ఎంతో కాలంగా మెడనొప్పి... | family health counciling | Sakshi
Sakshi News home page

ఎంతో కాలంగా మెడనొప్పి...

Published Thu, Mar 15 2018 12:22 AM | Last Updated on Thu, Mar 15 2018 12:22 AM

family health counciling - Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌
నా వయసు 54 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా?  – కె. దశరథ్‌ కుమార్, అనంతపురం 
మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్‌ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా, జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. 

కారణాలు: ∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం ∙డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ∙వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ∙ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్‌లలో మాట్లాడటం ∙ఎల్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం 
∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. 
లక్షణాలు: ∙సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం ∙తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ∙నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ∙నడకలో బ్యాలెన్స్‌ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. 
హోమియో చికిత్స: జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్, సీఎండీ, 
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

సోరియాసిస్‌నుంచి విముక్తి ఎలా? 
నా వయసు 39 ఏళ్లు. చాలా రోజుల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని  మందులు వాడినా సమస్య పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? 
– ఎస్‌. దయాకర్‌రావు, నిజామాబాద్‌

సోరియాసిస్‌ అనేది ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్‌ సమస్య. ఇది చర్మ సమస్యే అయినా ఇది మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్యగా పరిగణించాలి. ఈ వ్యాధి వచ్చిన వారిలో చర్మ కణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడి, అవి వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్ల వంటివీ  ఏర్పడతాయి. దురద కూడా ఎక్కువ. చిరాకుగా ఉంటుంది. సోరియాసిస్‌ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15శాతం మందిలో ఆర్థరైటిస్‌ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్‌ ఆర్థరైటిస్‌’ అంటారు. 

కారణాలు: ∙వంశపారంపర్యం ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత ∙దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం. 
లక్షణాలు: ∙చర్మం ఎర్రబారడం ∙తీవ్రమైన దురద ∙జుట్టు రాలిపోవడం ∙కీళ్లనొప్పులు ∙చర్మం పొడిబారినప్పుడు పగుళ్లు ఏర్పడి రక్తస్రావమూ అవుతుంది. 
నిర్ధారణ పరీక్షలు: స్కిన్‌ బయాప్సీ, ఈఎస్‌ఆర్, సీబీపీ, ఎక్స్‌–రే పరీక్షలు. 
చికిత్స: సోరియాసిస్‌ నివారణ/చికిత్సలకు హోమియోలో సమర్థమైన మార్గాలు ఉన్నాయి. అయితే సోరియాసిస్‌ను వెంటనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి ఈ సమస్యనుంచి విముక్తి కోసం సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. 
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి,  ఎండీ (హోమియో), 
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

యానల్‌ ఫిషర్‌ నయమవుతుందా? 

నా వయసు 62 ఏళ్లు. నాకు మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్‌  ఫిషర్‌ అని, ఆపరేషన్‌ తప్పదంటున్నారు. నాకు ఆపరేషన్‌ అంటే భయం. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.  – వేణుగోపాలరావు, సంగారెడ్డి 
మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్‌ అంటారు. ఆహారంలో పీచుపదార్థాలు తగ్గడం వల్ల మలబద్దకం వచ్చి, మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్‌ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇటీవల మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఈ రకమైన సమస్యలు చాలా మందిలో గతంలో కంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆపరేషన్‌ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టే అవకాశాలు ఎక్కువ. అయితే హోమియో వైద్య విధానంలో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా చికిత్స చేసే అవకాశం ఉంది. 

కారణాలు: ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్‌ ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్‌ సమస్య వస్తుంది.
లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు  నొప్పి, మంట వంటివి కనిపిస్తాయి.  
చికిత్స: ఫిషర్‌ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్‌ అవసరం లేకుండానే నయం చేయవచ్చు. ఏ సైడ్‌ఎఫెక్ట్స్‌ లేకుండా చికిత్స చేయడం హోమియో విధానం ప్రత్యేకత. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే మంచి ఫలితం ఉంటుంది. 
డాక్టర్‌ టి.కిరణ్‌ కుమార్, డైరెక్టర్, పాజిటివ్‌ హోమియోపతి, 
విజయవాడ, వైజాగ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement