తిన్నాక వస్తావా?! వచ్చాక తింటావా?! | Even four times a day you can confess that you do not fear | Sakshi
Sakshi News home page

తిన్నాక వస్తావా?! వచ్చాక తింటావా?!

Published Wed, Jun 20 2018 12:32 AM | Last Updated on Thu, Jul 28 2022 7:22 PM

 Even four times a day you can confess that you do not fear - Sakshi

కొడితే నిజం బైటకు రాదు. పడితే నిజం తప్పించుకోలేదు. అమాయకుడ్ని నాలుగుసార్లు కొడితే భయానికి చేయని నేరాన్ని కూడా ఒప్పుకోవచ్చు. అందుకే స్మార్ట్‌ ఎస్‌ఐ కొట్టకుండానే పట్టుకున్నాడు.

వర్దన్నపేట సబ్‌స్టేషన్‌.. వరంగల్‌ జిల్లా. ఎలక్ట్రీషియన్‌ సోమ్లానాయక్‌ ఆఫీసులో అందరికీ స్వీట్లు పంచుతున్నాడు. తన మూడో కూతురు రన్నింగ్‌లో డిస్ట్రిక్ట్‌ టీంకు సెలక్టయిందట.‘ముగ్గురూ కూతుళ్లే అయినా కొడుకుల్లా పెంచుతున్నావు’  ప్రశంసించారు తోటి ఉద్యోగులు.నిజంగానే కూతుళ్లు ముగ్గురూ బంగారమే. ఒకరు స్పోర్ట్స్, ఒకరు చెస్, మరొకరు చదువులో రాణిస్తుండటం సంతోషంగా అనిపించింది సోమ్లాకు. ఆ రాత్రి సంతోషంగా ముగ్గురు కూతుళ్లతో కలిసి భోంచేశాడు. సంతృప్తిగా నిద్రపోయాడు. రోజూ 5 గంటలకు కూతురితోపాటు జాగింగ్‌కి వెళతాడు. కానీ ఆ రోజు కూతురు చలిగా ఉందని, లేవలేను అనడంతో ఒక్కడే బయల్దేరాడు.వరంగల్‌ – ఖమ్మం హైవే నిర్మానుష్యంగా ఉంది. అక్కడక్కడా తనలాంటి కొందరు కనిపిస్తున్నారు. ఈ లోపల ఎక్కడ నుంచి దూసుకొచ్చిందో తెలియదు కానీ ఓ లోడ్‌ లారీ సోమ్లాని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఇదంతా సోమ్లా వెనకాలే వాకింగ్‌ చేస్తున్న రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ చూశాడు. సోమ్లా కాళ్ల మీదనుంచి లారీ చక్రాలు వెళ్లాయి. కొన ఊపిరితో ఉన్నాడు. వెంటనే అతను ఫోన్‌ బయటకు తీశాడు.

టైమ్‌ ఉదయం 5.15. వరంగల్‌ – ఖమ్మం హైవేపై పెట్రోలింగ్‌ ముగించుకుని ఆస్పత్రికి బయల్దేరాడు ఎస్‌.ఐ విశ్వేశ్వర్‌. తన ఏడాది కూతురుకు రాత్రంతా బ్రీథింగ్‌ ప్రాబ్లమ్‌ రావడంతో ఆసుపత్రిలో జాయిన్‌ చేశాడు. ‘పాపకెలా ఉంది డాక్టర్‌’ అడిగాడు విశ్వేశ్వర్‌.‘నథింగ్‌టు వర్రీ.. చలికాలంలో ఇవన్నీ కామనే.. మీరెళ్లి చూడొచ్చు’.. అన్నాడు డాక్టర్‌చిల్డ్రన్‌ వార్డువైపు కదులుదామని అడుగులేస్తుండగా ఫోన్‌ రింగైంది. అప్పుడు సమయం 5:30‘హలో చెప్పండి.. విశ్వేశ్వర్‌ హియర్‌’.. అన్నాడు. ‘సార్‌.. నేను రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ మల్లయ్యను. మన ఇల్లందు గ్రామంలో యాక్సిడెంట్‌ అయింది. ఓ వ్యక్తిని ఢీకొట్టిన లారీ ఆపకుండా వెళ్లిపోయింది’.. ‘ఎంతసేపైంది..?’ అడిగాడు. ‘ఇపుడే సార్‌.. 5 నిమిషాలు అవుతుంది’  ‘అయితే అక్కడే ఉండండి నేను వస్తున్నా’ అంటూ మళ్లీ వెనక్కి తిరిగాడు. దూరంగా వార్డు అద్దాల నుంచి చూస్తున్న అతని భార్యకు విషయం అర్థమైంది ఎవరికో ఏదో ఉపద్రవం ముంచుకొచ్చి ఉంటుందని. యాక్సిడెంట్‌ స్పాట్‌ స్టేషన్‌కి 5 కిమీల దూరంలో ఉంది. అక్కడే అద్దెకుండే తన గన్‌మెన్‌ రఘుని వెంటనే స్పాట్‌కు వెళ్లి విషయం కనుక్కోమన్నాడు. కాసేపటిలోనే ఫోన్‌ రింగైంది. ‘సార్‌.. రఘుని మాట్లాడుతున్నా.. ఆ వ్యక్తి చనిపోయాడు’... అయిదు నిమిషాల తరువాత విశ్వేశ్వర్‌ అక్కడికి చేరుకున్నాడు. మల్లయ్య వచ్చి ‘సార్‌ లారీని సరిగా చూడలేదు.. దూరం నుంచి చూడటం వల్ల లారీ రంగు ఐడియా లేదు. కాకపోతే నల్లటి టార్పాలిన్‌ కప్పి ఉంది’ అని తాను చూసింది చెప్పాడు.

