కంప్యూటర్ కాలంలోనూ విద్యార్థులకు కష్టాలేనా...!
వయస్సుకు మించిన బ్యాగు బరువు...ప్రైవేట్ స్కూళ్లలో పోటాపోటీ
చదువే తప్ప ఆటలెక్కడ..మార్కుల పోటీలో వెంటాడుతున్న భయం
చిన్నారుల్లో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు.. కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: బాలల దినోత్సవం రోజైనా.. చిన్నారుల భవితవ్యంపై చర్చ జరగాలని పలువురు విద్యారంగ నిపుణులు కోరుతున్నారు. కంప్యూటర్ల కాలంలోనూ బ్యాగ్‌ల బరువు మోత తప్పడం లేదంటున్నారు. ఆధునిక బోధన విధానంలోనూ చిన్నారులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడటం లేదన్న విమర్శలున్నాయి.
ఉల్లాసాన్నిచ్చే క్రీడలు కనిపించడం లేదు. ఉత్సాహాన్నిచ్చే వాతావరణానికీ దూరమవుతున్నారు. కేంద్ర విద్యాశాఖ సైతం ఈ వాస్తవాలను ఒప్పుకుంది. చిన్నారులను బరువుల మోత నుంచి బయట పడేయాలని సూచనలు చేసింది. కానీ ఎక్కడా ఇది అమలుకు నోచుకోవడం లేదు.
ఇదీ మన చిన్నారుల పరిస్థితి..
కేంద్ర విద్యాశాఖ అధ్యయనం ప్రకారం..70 శాతం మంది విద్యార్థులు పుస్తకాల బరువుతో అనారోగ్యం పాలవుతున్నారు. కండరాలు, మోకాళ్లపై ఒత్తిడి పడుతోంది. 22 శాతం మందిని వెన్నెముక నొప్పి వెంటాడుతోంది.
అతి చిన్న వయసులోనే నీరసం, భుజాలు వంగి పోవడం సర్వసాధారణమైంది. 90 శాతం మందికి ఏడు గంటల నిద్ర కరువే. దీంతో తరగతి గదిలో చురుకుదనం తగ్గుతోంది. బహుళ అంతస్తు భవనాల్లో ప్రైవేట్ స్కూళ్లుంటున్నాయి. బరువు వేసుకొని మెట్లు ఎక్కడంతో అనేక అనారోగ్య సమస్యలొస్తున్నాయి.
ఏవీ ఆ రూల్స్...?
పుస్తకాల బరువుపై కేంద్ర విద్యాశాఖ ఐదేళ్ల క్రితమే హెచ్చరించింది. చిన్నపిల్లల బరువులో పది శాతమే పుస్తకాల బరువు ఉండాలంది. ఇలాంటి పరిస్థితి మరే దేశంలోనూ లేదని బరువులపై అధ్యయనం చేసిన యశ్‌పాల్ కమిటీ చెప్పింది. అధిక బరువుల వల్ల కండరాలపై ఒత్తిడి పడి, భవిష్యత్‌లో దీర్ఘకాల సమస్యలు వెంటాడుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
డిజిటల్ బోధన మేలని సూచించాయి. ఇవేవీ పట్టించుకున్నట్టు లేదు. కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం డిజిటల్ విద్య వైపు మళ్లుతున్నా..మనం ఆ దిశగా అడుగులేయడం లేదు. మార్కుల కోసం గంటల కొద్దీ చదివించే ప్రైవేట్ స్కూళ్లను కట్టడి చేసే దిక్కేలేదు.
భుజాలు నొప్పిగా ఉంటాయి
రోజూ 40 పుస్తకాలను స్కూలుకు తీసుకెళ్లాల్సి వస్తోంది. పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్, వర్క్ïÙట్స్, నోట్‌బుక్స్ ఉంటాయి. లంచ్ బాక్స్, నీళ్లబాటిల్ అన్నీ బ్యాగులో ఉంటాయి. మూడు అంతస్తులు బరువు వేసు కొని ఎక్కాలి. భుజాలు నొప్పిగా ఉంటాయి. –సుంకర నవీన్, ఐదవ తరగతి కూకట్‌పల్లి
మానసికోల్లాసం ముఖ్యం
చదువుతో పాటు చిన్నారుల్లో మానసిక ఉల్లాసం పెంచాలి. అప్పుడే వారిలో ఆలోచన శక్తి వస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో తక్కువ పుస్తకాలతో బోధన ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్లు ఇష్టానుసారం పుస్తకాలు సిఫార్సు చేస్తున్నాయి. ఇలా చెబితేనే మంచి విద్య అని తల్లిదండ్రులూ నమ్ముతున్నారు. వారి ఆలోచన విధానంలో మార్పు రావాలి. – పణితి రామనాథం, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
బరువు తగ్గించాల్సిందే
పుస్తకాల బరువు వల్ల అనారోగ్య వాతావరణం కనిపిస్తోంది. బోధన విధానంలో ప్రపంచ వ్యాప్తంగా మార్పులు వస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో అధిక బరువుల మోతను అరికట్టే యంత్రాంగం ఉండాలి. దీనివల్ల జరిగే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారుల మానసిక వ్యథపై ప్రభుత్వాలు స్పందించాలని కోరుతున్నాం. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి, పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్రఅధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment