వింటర్‌లో వ్యాయామం.. వస్తోంది ఆయాసం! | Exercise in winter Coming with fatigue | Sakshi
Sakshi News home page

వింటర్‌లో వ్యాయామం.. వస్తోంది ఆయాసం!

Published Fri, Dec 15 2017 12:00 AM | Last Updated on Fri, Dec 15 2017 12:00 AM

Exercise in winter Coming with fatigue - Sakshi

పల్మునాలజీ కౌన్సెలింగ్‌

నా వయసు 38. గతంలో డస్ట్‌ అలర్జీ ఉండేది. నా ఫ్రెండ్స్‌ కొందరు వింటర్‌లో వ్యాయామాలు చేస్తుంటే నేను వారితో పాటు ఎక్సర్‌సైజ్‌ మొదలుపెట్టాను. కానీ వ్యాయామం చేస్తున్నప్పుడల్లా ఆయాసం వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. – మనోహర్, పాలకొల్లు
వ్యాయామం కొన్నిసార్లు ఆస్తమాను ప్రేరేపించి, ఆయాసం వచ్చేలా చేస్తుంటుంది. అందుకే దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఆస్తమా కనిపిస్తుంటుంది. సాధారణంగా మనం శ్వాస తీసుకునే సమయంలోనే  బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడి, ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి అనుకూలమైన ఉష్ణోగ్రతను సమకూర్చుకుంటుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారన్నమాట. దాంతో గాలిని తీసుకెళ్లే మార్గాలు ఒక్కసారిగా ఈ చల్లగాలితో ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకేళ్లే దారులు సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి...

∙పొడి దగ్గు వస్తుండటం ∙ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ∙ పిల్లికూతలు వినిపించడం ∙వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు) ∙వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేశాక 5 – 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం (ఎక్సర్‌సైజ్‌ ఇండ్యూస్‌డ్‌ ఆస్తమా) కారణంగా వ్యాయామ ప్రక్రియను ఆపాల్సిన అవసరం లేదు. దీన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకోడయలేటర్స్‌ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్‌బ్యుటమాల్‌ వంటి బీటా–2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితోపాటు వ్యాయామానికి ముందర వార్మింగ్‌ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్‌ డౌన్‌ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. తొలుత పరిమితం సమయంలో వ్యాయామం చేస్తూ, ఆ వ్యవధిని పెంచుకుంటూ పోవడం వల్ల మీరు ఈ సమస్యను అధిగమించవచ్చు.

పల్మునరీ ఫైబ్రోసిస్‌ అంటే...?

నాకు గత ఆర్నెల్లుగా దగ్గు, ఆయాసం వస్తోంది. చాలామంది డాక్టర్లకు చూపించుకున్నాను. చివరకు ఒక డాక్టర్‌గారు దాన్ని పల్మునరీ ఫైబ్రోసిస్‌ అని నిర్ధారణ చేశారు. ఆ తర్వాత ‘జబ్బుకు కారణమేమిటో తెలుసుకోవా’లన్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి తగిన సలహా ఇవ్వండి. – సుకుమార్, ఖమ్మం
పల్మునరీ ఫైబ్రోసిస్‌ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక జబ్బు. ఇందులో ఊపిరితిత్తుల మీద చారల్లాగా వస్తాయి. ఇలా చార (స్కార్‌) రావడం పెరిగిపోతే అది కనెక్టివ్‌ టిష్యూ అనే కణజాలమంతా ఒకేచోట పోగుబడుతుంది. దాంతో మృదువుగా ఉండాల్సిన ఊపిరితిత్తుల గోడలు మందంగా మారతాయి. ఫలితంగా రక్తానికి తగినంత ఆక్సిజన్‌ అందదు. దీనివల్ల రోగులు ఆయాసపడుతూ ఉంటారు. కొంతమంది రోగుల్లో దీనికి కారణం ఏమిటో తెలుసుకుంటారు. అయితే కొందరికి ఇలా జరగడానికి కారణం ఏమిటో తెలియదు. ఇలాంటి జబ్బును ఇడియోపథిక్‌ పల్మునరీ ఫైబ్రోసిస్‌ అంటారు. సాధారణంగా ఆయాసం, ఏదైనా పనిచేస్తున్నప్పుడు అది మరింత ఎక్కువ కావడం, ఎప్పుడూ పొడిదగ్గు వస్తుండటం, అలసట, ఛాతీలో ఇబ్బంది, కొంతమందిలో ఛాతీనొప్పి, ఆకలి తగ్గడం, నీరసించిపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.  

సాధారణంగా ఇది ప్రధాన జబ్బు కాదు. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య తర్వాత రెండో (సెడండరీ) సమస్యగా ఇది వస్తుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం (ఆటోఇమ్యూన్‌), వైరల్‌ ఇన్ఫెక్షన్స్, టీబీ లాంటి బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ వంటి కారణాలతో ఇది వస్తుంది. ఇక ఎప్పుడూ ఆస్బెస్టాస్, సన్నటి ఇసుక రేణువులనూ, సిమెంటు నిండి గాలి పీలుస్తుండటం, నిమోనియాను కల్పించే బ్యాక్టీరియా, ఫంగస్‌లతో ఉన్న గాలిని పీల్చడం, కోడిదాణా వంటి వ్యవసాయ పరిశ్రమలకు సంబంధించిన వాసనలు ముక్కుకు తగులుతూ ఉండటం వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. సిగరెట్‌ పొగ ఈ కండిషన్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది. సాధారణంగా దీనికి చాలా పరిమితమైన చికిత్స మాత్రమే లభ్యమవుతోంది. మంచి మందులు ఇంకా ప్రయోగదశలోనే ఉండి, అందుబాటులోకి రావల్సి ఉంది. ప్రస్తుతం కార్టికోస్టెరాయిడ్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటర్‌ మందులు వాడుతూ ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు, నొప్పి, ఎర్రబారే పరిస్థితిని (ఇన్‌ఫ్లమేషన్‌ను) అదుపు చేసే స్థితిలోనే వైద్యశాస్త్రం ఉంది. దీనికి తోడు అవసరమైనప్పుడు ఆక్సిజన్‌ పెట్టాల్సి ఉంటుంది. మీరు పెద్ద సెంటర్‌లలో నిపుణులైన పల్మునాలజిస్ట్‌లను సంప్రదించండి.
డాక్టర్‌ రమణ ప్రసాద్‌
కన్సల్టెంట్‌ పల్మునాలజిస్ట్‌ అండ్‌
స్లీప్‌ స్పెషలిస్ట్, కిమ్స్, సికింద్రాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement