బడి సంచులా.. బస్తాలా? | Are these school bags or rice bags | Sakshi
Sakshi News home page

బడి సంచులా.. బస్తాలా?

Published Sat, Jun 10 2017 5:33 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

బడి సంచులా.. బస్తాలా?

బడి సంచులా.. బస్తాలా?

సాక్షి, హైదరాబాద్‌: ఆడుతూ.. పాడుతూ గడపాల్సిన బాల్యం పుస్తకాల బరువుతో భారంగా మారుతోంది. బ్యాగు నిండా పుస్తకాల మోతతో చిన్నారులు అల్లాడిపోతున్నారు. తమ సామర్థ్యానికి మించిన బరువును మోయలేక వారి నడుములు ఒంగిపోతున్నాయి. ఇక రెండు, మూడు అంతస్తుల్లోని తరగతి గదుల్లోకి వెళ్లాలంటే విద్యార్థులకు నరకమే. పుస్తక భారంతో విద్యార్థి శారీరక ఎదుగుదల ప్రమాదంలో పడుతున్నా ప్రభుత్వాలకు మాత్రం పట్టడం లేదు. పుస్తకాల బరువు విద్యార్థి శరీర బరువులో 10 శాతానికి మించకూడదని చిల్డ్రన్స్‌ స్కూల్‌ బ్యాగ్‌ యాక్ట్‌–2006 చెబుతున్నా.. రెట్టింపు (100 శాతానికిపైగా) బరువుతో విద్యార్థుల నడ్డివిరిగిపోతోంది. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులు అసలు పుస్తకాలే మోయవద్దని చట్టం చెబుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు.

బరువే బరువు.. భారంగా చదువు
రాష్ట్రంలోని 11 వేలకుపైగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో రెండు, మూడు అంతస్తుల భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్న స్కూళ్లే అత్యధికం. అసలే బ్యాగు బరువు.. పైగా రెండు, మూడు అంతస్తుల్లో తరగతి.. దీంతో విద్యార్థులు తంటాలు పడాల్సివస్తోంది. పాఠశాల విద్యా శాఖ నిర్వహించిన సర్వేలో విద్యార్థుల వద్ద ఉన్న పుస్తకాలు తూచారు. ఎల్‌బీ నగర్‌లోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో పదో తరగతి విద్యార్థి బ్యాగ్‌లో 15 కిలోల బరువున్న 38 పుస్తకాలు, యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లోని ఓ బడిలో 1వ తరగతి విద్యార్థి వద్ద 7 కిలోల బరువున్న 26 పుస్తకాలు, సూర్యాపేటలోని ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థి వద్ద 25 కిలోల బరువున్న 32 పుస్తకాలు ఉన్నట్టు గుర్తించారు.

అదే సూర్యాపేట మండలం చివమ్ములలో మూడు ప్రాథమిక, మూడు ఉన్నత పాఠశాలల్లో పరిశీలిస్తే పుస్తకాల సంచి బరువు 1.5 కిలోల నుంచి 8.5 కిలోలకు మించలేదని తేల్చారు. ప్రస్తుతం యూకేజీ చదివే విద్యార్థి 14 కిలోలు ఉంటే.. అతని స్కూల్‌ బ్యాగ్‌ బరువే 3.5 కిలోలకు పైగా ఉంటోందని విద్యాశాఖ అంచనా వేసింది. మూడో తరగతి విద్యార్థి బరువు 22 కిలోలు ఉంటే అతని పుస్తకాల బరువే 8 కిలోలకుపైగా ఉంటోంది. ఇక 35 కిలోల బరువు ఉండే ఏడో తరగతి విద్యార్థి పుస్తకాల బరువు 10 కిలోలకు పైగా ఉంటోంది.

