నా వయసు 34 ఏళ్లు. మా నాన్నగారికి డయాబెటిస్ ఉంది. నాకు కూడా ఉందేమోనని అనుమానం వచ్చి, ఇటీవల ఎఫ్‌బీఎస్ (ఫాస్టింగ్ బ్లడ్ షుగర్) పరీక్ష చేయించుకున్నాను. ఆ పరీక్షలో ఫలితం 112 ఎంజీ/డీఎల్ అని వచ్చింది. నాకు డయాబెటిస్ లేదని చెప్పారు. అయితే మా నాన్నగారికి మధుమేహం ఉంది కాబట్టి నాకు కూడా కచ్చితంగా డయాబెటిస్ వస్తుందా. ఒకవేళ వస్తే ఏ వయసులో వస్తుంది? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – సుధాకర్, సామర్లకోట
మీకు ఎఫ్‌బీఎస్ పరీక్షల్లో వచ్చిన ఫలితాన్ని బట్టి చూస్తే మీరు ప్రీ–డయాబెటిక్ దశలో ఉన్నారని అర్థం. అంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న దశ అని అర్థం. మీ నాన్నగారికి డయాబెటిస్ ఉందని తెలిపారు కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డయాబెటిస్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ దశలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్‌ను దరిచేరకుండా జాగ్రత్తపడవచ్చు. మీరు ముందుగా పరీక్షలు చేయించుకోవడం మంచి విషయం. ఎందుకంటే డయాబెటిస్ వచ్చిన తర్వాత నియంత్రించుకోవడం మినహా చేయగలిగినదేమీ లేదు. అయితే ఇప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను నివారించుకోవచ్చు. మీరు ఇకపై డాక్టర్లు సూచించిన ప్రకారం క్రమం తప్పకుండా రక్త పరీక్ష చేయించుకోండి. ఇకపై మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి. ప్రధానంగా మీ బరువును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. అధిక క్యాలరీలు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి. మద్యపానం, పొగాకు వంటి అలవాట్లు ఏమైనా ఉంటే వెంటనే వాటిని మానేయండి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. అలా వీలుకాకపోతే కనీసం వారంలో ఐదురోజులైనా రోజుకు అరగంట పాటు కచ్చితంగా వ్యాయామం చేయండి. తాజా ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోండి. పెసర్లు, మొలకెత్తి గింజలు శ్నాక్స్‌గా తీసుకుంటే చాలా మంచిది. వీలైనంతవరకు వేళకు తినండి. సాధ్యమైనంత వరకు ఒత్తిడిని దరిచేరనివ్వకండి.
డయాబెటిస్ ఉన్నవారు బరువు తగ్గితే ప్రమాదమా?
నా స్నేహితుడి వయసు 41 ఏళ్లు. డయాబెటిస్ వ్యాధి ఉంది. కొన్ని నెలల కిందటి వరకు కాస్తంత బొద్దుగా ఉండేవాడు. బరువు తగ్గడానికి రోజుకు 40 నిమిషాలు వ్యాయామం చేస్తున్నాడు. ఇంతకాలం తన బరువు అదుపులో ఉంది గానీ ఇటీవల అకస్మాత్తుగా బరువు తగ్గడం మొదలయ్యింది. చాలా కొద్దికాలంలోనే బాగా బరువు తగ్గి, చాలా సన్నగా కనిపిస్తున్నాడు. అతడిని చూస్తేనే ఆందోళనగా ఉంది. డయాబెటిస్ వ్యాధి ఉన్నవారు ఇలా అకస్మాత్తుగా బరువు తగ్గితే ఏదైనా ప్రమాదమా? – దామోదర్‌రావు, విజయవాడ
సాధారణంగా ఏమాత్రం ఊబకాయం ఉన్నా బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిదనే అందరమూ అనుకుంటాం. శారీరక వ్యాయామం, క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ, క్రమంగా ఉండాల్సినంత బరువుకు చేరడం మంచిదే. ఇలా బరువు తగ్గడం కొలెస్ట్రాల్, బీపీని అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనికితోడు బరువు తగ్గడం ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించడమే కాకుండా కండరాలు, కణజాలం, రక్తంలోని కొవ్వులు ఇన్సులిక్‌కు స్పందించేలా చేస్తుంది కూడా.
శరీర కణజాలం, కండరాలు గ్లూకోజ్‌ను ఉపయోగించుకొని శక్తి పొందడానికి ఇన్సులిన్ అవసరమవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కండరాలు, కణజాలం గ్లూకోజ్‌ను వాడుకోవాలంటే మామూలు కంటే అధిక స్థాయిలో ఇన్సులిన్ అందుబాటులోకి రావాలి. టైప్–2 డయాబెటిస్‌లో ఈ పరిస్థితి ఉంటుంది. ఫలితంగా ఒక విషవలయం ఏర్పడుతుంది. ఇన్సులిన్ లెవల్ ఎక్కువ అవుతున్న కొద్దీ శరీరం బరువు తగ్గడం కష్టమవుతుంది. మరోవైపు శరీరం బరువు అధికమవుతున్నకొద్దీ ఇన్సులిన్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఈ చక్రవలయాన్ని ఛేదించడం కష్టం. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉద్దేశపూర్వకంగా బరువు తగ్గించుకోవడం మంచిదే. కానీ తమ ప్రయత్నమే లేకుండా శరీరం బరువు తగ్గడం మాత్రం మంచి సూచన కాదు. రక్తంలో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉన్నవారు వారు తరచూ మాత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది.
ఇది డీ–హైడ్రేషన్‌కు దారితీస్తుంది. దాంతో శరీరం బరువు తగ్గిపోతుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు చాలామంది మొదటిసారి డాక్టర్‌ను కలిసినప్పుడు చేసే ఫిర్యాదు తమ బరువు తగ్గిందనే. డయాబెటిస్‌తో పాటు థైరాయిడ్, క్యాన్సర్ వంటి వ్యాధుల వల్ల కూడా శరీరం బరువు తగ్గిపోతుంది. అందువల్ల వ్యాయామం, డైటింగ్ వంటి తమ ప్రయత్నాలు ఏమీ లేకుండా బరువు తగ్గడం ఒక ప్రమాద సూచిక. రక్తంలో చక్కెర పరిమాణంలో మార్పులకు మంచి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమో అని కచ్చితంగా తేల్చుకోవడం అవసరం. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా మీ స్నేహితుడికి పూర్తిస్థాయి వైద్యపరీక్షలు చేయించండి.
డాక్టర్ రామన్ బొద్దుల
సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్,యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment