
బిడ్డకు కూడా లోకువేనా!
పొద్దున నేను పిలిచేవరకూ మంచం దిగదు మా అమ్మాయి. ఇంజనీరింగ్ అయిపోయింది. ఉద్యోగం వేటలో ఉంది. గట్టిగా కోప్పడితే ఎదురు సమాధానం చెబుతుంది. ‘ఇలాగైతే ఎలా సౌమ్యా? రేపు పెళ్లయ్యాక నీ ఇష్టం వచ్చినట్టు ఉండడం కుదరదు. ఇప్పటి నుంచే కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. పొద్దునే లేవడం, వంటింట్లో నాకు సాయం చేయడం వంటివి చేయకపోతే పెళ్లయ్యాక చాలా కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగం వచ్చినా పొద్దున్నే లేవాలి కదా!’ అని మెల్లగా నచ్చజెప్పి నచ్చజెప్పి విసుగొచ్చింది.
‘ఉద్యోగం వచ్చినపుడు చూద్దాంలే!’ అనేది. ఓ నాలుగు నెలలు గడిచాక ఉద్యోగం వచ్చింది. వచ్చిన జీతం వచ్చినట్టు ఖర్చుపెట్టేసేది. ‘అదేంటే...’ అంటే? ‘నా జీతంతో నీకు పనేంటమ్మా? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా!’ అంటోంది. వాళ్ళ నాన్నగారి ద్వారా భయం చెబుదామనుకుంటే...ఆయన కారణంగానే అమ్మాయికి భయమన్నది పోయింది. సంపాదించింది సంపాదించినట్టు ఖర్చుపెట్టేయడం ఆయన నైజం. పెళ్లయ్యాక ఆయన వ్యక్తిత్వం తెలిసింది. తెలిసి ఏం చేయగలను! బిడ్డ పుట్టాకనయినా దారిలో పడతారనుకుంటే చిన్న మార్పు కూడా లేదు. ప్రతిరోజు ఇంట్లో గొడవలే. ఆడపిల్లను పెట్టుకుని విడిపోయి బతకడమంటే సమాజం సూటిపోటి మాటలతో, చూపులతో పొడుస్తుందని ఇంట్లోనే విడిగా ఉండడం మొదలుపెట్టాం. బిడ్డ గురించి ఆయన అస్సలు పట్టించుకునేవారు కాదు. నేనేమో దాన్ని చూసుకుని బతికేదాన్ని. చాలా గారాబంగా పెంచుకున్నాను. ఇంటి ఖర్చుల నిమిత్తం ఆయన కొంత డబ్బిచ్చేవారు. అంతే! నేను పడుతున్న ఇబ్బందులు చూస్తూ పెరిగిన అమ్మాయి నన్ను అర్థం చేసుకుంటుందంటే అంతా రివర్స్ అయింది. తన లోపాలకు సంబంధించి నేను మాత్రమే భయం చెబుతుండడంతో ‘నాన్న నన్నెపుడూ ఒక్క మాట కూడా అనలేదు.
నీకు నన్ను తిట్టడం తప్ప వేరే పనిలేదు’ అంది ఒకరోజు. నాకు బుర్రంతా గిర్రున తిరిగినట్టయింది. ‘నువ్వు కష్టపడితే నీ బిడ్డకు కష్టం ఎలా తెలుస్తుందే! దానికి కూడా కష్టం రుచి చూపించాలి. అడిగిందల్లా కొనిచ్చి...అన్నదానికల్లా తలాడించడం వల్ల ఈరోజు నీ విలువ తెలియడం లేదు దానికి’ అని మా అమ్మ చెప్పిన మాటలు అక్షరాలా వాస్తవం. దానికితోడు తండ్రి నన్ను లెక్కచేయకపోవడంతో ‘అమ్మమాట వినకపోతే నన్నెవరేమంటారు...’ అనే భావన కూడా సౌమ్య మనసులో బలంగా ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యతలోపిస్తే పిల్లలు దాన్ని ఎంత లోకువగా తీసుకుంటారో అనడానికి నా జీవితం నిలువెత్తు నిదర్శనం. బంధువులు, ఇరుగుపొరుగువారికే కాకుండా బిడ్డకు కూడా లోకువైపోయానన్న బాధ, దానికితోడు భవిష్యత్తులో బిడ్డ జీవితం ఎలా ఉంటుందోనని దిగులుపట్టుకుంది. మన కష్టాలు పడడం వల్ల బిడ్డలు బుద్ధిమంతులైపోరు, వారిని కూడా కష్టపడనివ్వాలి. తోటివారిని అర్థం చేసుకునేలా చేసే శక్తి అది మాత్రమే ఇవ్వగలదు!
- సరోజ, నల్గొండ