అడుగేస్తే... కరెంటు!
టెక్ టాక్
రోజుకు మనం ఎన్ని అడుగులేస్తాం? అబ్బో కొన్ని వేలు అంటున్నారా? ఒకే... వాటితో ప్రయోజనమేమిటి? ఏముంది... పరిమితికి లోబడి ఉంటే ఆరోగ్యం, లేదంటే నీరసం అంతేకదూ.. కానీ మీ అడుగులు పేవ్‌జెన్ టైల్స్‌పై పడ్డాయనుకోండి. కరెంటు కూడా పుడుతుంది. అదెలా అనుకోవద్దు... మీ పాదం పడినప్పుడు యాంత్రిక శక్తి కాస్తా విద్యుచ్ఛక్తిగా మారేలా టైల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయన్నమాట. సాధారణ టైల్స్ మాదిరిగానే వాడుకోగల వీటిని బ్రిటన్ కంపెనీ పేవ్‌జెన్ తయారు చేస్తోంది. దాదాపు ఆరేళ్ల పరిశోధనల ఫలితంగా పుట్టిన ఈ టైల్స్‌ను ఇప్పటికే లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం, గత ఒలింపిక్స్ సందర్భంగా విజయవంతంగా పరీక్షించారు.
కరెంటును ఉత్పత్తి చేయడంతోపాటు ఈ టైల్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా సేకరించవచ్చు. మాల్‌లోకి ఎంతమంది వచ్చారు? ఏ సమయంలో ఎక్కువ మంది వస్తున్నారు? వంటి వివరాలను సేకరించవచ్చునన్నమాట. ప్రస్తుతానికి ఈ పేవ్‌జెన్ ధర చాలా ఎక్కువ. ఒక చదరపు మీటర్ విస్తీర్ణంలో టైల్స్ ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.10 లక్షల వరకూ ఖర్చు అవుతుందని, సాధారణ టైల్స్ ధరలోనే వీటిని అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.