కార్డియాలజీ కౌన్సెలింగ్
మా అమ్మగారికి ఛాతీ నొప్పి వస్తే ఆసుపత్రికి తీసుకెళ్లాం. అన్ని పరీక్షలు చేశాక ఆమెకు కరొనరీ ఆర్టరీ హార్ట్ డిసీజ్ అని చెప్పారు. అంటే ఏమిటి? ఇది రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు చెప్పండి.
– డి. మల్లేశ్వరరావు, కర్నూలు
శరీరంలోని ప్రతి అవయవానికి కొన్ని ప్రత్యేక రక్తనాళాల ద్వారా రక్త సరఫరా జరుగుతుంది. రక్తం ద్వారానే ఆహారం, ఆక్సిజన్ సరఫరా అన్ని కణాలకూ జరుగుతుంది. అన్ని అవయవాలకు అందినట్టే కరొనరీ ఆర్టరీ అనే రక్తనాళాల ద్వారా గుండెకు రక్తం అందుతుంది. వీటిల్లో అడ్డంకులు ఏర్పడితే గుండె కండరకాలకు రక్తం సరిగా సరఫరా కాదు. దాంతో కండరాలు బలహీనమైపోయి గుండె స్పందనలు కష్టమవుతాయి. గుండె తాలూకు రక్తనాళాలైన కరొనరీ ఆర్టరీలు పూడుకుపోయి, తద్వారా గుండెకు రక్తప్రసరణ తగ్గడాన్ని కరొనరీ ఆర్టరీ హార్ట్ డిసీజ్ అంటారు. గుండె రక్తనాళాల్లో కొవ్వును ప్లేక్స్ అంటారు. ఈ ప్లేక్స్ రకరకాలుగా ఉంటాయి. కొన్ని కొవ్వు కణాలతో పెద్దగా ఏర్పడి సన్నటి క్యాప్ కప్పినట్లు పెరుగుతాయి. వాటి ద్వారా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ విధంగా కరొనరీ ఆర్టరీలో కొవ్వు 50 శాతం కన్నా ఎక్కువగా పేరుకుపోతే, అలా తగ్గిన ప్రాంతంలో గుండె కండరాలు దెబ్బతింటాయి. అలా వచ్చే గుండె జబ్బులను కరొనరీ ఆర్టరీ డిసీజెస్‌గా చెబుతారు. మామూలు వ్యక్తుల కన్నా పొగతాగే వాళ్లలో ఎక్కువ. కొలెస్ట్రాల్ పెరగడం కూడా కరొనరీ హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్. కొలెస్ట్రాల్ పెరగడానికి రెండు ప్రత్యేక కారణాలు ఉంటాయి. అవి... 1) వంశపారంపర్యంగా కొలెస్ట్రాల్ పెరగడం 2) ఆహారం ద్వారా రక్తంలో కొవ్వులు పెరగడం. చిన్న వయసులో కొన్ని జీన్స్ దెబ్బతినడం వల్ల వంశపారంపర్యంగా కొవ్వులు పెరగడం జరగవచ్చు. దాంతో కరొనరీ హార్ట్ డిసీజెస్ చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉంది. ఇక కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం (ఫ్యాట్స్) తీసుకోవడం వల్ల కూడా కరొనరీ హార్ట్ డిసీజెస్ రావచ్చు. అధికబరువు, డయాబెటిస్, హైబీపీ వల్ల కూడా గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లలో రక్తనాళాలు మూసుకుపోయే రిస్క్ ఎక్కువ. సరైన వ్యాయామం లేకపోవడం వల్ల కూడా కరొనరీ హార్ట్ డిసీజెస్ వచ్చే ముప్పు పెరుగుతుంది. అందుకే వారంలో కనీసం ఐదు రోజుల పాటు రోజూ 30 నిమిషాలు పాటు వ్యాయామం చేయాలి. కనీసం వాకింగ్ వంటి వ్యాయమమైనా చేయాలి. ఆల్కహాల్ తీసుకున్నా కరొనరీ హార్ట్ డిసీజెస్ రావచ్చు. జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం, మంచి వ్యాయామంతో ఈ కరొనరీ హార్ట్ డిసీజెస్‌ను చాలావరకు నివారించుకోవచ్చు.
