లెహంగులు
ఫ్యాషన్
ఆధునిక డ్రెస్సులెన్ని ఉన్నా పండగ వాతావరణాన్ని తేవాలంటే మగువల మనసు మనదైన సంప్రదాయ హంగుల మీదకే మళ్లుతుంది. అప్పుడు అందమైన లెహంగా మదిలో తళుక్కున మెరుస్తుంది. గ్రాండ్‌గా కనిపించాలని దానికి మరిన్ని హంగులు అద్దేవారికోసం వెతుకులాట మొదలవుతుంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇటీవల కాలంలో సినీతారల లెహంగాల హంగులు చూపుతిప్పుకోనివ్వడం లేదు.
మనీష్ మల్హోత్రా, సబ్యసాచి, రితుకుమార్, అంజుమోడి.. వంటి ప్రసిద్ధ డిజైనర్లు సైతం పోటీపడుతున్న లెహంగా డిజైన్లు లెక్కకు మించి ఉన్నాయి. అంతకుమించిన వైభవమూ ప్రతియేటా జరిగే ఫ్యాషన్ షోలలో మనం చూస్తూనే ఉన్నాం.
పండగ లెహంగా! దసరా నవరాత్రులు త్వరలో మొదలవబోతున్నాయి. గార్బాడ్యాన్సులలో వెలిగిపోవడానికి అమ్మాయిలు వెతికే డ్రెస్ లెహంగా చోళీనే. ఆ తర్వాత వచ్చే పండగలో దీపకాంతులతో పోటీపడటానికి ఫ్లోర్ లెంగ్త్ అనార్కలీ లెహంగాలూ ఉన్నాయి.
పెళ్లికి లెహంగా! పండగల వెంటనే పెళ్లిళ్ల సీజనూ మొదలవబోతోంది. సంగీత్, రిసెప్షన్.. వంటి వేడుకలలోనూ హెలైట్‌గా నిలిచేవీ లెహంగాలే. వీటిలో ఇప్పుడు ఫ్లోర్‌లెంగ్త్ అనార్కలీ లెహంగాలూ చోటు చేసుకున్నాయి.
రంగుల కలబోత... లెహంగా గ్రాండ్‌గా కనిపించాలంటే దానికి తగిన కలర్ కాంబినేషన్స్ సరిచూసుకోవడం తప్పనిసరి. దీంతో పాటు స్వరోస్కి, జరీ మెరపులు, బీడ్స్, కుందన్ తళుకులు తప్పనిసరి. దీంతోపాటు పెద్ద పెద్ద అంచులూ లెహంగాకు ఓ కొత్త రూపుకడతాయి. మంచి నాణ్యమైన గాగ్రా తయారీ కోసం రాసిల్క్, బెనారస్, పట్టు.. వీటితో పాటు నెటెడ్ మెటీరియల్‌నూ జత చేస్తే చూడచక్కని లెహంగా రూపుకడుతుంది.
- ఎన్.ఆర్