చాలాకాలం తర్వాత, బహుశా రాజీవ్‌గాంధీ తర్వాత మరోసారి రాజకీయనేతల ఆహార్యం వార్తల్లో విశేషం అయింది. దీనికి ముఖ్యకారణం ప్రధాని నరేంద్రమోడీ. విభిన్న రకాల కుర్తాలు, వస్త్రధారణతో మోడీ సమకాలీన రాజకీయనేతల్లో ప్రత్యేకతను సంపాదించుకున్నారు. సహజంగా రాజకీయనేతల వస్త్రధారణకు అంతగా ప్రాధాన్యం ఇవ్వని ఫ్యాషన్ ప్రపంచం... మోడీ కారణంగా ఒక్కసారిగా తన దృక్పథాన్ని పూర్తిగా మార్చుకుంది.
రాజకీయాల్లోనే కాదు... ఫ్యాషన్ ఐకాన్‌గానూ కూడా భారత ప్రధాని మోడీ ముందంజలో ఉన్నారు. ఆయన ధరించే హాఫ్ స్లీవ్డ్ కుర్తా, నెహ్రూ జాకెట్-ఫిట్టెడ్ పైజామాల కాంబినేషన్ ఇప్పుడు ప్రతి డిజైనర్ బొటిక్‌లో, ఇ-కామర్స్ పోర్టల్‌లో ఉండి తీరాల్సిన ఫ్యాషన్ ట్రెండ్‌గా మారింది. దేశీయంగా ప్రసిద్ధి చెందిన డిజైనర్ జోడి కపిల్-మోనికా అరోరాలు మోడీ స్ఫూర్తిగా రూపొందిన దేశీస్టైల్ డ్రెస్సింగ్‌ను ‘ఓల్డ్ క్లాసిక్ బట్ న్యూ విజన్, న్యూ ఇండియా’ అనే ట్యాగ్‌లైన్‌తో రిలీజ్ చేశారు.‘‘మోడీ విజన్‌లో మాత్రమే కాదు ఫ్యాషన్‌లో కూడా ఇన్‌స్పిరేషన్’అంటారు కపిల్. ఢిల్లీ, ముంబయి, వారణాసి, గుజరాత్‌లలో యూత్ సైతం మోడీ స్టైల్‌ను అనుసరిస్తున్నారని మోనిక గుర్తుచేస్తారు. మోడీ మానియా డాట్ కామ్ పేరుతో ఏర్పడిన సైట్ మోడీ కుర్తా, ఆయన యాక్సెసరీస్‌ను కూడా లాంచ్ చేసింది.
సగం చేతుల కుర్తా ట్రెండ్...
సంప్రదాయ వస్త్రశైలితో భారతీయతకు ప్రతిబింబంలా ఉండడం మోడీకి ప్లస్ పాయింట్. ప్రత్యేకించి సగం చేతుల కుర్తా ఆయన సృష్టించిన ట్రెండ్. ఇది మోడీ కుర్తాగా ఫేమస్ అయింది. అహ్మదాబాద్‌లోని ఖరీదైన దుస్తుల విక్రయకేంద్రమైన ‘జడే బ్లూ’లో ఆయన తన దుస్తులు కొనుగోలు చేస్తారట.
డిజైనర్ల ప్రశంసలు...
‘ఆకట్టుకునే డ్రెస్సింగ్‌లో మోడీని మించిన రాజకీయవేత్త లేర’ని డిజైనర్ పూనమ్ బజాజ్ స్పష్టం చేశారు. ‘నెహ్రూ జాకెట్‌ను ఆయన ధరించే తీరు యువతను సైతం అదే బాటలో నడిపించేలా ఉంది. ఇక ఆయన కుర్తా శైలికి తిరుగేలేదు’ అని డిజైనర్ పూజా మోత్వానీ కొనియాడుతున్నారు. ‘మోడీ నిజమైన భారతీయ రాజకీయనేతకు ఆధునిక చిహ్నంలా ఉంటార’ని డిజైనర్ స్వాతీ మెహ్రోత్రా అంటున్నారు. ఈ మాటతో ఏకీభవిస్తున్న డిజైనర్ రీతూ చాబ్రా... ఆయన ఖాదీ వస్త్రధారణ దేశభక్తిని ప్రేరేపిస్తుందని అభిప్రాయపడ్డారు. ‘ఏ రాజకీయవేత్తా ఎంచుకోని ఆఫ్ బీట్ రంగుల కుర్తాలతో మోడీ కలర్‌ఫుల్ గుజరాత్‌కు ప్రతిబింబంలా ఉంటారం’టూ ఫ్యాషన్ బ్లాగర్ ఆయుషి బాంగ్వర్ పొగిడేస్తున్నారు.
