నీచు బదులు పీచు మేలు...
ఫైబర్ బెటర్
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? కేవలం ఆహారంలో ఒక చిన్న మార్పు మీ పూర్తి ఆరోగ్యాన్నే మార్చేస్తుంది. మీరు ప్రతిరోజూ మీ ఆహారంలో 30 గ్రాముల పీచు ఉండేలా చూసుకుంటే చాలు. మీ బరువు పెరగరు సరికదా... పెరిగిన బరువూ తగ్గే అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్‌ఏ)సంస్థ టైప్-2 డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉన్న దాదాపు 240 మందిపై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం తెలిసింది.
ఇందులో ఆల్కహాల్, ఉప్పు, చక్కెరలను చాలా పరిమితంగా తీసుకుంటూ పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ఆకుకూరలు, పండ్లు, పొట్టుతీయని ధాన్యాలతో వండిన వంటలతో పాటు కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల మధ్య సమతౌల్యం పాటిస్తే ఏడాదిలోనే 2.72 కిలోలు (ఆరు పౌండ్ల) బరువు తగ్గుతారు. అందుకే నీచు బదులు పీచు తినడమే మేలంటున్నారు ఏహెచ్‌ఏ సంస్థ వారు.