చట్టం ఏం చెబుతోదంటే..
– నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులు స్కూల్‌ బ్యాగ్‌ మోయకూడదు. ఇతర తరగతుల వారు విద్యార్థి శరీర బరువుకంటే స్కూల్‌ బ్యాగు బరువు 10 శాతం మించి ఉండకూడదు.
– స్కూల్‌ బ్యాగ్‌ బరువు, రోజువారీగా తెచ్చుకోవాల్సిన పుస్తకాలపై శాస్త్రీయ అంచనాతో పాఠశాలలు తల్లిదండ్రులకు మార్గదర్శకాలివ్వాలి.
– ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పుస్తకాలను స్కూల్లోనే దాచుకునేందుకు లాకర్లను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి.
– ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యాలే విద్యార్థుల పుస్తకాలను స్కూల్లో పెట్టుకునేందుకు(రోజు అవసరం లేనివి ఇంటికి తీసుకెళ్లి మోసుకు రావడం తగ్గించేందుకు) ప్రతి విద్యార్థికీ లాకర్లు, డెస్క్‌లను ఏర్పాటు చేయాలి. వీటిని ఏర్పాటు చేయకపోయినా, ఈ నిబంధనలను పాటించకపోయినా ఆయా స్కూళ్లపై చట్టపరంగా చర్యలు చేపట్టాలి. రూ. 3 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. జరిమానా విధించిన తర్వాత కూడా నిబంధనలను పాటించకపోతే గుర్తింపును రద్దు చేయవచ్చు.

బ్యాగు బరువుతో ఆరోగ్యానికి దెబ్బ..
‘‘విద్యార్థి బ్యాగు బరువు అధికంగా ఉంటే శరీర ఎదుగుదల దెబ్బతింటుంది. ఎముకలు, కండరాల పెరుగులపై ప్రభావం పడుతుంది. మెడ, భుజాలు, వెన్నుపూస పైభాగం, కింది భాగం దెబ్బతిని వెన్నునొప్పి వస్తుంది. భుజాలు ముందుకు ఒంగిపోవడంతో పాటు కిందకు ఒంగిపోతాయి. వెన్నుముక ఒంగిపోవడమే కాక దెబ్బతినే ప్రమాదం ఉంది. శ్వాస సరిగ్గా పీల్చుకోలేని పరిస్థితి వస్తుంది. ఆయాసం పెరుగుతుంది’’అని వైద్యులు చెపుతున్నారు.

తరగతుల వారీగా ఉండాల్సిన పుస్తకాలు, బరువు(కిలోల్లో)
తరగతి        పుస్తకాలు                                                                                బరువు
1    మాతృభాష, ఇంగ్లిషు, గణితం                                                                   0.85
2    మాతృభాష, ఇంగ్లిషు, గణితం                                                                   0.81
3    మాతృభాష, ఇంగ్లిషు, గణితం, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌                                   1.1
4    మాతృభాష, ఇంగ్లిషు, గణితం, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌                                   1.2
5    మాతృభాష, ఇంగ్లిషు, గణితం, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌                                   1.3
6    మాతృభాష, ఇంగ్లిషు, హిందీ, గణితం, సైన్స్, సోషల్‌                                        2.6
7    మాతృభాష, ఇంగ్లిషు, హిందీ, గణితం, సైన్స్, సోషల్‌                                        2.2
8    మాతృభాష, ఇంగ్లిషు, హిందీ, గణితం, సైన్స్‌ (ఫిజికల్, బయలాజికల్‌), సోషల్‌        2.8
9    మాతృభాష, ఇంగ్లిషు, హిందీ, గణితం, సైన్స్‌ (ఫిజికల్, బయలాజికల్‌), సోషల్‌        2.9
10    మాతృభాష, ఇంగ్లిషు, హిందీ, గణితం, సైన్స్‌ (ఫిజికల్, బయలాజికల్‌), సోషల్‌      3.5

కొన్ని ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల బ్యాగులో పుస్తకాలు, వాటి సంఖ్య, బరువు
తరగతి    పుస్తకాలు, నోటు బుక్కుల సంఖ్య            బరువు
1                             16                                  5.5
2                             21                                  7.5
3                             22                                  8.5
4                             23                                  8.7
5                             25                                  9.5
6                             26                                  9.7
7                             27                                  10
8                             30                                  12
9                             34                                  14.5
10                           38                                  16

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement