టూకీగా ప్రపంచ చరిత్ర 78
ఏలుబడి కూకట్లు
గుంపును చీల్చి దూరంగా పంపవలసిన అవసరం వచ్చినప్పుడు, ఒక భార్యతోపాటు ఆమె సంతానాన్ని విభజించి తరలించడం ఆర్యుల ఆచారమైనట్టు తెలుస్తుంది. మహాభారతంలో పాండవులను వారణావతానికి కుంతితోసహా తరలిస్తారు. రుగ్వేదంలో యజ్ఞానికి అతిథిగా విచ్చేసేది దేవమాత ‘అదితి’ మాత్రమే; ఆమె భర్త కశ్యపుడు ఎప్పుడూ వెంటరాడు.
పడమటి నుండి వచ్చిన ఆర్యులు, సింధూ ప్రాంతంలోని నగరాలను ధ్వంసం చేసి, అక్కడి ప్రజల్లో కొందరిని తరిమేసి, మిగతావాళ్లను సేవకులుగా చేసుకున్నారనే వాదన ఒకటుండగా, ఆర్యులు పరాయిచోటు నుండి వచ్చినవాళ్లు కారనీ, అసలు సింధూ నాగరికత ఆర్యులదేననేది మరోవాదన. మొదటిది ఎంత నిజమో రెండవదీ అంతే నిజం. సింధూనది నుండి భారత ఉపఖండం పడమటి సరిహద్దు వెడల్పునా విస్తరించి ఉండిన సింధూనాగరిక పౌరుల మూలంగా ఆర్యుల వలసలకు తీవ్రమైన ఆటంకం ఏర్పడిన దాఖలాలు లేవు. సింధు నాగరికతలోని ఏ జనావాసంలోనూ దాడులవల్ల సంభవించిన దుర్మరణాలకు నిదర్శనం కనిపించదు.
సింధూ నాగరికవాసులు ఎవరైనా అయ్యుండొచ్చుగానీ, ఆర్యులు మాత్రం కారని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఆర్యుల ఆచారాలు యజ్ఞయాగాదులతో విడదీయరానివి. సింధూ నాగరికతలో ఆ కర్మకాండకు సంబంధించిన యజ్ఞకుండం, యూపస్తంభం వంటి ఉపకరణాలు ఏవొక్క తావులో కనిపించలేదు. శవసంస్కారంలో ఆర్యులవిధానం ‘దహనం’ అయ్యుండగా, సింధూ నాగరికుల విధానం ‘ఖననం’. సింధూ ప్రాంతంలో కనిపించే ‘తాళిబొట్టు’ ఆచారం వేదంలో కనిపించదు. ఆర్యుల వంటకాల్లో గుర్రపు మాంసం, ఎద్దు మాంసం, దున్నపోతు మాంసాలే కనిపిస్తాయి గానీ, చేపలు వండినట్టు వేదంలో ఎక్కడా కనిపించదు. సింధూప్రాంతీయులు స్థానికంగా దొరికే చేపలు చాలనట్టు, గల్ఫ్‌నుండి ఎండుచేప దిగుమతి చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే మరో పుస్తకమౌతుంది కాబట్టి ఇంతటితో చాలిద్దాం.
ఇంతకూ ఈ ఆర్యులు ఎవరు, ఎక్కడివారు? ఎలాగూ ఇంతదూరం వచ్చాము కాబట్టి, ఆర్యుల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునేందుకు ఈ సందర్భాన్ని వినియోగించుకోవడం ప్రయోజనంగా ఉంటుంది. ఎక్కడివారో చెప్పుకొచ్చే వాదనలు వందల్లో ఉన్నాయి. ఎక్కువ మంది ఏకీభవించిన మూలస్థానాలు రెండు. వాటిల్లో మొదటిది - నైరుతీరష్యాలోని ‘డాన్యూబ్ నది’ పరిసరాలు. రెండవది - దక్షిణరష్యాలోని ‘ఓల్గా నది’ పరిసరాలు. మధ్యధరా సముద్రం ఏర్పడక ముందు, ఉష్ణమండలం నుండి వేట జంతువును వెదుక్కుంటూ యూరప్ ఖండానికి విస్తరించిన ఇతర రాతియుగం మనుషుల్లాగే, ఏ 14 వేల సంవత్సరాలనాడో అక్కడికి చేరుకున్న విల్లనమ్ముల మానవులు వీళ్లు. అక్కడి వాతావరణ ప్రభావంతో వాళ్ల గోధుమరంగు చర్మం నలుపు విచ్చి, తెలుపు రంగుకు మారడం సహజం. అక్కడికి చేరుకున్న రెండు మూడు వేల సంవత్సరాలకు వాళ్లు పశుపోషకులయ్యారు. ఆ తరువాతి దశకు ఎదగకుండా, క్రీ.పూ. 3వ శతాబ్దం వరకూ పశువుల కాపరులుగానే మిగిలిపోయారు. తాత్కాలిక నివాసాలేతప్ప, వాళ్లింకా స్థిరనివాసాలకు ఎదగలేదు. కానీ, పచ్చికబయళ్ల కోసం వాళ్లు విస్తరించని దిక్కు లేదు; యూరప్ ఖండంలో వాళ్లు ఆక్రమించని ప్రదేశం లేదు.