సమయం 5.50. యాక్సిడెంట్‌ అయి దాదాపు 20 నిమిషాలు. కాబట్టి వాడెక్కువ దూరం వెళ్లి ఉండడు. ఎంత వేగంగా వెళ్లినా వరంగల్‌ జిల్లా బోర్డర్‌ దాటడు అనుకున్నాడు ఎస్‌.ఐ. వెంటనే గన్‌మెన్‌ రఘుతో కలిసి తన కారులో బయల్దేరాడు. ఖమ్మం– వరంగల్‌ హైవేలోని అన్ని పోలీస్‌స్టేషన్లను అలర్ట్‌ చేస్తున్నాడు. కానీ, అంతా అప్పుడే నైట్‌ డ్యూటీ ముగించుకుని ఉండటం, లారీ నెంబరు, రంగు, ఇతర వివరాలేమీ లేకపోవడంతో గుర్తింపు సవాలులా మారింది. లారీ కోసం వెదుకుతోన్న విశ్వేశ్వర్‌కు వరంగల్‌ నుంచి ఖమ్మం దిశగా పదుల సంఖ్యలో వెళుతూ లారీలు కనిపిస్తున్నాయి. పైగా అన్నీ  కాస్త అటూ ఇటూగా నలుపురంగు టార్పాలిన్‌ కప్పి ఉన్నాయి. అనుమానం వచ్చిన లారీనీ ఆపడం.. ఫొటోలు, ఫోన్‌ నెంబర్లు తీసుకుని పంపడం. అలా దాదాపుగా 15 లారీల వివరాలు తీసుకుని ముందుకు కదులుతున్నాడు విశ్వేశ్వర్‌. ‘సార్‌ ఇలా అయితే, మనం లారీని పట్టుకుంటామా?’ అంటూ అనుమానం వ్యక్తం చేశాడు రఘు. ‘నీకెందుకు వచ్చిందా డౌటు.. ఎంత నేరస్థుడైనా ఏదో చిన్న తప్పు చేస్తాడుగా.. నువ్వు బండి పోనియ్‌’ అన్నాడు ఎస్‌.ఐ.

యాక్సిడెంట్‌ చేశాక లారీ డ్రైవర్‌ ఆపకుండా అలాగే చాలా స్పీడుగా వచ్చాడు. దారిలో సీసీ కెమెరాలు లేకపోవడం, ఎవరూ వెంబడించకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఒక చోట లారీని ఆపి లారీ చక్రాల వైపు చూశాడు. ఎక్కడా రక్తం అంటిన ఆనవాళ్లు లేవు. పైగా ఎవరూ తనను వెంబడించినట్లు అనిపించలేదు. దీంతో మరిపడ వద్ద ఓ దాబా ముందు లారీ ఆపాడు. అయినా మనసులో ఏదో ఆందోళన. వెంటనే తన అన్నకు ఫోన్‌ చేశాడు. అతను కూడా డ్రైవరే. అన్నకు జరిగింది చెప్పాడు. ‘ఏం భయపడకు. అనవసరంగా కంగారు పడి ఓవర్‌ స్పీడ్‌ వెళ్లకు. జిల్లా బోర్డర్‌లో ఇప్పటికే నీ లారీ కోసం పోలీసులు వెదుకుతుంటారు. ఎందుకైనా మంచిది ఏదైనా దాబా వద్ద లారీని రెండు రోజులు ఆపు. రిపేరు అయిందని మీ ఓనరుకు అబద్దం చెప్పెయ్‌. ఈలోపు లారీకి ఎక్కడైనా రక్తం మరకలు ఉన్నాయో చూసి కడిగెయ్‌’ సలహాలిచ్చాడు అన్న, అన్న చెప్పినట్లు లారీ మొత్తం చెక్‌ చేశాడు. చాలా వేగంగా రావడం వల్ల చక్రాలకు అంటిన రక్తం  పోయింది. స్పీడుగా రావడం వల్ల టైర్లు కూడా వేడెక్కాయి. క్లీనర్‌తో ‘జరిగింది మర్చిపో. లేకుంటే ఇద్దరం లోపలకెళతాం’ అన్నాడు. ‘సరే అన్నా’ అంటూ తలూపాడు క్లీనర్‌. ‘పద టిఫిన్‌ చేద్దాం’ అంటూ దాబాలోకి వెళ్లారు.