నమో చీరలూ షురూ... ఇటీవల నరేంద్రమోడీ చీరలు కూడా వచ్చేశాయి. నరేంద్రమోడీ ఫ్యాషన్ ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ముంబయి పానేరి చీరల షోరూమ్ మోడీ డిజిటల్ ప్రింట్ ముఖ చిత్రం ఉన్న జార్జెట్ శారీస్‌ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ‘ఈ చీరలకు రూ.2,150 ధరతో, లాంచ్ చేసిన రోజే 160 శారీస్ విక్రయించాం’ అని పానేరి సిఇఒ వినోద్ అంటున్నారు. నమోశారీస్ పేరుతో నాగ్‌పూర్‌లో ఒక వస్త్రదుకాణం విక్రయాలు ప్రారంభిస్తే... మిగిలిన వారు అమాంతం అందిపుచ్చుకున్నారు. సూరత్‌లో తయారవుతున్న బెనారస్ ప్రింటెడ్ జార్జెట్ చీరలు నాగ్‌పూర్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్నాయట. ముఖ్యంగా 20 - 30 ఏళ్ల మధ్య వయస్కులైన యువతులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని విక్రయదారులు అంటున్నారు. పల్లూపై మోడీ ముఖచిత్రం ముద్రించడంతో పాటు ఆంగ్లం, దేవనాగరి లిపిలో ‘నమో’ అక్షరాలను కూడా ముద్రించిన చీరలు ఆకట్టుకుంటున్నాయి.
ఆయనే ఒక ఫ్యాషన్ బ్రాండ్...
మోడీ అభిమానులు ప్రారంభించిన మోడీ మాని యా డాట్‌కామ్‌లో ఆయన కుర్తాలు, యాక్సెసరీస్ వగైరాలు విక్రయిస్తున్నారు. ‘గడచిన 2013 డిసెంబరులో ప్రారంభించిన మా వెబ్‌సైట్ ద్వారా బ్లాక్, స్కైబ్లూ, డార్క్‌బ్లూ... ఇలా 8 రంగుల్లోని మోడీ కుర్తాలను మేం అందిస్తున్నాం’ అని వెబ్‌సైట్ ప్రమోటర్ తివారీ చెప్పారు. జేడ్‌బ్లూలో దొరికే ఈ తరహా కుర్తాలు ఖరీదు ఎక్కువనీ, అయితే మోడీ అభిమానులు తక్కువ ధరలోనే రూ.900 - రూ.1200 వాటిని పొందేందుకు వీలుగా దీన్ని ప్రారంభించామనీ ఆయన అంటున్నారు.
సూపర్బ్ అంటున్న అమెరికన్ మీడియా!
సెప్టెంబరులో భారతప్రధానికి స్వాగతం పలకనున్న అమెరికాలో కూడా మోడీ ఫ్యాషన్ ప్రకంపనలు సృష్టిస్తోంది. న్యూయార్క్‌టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటి అగ్రగామి మీడియా సంస్థలన్నీ తమ కధనాల్లో మోడీ కుర్తా గురించి పొగడ్తల వర్షం కురిపించాయి. ‘మూవ్ ఎసైడ్ మిచెల్ ఒబామా. ది వరల్డ్ హేజ్ ఎ న్యూ ఫ్యాషన్ ఐకాన్’ అంటూ ఓ మీడియా వ్యాఖ్యానించడం గమనార్హం.
- ఎస్.సత్యబాబు
నమో ఫ్యాషన్
Published Wed, Jul 9 2014 11:00 PM | Last Updated on Mon, Sep 17 2018 5:17 PM
Advertisement