
ఎపిలెప్సీ రోగులూ... బోర్లా పడుకోకండి!
ఎపిలెప్సీ (మూర్చ లేదా ఫిట్స్)తో బాధపడేవారు బోర్లా పడుకోవద్దని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఇలా పడుకోవడం తీవ్ర ప్రమాదానికి అంటే ఒక్కోసారి మృత్యువుకు దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఎపిలెప్సీ /మూర్చ/ఫిట్స్ ఉన్నవారిపై నిర్వహించిన ఇరవై ఐదు వేర్వేరు అధ్యయనాలతో పాటు, అకస్మాత్తుగా సంభవించిన 253 మరణాలనూ, ఆ మరణాలు సంభవించిన సమయంలో ఆ వ్యక్తులు పడుకొని ఉన్న తీరును పరిశీలించిన అధ్యయనవేత్తలు ఈ జాగ్రత్తను చెబుతున్నారు.
ఇలా బోర్లా పడుకోవడం వల్ల ఎపిలెప్సీ ఉన్న రోగుల్లో నిద్రలోనే చనిపోయే అవకాశాలు 26.7 శాతం పెరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అధ్యయన వివరాలన్నీ ‘న్యూరాలజీ’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.