ఉదయం 7.30 గంటలు.మరిపడ దాబా వద్ద దాదాపు 6 లారీలు ఆగి ఉన్నాయి. అందులో రెండే లోడ్‌ లారీలు. మిగిలినవి చిన్న టిప్పర్లు. రెండింటికి మాత్రం నల్లరంగు టార్పాలిన్‌ కప్పి ఉంది. మొదటి లారీ వద్దకు వెళ్లాడు ఎస్‌.ఐ విశ్వేశ్వర్‌. లారీ డ్రైవర్, క్లీనర్‌ ఇద్దరూ నిద్రపోతున్నారు. మరో లారీ డ్రైవర్, క్లీనర్‌ కనిపించలేదు. చక్రాల వైపు తీక్షణంగా చూస్తే లారీ టైర్లు ఇంకా వేడిగా ఉండటంతో పాటు ఏదో కనిపించింది. రఘుకు చెప్పి ‘దొరికాడు’ అనుకుంటూ కోపంగా లోపలికి వెళ్లాడు. తనపాటికి తాను ఏదో తింటున్న లారీ డ్రైవర్‌ ఎదుట ఎస్‌.ఐ ప్రత్యక్షమయ్యాడు. ‘తిన్నాక వస్తావా? వచ్చాక తింటావా?’ లాఠీ ఊపుతూ వెటకారంగా అడిగాడు. లోలోపల గుండెలు జారుతున్నా ‘ఏం మాట్లాడుతున్నార్సార్‌?’ అంటూ లేని ధైర్యాన్ని కూడగట్టుకుని ఎదురుప్రశ్నించాడు. ఎస్‌.ఐ చేయి డ్రైవర్‌ చొక్కా కాలర్‌ని పట్టుకుంది. ఒక్క తోపు తోసి ‘యాక్సిడెంట్‌ అయితే, కనీసం లారీ ఆపి వాళ్లు బతికారో, చచ్చారో కూడా చూడాలనిపించలేదా?’ అన్నాడు. ‘మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు. నేను ఏ యాక్సిడెంట్‌ చేయలేదు’ అన్నాడు వణుకుతున్న గొంతుతోనే!ఎస్‌.ఐ అతనివైపు తీక్షణంగా చూశాడు. ఆ చూపులకు జడిశాడు డ్రైవర్‌.. ‘కావాలంటే చూసుకోండి. నా బండికి ఏదైనా డ్యామేజీ ఉందేమో! కనీసం రక్తం మరకలు కూడా లేవు. అలాంటపుడు నన్ను ఎందుకు కొడుతున్నారు సార్‌!’ అన్నాడు డ్రైవర్‌.అంతే, ఆ మాటలకు డ్రైవర్‌ చెంప పేలింది..‘ఒరేయ్‌.. నేను ప్రశ్న అడిగాక సమాధానాలు చెప్పాలి. ముందే చెబుతున్నావంటే తప్పకుండా ఆ యాక్సిడెంట్‌ చేసింది నువ్వే. నేనేదో అనుమానంతో అడిగాను. నువ్వు దానిని క్లియర్‌ చేశావు పద’.. అతన్ని తీసుకెళ్లి లోపలేశాడు. 