ఇంత విస్తీర్ణానికి చాలేంత జనసంఖ్య ఆర్యులకు ఎలా వచ్చింది? సంస్కృత సాహిత్యం ద్వారా కొంతవరకు మనం ఊహించగలిగే కారణం ఏదంటే - ఆర్యులకు సంతానేచ్ఛ ఒక సంస్కృతి. ఎక్కువ సంతానానికి కారకుడైన పురుషుడు ‘ప్రజాపతి’గా విశిష్టగౌరవం సంపాదించుకుంటాడు. అనేకమంది భార్యల్లో, ఒక్కొక్కరివల్ల వేల సంతానానికి కారకుడు కావడం అతిశయోక్తి కావచ్చుగానీ, ప్రతివొక్క ప్రజాపతికి విస్తారమైన సంతానం ఉండటం అబద్దం కాకపోవచ్చు. వేటజంతువులు పలుచబడినా, పచ్చిక కొరకు వేరు పడినా, ఒకేతెగ రెండు మూడుగా చీలి, వేరువేరు దిశల్లో దూరప్రాంతాలకు తరలిపోవడం కొత్తగాదు. గుంపును చీల్చి దూరంగా పంపవలసిన అవసరం వచ్చినప్పుడు, ఒక భార్యతోపాటు ఆమె సంతానాన్ని విభజించి తరలించడం ఆర్యుల ఆచారమైనట్టు తెలుస్తుంది. మహాభారతంలో పాండవులను వారణావతానికి కుంతితోసహా తరలిస్తారు. రుగ్వేదంలో యజ్ఞానికి అతిథిగా విచ్చేసేది దేవమాత ‘అదితి’ మాత్రమే; ఆమె భర్త కశ్యపుడు ఎప్పుడూ వెంటరాడు.
జనసాంద్రత మూలంగా ఆర్యులు డాన్యూబ్ నదీప్రాంతం నుండి తూర్పునకు ఓల్గానది వరకో లేదా ఓల్గా తీరం నుండి పడమటి డాన్యూబ్ తీరానికో అతివేగంగా విస్తరించి ఉండాలి. ఓల్గా నుండి మరింత తూర్పుకు సాగే అవకాశం లేకుండా ‘ఉరల్’ పర్వతశ్రేణీ, దక్షిణానికి సాగకుండా కాస్పియన్, నల్లసముద్రాల సంగమం అడ్డుకొని ఉండాలి. ఒకప్పుడు ఆ రెండు సముద్రాలు ఒకటిగా కలిసుండేవి. రెండుగా విడిపోయిన తరువాత, వాటి మధ్యన ఏర్పడిన కాకేసియన్ పర్వతాలు వాళ్ల దక్షిణ గమనాన్ని తేలిగ్గా అనుమతించవు. ఆ తరువాత కాస్పియన్ సముద్రం కుంచించుకుని, దానికీ యూరల్ పర్వతాలకూ నడుమ చదునునేల ఏర్పడినా, ఆ నేలలో ఉప్పు తొలగక, చాలాకాలం వరకూ గడ్డి మొలవని బీడుగా నిలిచిపోయింది. అందువల్ల, ఆర్యుల విస్తరణ విధిగా మధ్య యూరప్ ప్రాంతాలవైపు మరలింది.
రచన: ఎం.వి.రమణారెడ్డి