
నిండు నూరేళ్లు బతకాలనుకుంటున్నారా? అయితే ఈ ఐదు మార్గాలు పాటించండి అంటున్నారు హార్వర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఆ ఐదు మార్గాలు ఏమిటి అంటున్నారా? చాలా సింపుల్. రోజూ వ్యాయామం చేయండి. ఆరోగ్యకరమైన తిండి తినండి... ఒంటి బరువు పెరగకుండా చూసుకోండి. మద్యం మరీ ఎక్కువగా తాగొద్దు. ధూమపానం అసలే వద్దు. అంతే! ఇలా చేస్తే ఆయుష్షు కొన్ని దశాబ్దాలపాటు పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన జీననశైలిని పాటించే అమెరికన్ మహిళలు గుండెపోటుతో మరణించే అవకాశాలు 82 శాతం తక్కువని, కేన్సర్ విషయానికొస్తే ఇది 65 శాతం వరకూ ఉంటుందని వీరు జరిపిన తాజా అధ్యయనం చెబుతోంది.
దాదాపు 78 వేల మంది మహిళల తాలూకూ 34 ఏళ్ల సమాచారం, 45 వేల మంది పురుషుల తాలూకూ 27 ఏళ్ల సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. మొత్తం మీద చూస్తే అధిక ఆదాయ దేశాలన్నింటితో పోలిస్తే అమెరికాలో సగటు ఆయుష్షు అతి తక్కువగా 79.3 ఏళ్లుగా ఉందని తేల్చింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటే వచ్చే ఫలితాలను హైలైట్ చేసేందుకు ఈ అధ్యయనం పనికొస్తుందని అంచనా. బాడీ మాస్ ఇండెక్స్ 24.9 కంటే తక్కువగా ఉండటం, రోజుకు కనీసం 30 నిమిషాలపాటు వ్యాయామం చేయడం, పుష్టినిచ్చే తిండి, కాయగూరలు, పండ్లు తీసుకోవడం దీర్ఘాయుష్షుకు ముఖ్యమని ఈ అధ్యయనం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment