పొలం బడిలో  పంట పాఠాలు | On the farm Crop lessons in school | Sakshi
Sakshi News home page

పొలం బడిలో  పంట పాఠాలు

Published Mon, Feb 4 2019 1:14 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

On the farm Crop lessons in school - Sakshi

వీళ్లంతా విద్యార్థినులు. కొందరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవారు. మరి కొందరు ఉద్యోగస్తుల, వ్యాపారుల కుటుంబాల పిల్లలు. అందరి లాగా ఇంటర్‌ , ఎంసెట్‌ అయ్యాక.. కార్పొరేట్‌ ఉద్యోగాలను, ఇంజనీరింగ్, మెడికల్‌ వంటి ఏ ఇతర కోర్సులనూ వారు ఎంచుకోలేదు. దేశంలో అందరికి అన్నం పెట్టే రైతులకు తోడుగా, చేదోడుగా ఉండాలనుకుని వ్యవసాయ విద్యలో చేరారు. ప్రాక్టికల్స్‌లో భాగంగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి దాదాపు నలభై మంది ఇటీవల నెల్లూరు జిల్లాకు వచ్చి, గ్రామాలలోనే బస చేస్తూ  క్షేత్ర స్థాయిలో రైతన్నలతో కలిసి పని చేశారు. చదివిన పాఠాలను పొలం పనుల్లోకి అప్లయ్‌ చేశారు. రైతుల అనుభవాలను పాఠంగా నేర్చుకున్నారు.

ఇలా ఆరు నెలల పాటు పొలం బాట పట్టి వెళ్లిన విద్యార్థినులపై ఉత్సాహంపై ప్రత్యేక కథనం. వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతికత. ఆధునిక వి«ధానాలు, వంగడాలు, నీటి వినియోగం, సస్య రక్షణ లాంటి అంశాలలో రైతులకు అవగాహనæ కల్పించేందుకు వివిధ శాఖలు ఎంతోకాలంగా కృషి  చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. వాతావరణానికి అనుగుణంగా పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పురుగు మందుల వినియోగం లాంటి అంశాలలో అవసరమైన మేర పరిజ్ఞానం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ సేద్యంలో తాము కూడా తోడుగా ఉండేందుకు  వ్యవసాయ విద్యార్థినులు తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. 

వ్యవసాయంలో డిగ్రీ చేస్తున్న విద్యార్థినులు తమ కోర్సులో భాగంగా ఆరు నెలల పాటు పల్లెటూళ్లో ఉంటూ.. రైతులతో మమేకమై వారి పొలాలలో పంటను వేయడం దగ్గర నుంచి దిగుబడి వరకూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాలకు చెందిన  బీఎస్సీ (అగ్రి) విద్యార్థినులు పొలం పనులు చేపడుతున్నారు. వ్యవసాయ కోర్సులో భాగంగా ఇటీవలే అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు చెందిన విద్యార్థినులు జిల్లాలోని వివిధ మండలాలకు వచ్చి రైతులతో కలిసి మెలిసి వ్యవసాయదారులుగా మారారు. ఆయా గ్రామాల్లో భూసార పరీక్షలు నిర్వహించారు. పంట కోసం నార్లు వేశారు.

అనంతరం పంట ఎదుగుదలను ప్రత్యక్షంగా çపరిశీలించారు. రైతులకు సలహాలు ఇవ్వడంతో పాటు మార్గదర్శనం చేసేందుకు ఎంతో సహకారం అందిస్తున్నారు. వీరికి  డాట్‌ సెంటర్, వ్యవసాయ పరిశోధన, కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు తమ వంతు తోడ్పాటును ఇస్తున్నారు. రైతులు కూడా వీరితో కలిసి మెలిసి ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో పాలు పంచుకుంటున్నారు. ఆయా గ్రామాల్లోనే నివాసం ఉంటూ.. ఉదయం వేళల్లో పొలం పనులు.. సాయంత్రం గ్రామస్తులకు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను వివరిస్తూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. పట్టణాలలో పుట్టినా పల్లెటూరి వాతావరణంలో ఉంటూ రైతు బిడ్డల్లా పనిచేస్తున్న వీరిని గ్రామంలోని యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరముందని గ్రామస్తులు కూడా అంటున్నారు.   

ప్రాక్టికల్‌గా నేర్చుకున్నాం
మా నాన్న టీచర్‌. కాని ఆయనకు వ్యవసాయం అంటే ఇష్టం. నాన్నకు ఇంట్రెస్ట్‌ అని నేను ఈ రంగంలోకి వచ్చాను. ఆరు నెలలు అక్కడ ఉండి, వ్యవసాయంలో మెళకువలను ప్రాక్టికల్‌గా నేర్చుకున్నాం. ప్రధానంగా ఆర్గానిక్‌ ఫుడ్‌పై ఫీల్డ్‌ రీసెర్చ్‌ చేశాం.

– డి. తేజస్విని, గోరంట్ల, అనంతపురం జిల్లా

ఎన్నో విషయాలు తెలిశాయి
పల్లెల్లో ఉండి పరిశీలించడం వల్ల క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను  గుర్తించగలిగాం. రైతులతో మమేకం కావడం వల్ల వ్యవసాయంలో కొత్త పద్ధతులను తెలుసుకోగలిగాం.

 – పి. మన్విత, 
పోరుమామిళ్ల, కడప జిల్లా


సంతోషంగా అనిపించింది
మొదటి నుంచి మాది వ్యవసాయ కుటుంబం. నాన్న కూడా వ్యవసాయం చేస్తున్నారు.  నగరంలో విద్యను అభ్యసించినా... వ్యవసాయంపై  ఉన్న మక్కువతో ఈ రంగాన్ని ఎంచుకున్నాను. ఇందులో ఉన్నంత సంతోషం మరెక్కడా ఉండదని అనిపించింది.

– కె. అనసూయ, హిందూపురం, అనంతపురం జిల్లా 

పొలమే పెద్ద పుస్తకం
మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, కాని నాకు రైతన్నలా పనిచేయాలని, వ్యవసాయంలో కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి. పుస్తకాలలో చదివే దానికి , ప్రాక్టికల్‌గా చేసే దానికి చాలా తేడా ఉంది. పొలంలో ప్రత్యక్షంగా పరిశీలించి పంటల సాగుబడి తెలుసుకోవడం ఎంతో బాగుంది. 

– కె దివ్య, నంద్యాల, కర్నూలు జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement