింది.
రచయిత ఫోన్: 9440280655;
email: mvrr44@gmail.com
రచన: ఎం.వి.రమణారెడ్డి