వాల్వ్ సమస్యలు ఎందుకు వస్తాయి
నా వయస్సు 59 ఏళ్లు. ఒకసారి మాకు దగ్గర్ల ఉన్న కార్డియాలజిస్ట్‌ను సంప్రదిస్తే నాకు హార్ట్ వాల్వ్స్‌లో (గుండె కవాటాల్లో) సమస్య ఉందని చెప్పారు. ఈ సమస్యకు గల కారణాలు ఏమిటి? ఈ సమస్య ఉంటే వాల్వ్ మార్చాల్సిందేనా? దయచేసి వివరించండి. – ఎల్. శ్రీధర్‌రావు, మెదక్
గుండె కవాటాల్లో ప్రధానంగా రెండు రకాల సమస్యలు రావచ్చు. అవి... 1. వాల్వ్స్ సన్నబడటం (స్టెనోసిస్) 2. వాల్వ్ లీక్ కావడం (రీగర్జిటేషన్)
వీటికి కారణాలు: ∙కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ∙కొందరిలో రుమాటిక్ హార్ట్ డిసీజెస్ వల్ల ∙మరికొందరిలో ఈ సమస్య పుట్టుకతోనే రావచ్చు ∙కొందరిలో వయసు పెరగడం వల్ల (డీజరేటివ్) వచ్చే సమస్యగా రావచ్చు.
వాల్వ్స్ సమస్యలకు చికిత్స: ఈ సమస్యలను కొంతవరకు మందులతో చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే రోగి పరిస్థితిని బట్టి సర్జరీ అవసరమవుతుంది. ప్రస్తుతం గుండె కవాటాలకు వచ్చే సమస్యలకు సర్జరీ కంటే వాల్వ్‌ను రిపేర్ చేయడానికి అప్పుడు వైద్యులు అత్యంత ప్రాధాన్యం వస్తున్నారు. పైగా ఉన్న వాల్వ్‌నే రిపేర్ చేసిన సందర్భాల్లో జీవితాంతం వాడాల్సిన ఎసిట్రోమ్ (రక్తాన్ని పలచబార్చే మందు) ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రత్యేకంగా మైట్రల్, ట్రైకస్పిడ్ వాల్వ్‌లు అయితే రిపేర్ చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
గుండె జబ్బుల నివారణ ఎలా?
నా వయసు 37 ఏళ్లు. మాకు తెలిసిన ఇద్దరుముగ్గురు సన్నిహితులు ఇటీవల వెంటవెంటనే గుండెజబ్బుతో చనిపోయారు. దాంతో మాకు చాలా ఆందోళనగా ఉంది. గుండెజబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – కె. నవీన్ కుమార్, సిరిసిల్లా
గుండెజబ్బులు ఉన్న కుటుంబ చరిత్ర గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రధాన సూచనలివి...
∙మీలా చిన్న వయసు వారైనప్పటికీ ఇప్పట్నుంచే తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ ఉండటం మేలు. డాక్టర్ సలహాల మేరకు కొన్ని మందులు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకుంటూ ఉండాలి.
∙గుండెపోటు రావడానికి డయాబెటిస్ ఒక ప్రధాన కారణం. అందుకే ఆ సమస్య ఉన్నవారు రక్తంలోని చక్కెరను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. రోజూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ, డాక్టర్ సూచన మేరకు వారు సూచించిన వ్యవధిలో క్రమం తప్పకుండా రక్తంలోని చక్కెరలను పరీక్షించుకుంటూ ఉండాలి.
∙కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించాలి.
∙పొగ తాగే అలవాటును పూర్తిగా వదిలేయాలి. అలాగే పొగాకుకు సంబంధించిన ఉత్పాదనలు, వస్తువులను పూర్తిగా మానేయాలి. గుండెజబ్బుల నివారణలో ఇది చాలా ప్రధానం.
∙డాక్టర్ సూచనల మేరకు శరీరానికి మరీ శ్రమ కలిగించకుండా చేసే వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి.
∙మన ఒంటి బరువును పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
∙రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి.
∙మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఒంటికి అందేలా సమతులాహారం తీసుకోవాలి.
∙ఆరోగ్యకరమైన జీవనశైలిని తప్పనిసరిగా పాటించాలి.
ఈ కొన్ని జాగ్రత్తలతోనే చాలావరకు గుండెజబ్బులను నియంత్రించవచ్చు. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు తమ డాక్టర్లు సూచించిన మందులను తప్పక వాడుతుండాలి. ఆరోగ్యంలో ఏమాత్రం తేడా ఉన్నట్లు అనిపించినా డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. ఈ కొద్దిపాటి సూచనలు పాటిస్తే గుండెపోటు వంటి ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను నివారించడం చాలావరకు నివారించవచ్చు.
డాక్టర్ హేమంత్ కౌకుంట్ల
సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్,
సెంచరీ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్.
Comments
Please login to add a commentAdd a comment