ఆ మరుసటి రోజు డ్రైవర్‌ అన్న రంగంలోకి దిగాడు. ‘అసలు మా వాడు ఆ యాక్సిడెంట్‌ చేసినట్లు ఏం రుజువులున్నాయ్‌?’ వర్దన్నపేట స్టేషన్‌లో గొడవకు దిగాడు. ‘మీరు ఈ కేసును కోర్టులో నిరూపించలేరు. మీ వల్ల కాదు. నా తమ్ముడిని ఎలా బయటికి తీసుకురావాలో నాకూ తెలుసు’ అంటూ పోలీసుల వైపు కోపంగా చూసుకుంటూ స్టేషన్‌ గడప దాటాడు. పోలీసులు డ్రైవర్ని రిమాండ్‌కు తరలించారు.కేసు విచారణ చివరి రోజు.. లారీ డ్రైవర్‌ తరఫు న్యాయవాది చాలా సీనియర్, చాలా బలంగా వాదిస్తున్నాడు. ‘ఘటనాస్థలంలో చనిపోయిన వ్యక్తి మినహా అక్కడ ఎవరూ లేరు. దూరం నుంచి చూసిన వారు యాక్సిడెంట్‌ చేసింది నా క్లయింటే అని చెప్పలేకపోతున్నారు. పోలీసులు అసలు ముద్దాయిని వదిలేసి ఏ పాపం ఎరుగని నా క్లయింట్‌ని ఇరికించాలని చూస్తున్నార్డు’ అంటూ జడ్జికి విన్నవించాడు. ‘పైగా పోలీసులు చెబుతున్నట్లుగా లారీ చక్రాలకు అంటుకున్న రక్తం, మాంసం అన్నీ మనిషివేనని ఏంటి గ్యారంటీ? రోజూ రాత్రి కుక్కలు, పందులు, కప్పలు, పాములు ఎన్నో లారీ చక్రాల కింద పడుతుంటాయి. అలాంటపుడు ఆ మాంసం మనిషిదేనని, నా క్లయింట్‌ లారే గుద్దిందని ఎలా చెబుతున్నారు’ అని ప్రశ్నించాడు. దీనికి జడ్జి పోలీసుల వైపు తిరిగి ‘డిఫెన్స్‌ లాయర్‌ ప్రశ్నకు ఏమని సమాధానం చెబుతారు’ అని అడిగారు. స్పందించిన ఎస్‌.ఐ ‘నాకు కాస్త గడువు కావాలిసార్‌’ అని కోరాడు. ‘ఇప్పటికే రెండుసార్లు వాయిదా అడిగారు. ఇది ఆఖరుసారి. కోర్టు సమయాన్ని దుర్వినియోగం చేయకండి’ అన్నాడు హెచ్చరింపుస్వరంతో. తీర్పును వాయిదా వేసింది కోర్టు. డ్రైవర్‌ తరఫు లాయర్, నిందితుడు, అతని అన్న ఎస్‌.ఐ వైపు చూస్తూ వెటకారంగా నవ్వుతూ బయటకు వెళ్లిపోయారు.జడ్జిమెంట్‌ విందామని వచ్చిన సోమ్లానాయక్‌ భార్య, కూతుళ్లు విశ్వేశ్వర్‌ వైపు చూశారు. వారి చూపులకు ‘నాటు టు వర్రీ’ అన్నట్టుగా చేతుల్తోనే ధైర్యం చెప్పి, వెళ్లి జీబులో కూర్చున్నాడు.

తీర్పు రోజు రానే వచ్చింది. విశ్వేశ్వర్‌ ఫోరెన్సిక్‌ రిపోర్టును జడ్జికి అందించారు. డ్రైవర్ని అరెస్టు చేశాక లారీని సీజ్‌ చేసిన పోలీసులు టైర్ల సందుల్లో ఇరుక్కుపోయిన చిన్న చిన్న మాంసం ముద్దలను సేకరించారు.  వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కి పంపారు. చనిపోయిన సోమ్లానాయక్‌ డీఎన్‌ఏతో ఆ మాంసం ముద్దల్లో లభించిన డీఎన్‌ఏ 100 శాతం మ్యాచ్‌ అయింది. దీంతో డ్రైవర్‌ నిందితుడుగా ధ్రువీకరిస్తూ కోర్టు అతనికి శిక్ష వేసింది. సాక్ష్యాధారాల సేకరణలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌.ఐని అంతా అభినందించారు.హైదరాబాద్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో కీలకమైన కేసులు చాలా ఉండటంతో శాంపిల్స్‌ రిజల్ట్‌ రావడం కాస్త ఆలస్యమైంది. అందుకే కేసు తీర్పుకు ముందు మూడుసార్లు వాయిదా కోరాడు విశ్వేశ్వర్‌. తాను సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిన విషయం చివరివరకు దాచి నేరాన్ని నిరూపించగలిగాడు.శిక్ష పడ్డ డ్రైవర్‌ దగ్గరకు వచ్చి అన్నాడు విశ్వేశ్వర్‌– ‘బండికి అంటిన రక్తం కడిగేస్తే సరిపోదురా. టైర్లకు గీతలు ఉంటాయి, వాటి మధ్యలో యాక్సిడెంట్‌కు గురైన బాధితుల రక్తం, మాంసం ముద్దలు అంటుకుని ఉంటాయి. ఈ క్లూ చాలు. పైగా రాత్రంతా బండి నడిపినవాడు తెల్లారాక కాస్త కునుకుతీస్తాడు. నువ్వేంట్రా తీరుబడిగా తింటూ కూర్చున్నావు. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనే అయినా దాన్నుంచి తప్పించుకుపోవాలని చూశావు. కానీ, నేరం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు’ అంటూ టోపీ తలమీదుగా పెట్టుకొని ముందుకు నడిచాడు ఎస్‌.ఐ. 
– అనిల్‌ 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement