రెండున్నర ఎకరాల చేపల చెరువులో సాగు చేసే చేపలను కేవలం 484 (22 “ 22) చదరపు అడుగుల పంజరాల(కేజ్‌ల)లో సాగు చేయడం ద్వారా.. నెల నెలా రూ. 25,750ల చొప్పున ఏడాదికి రూ. 3.09 లక్షల ఆదాయం పొందే ఇంటెన్సివ్ కేజ్ కల్చర్ పద్ధతిని కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రూపొందించింది. పెరట్లో తక్కువ స్థలంలో నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ పునర్వినియోగించే ఆక్వా సాగు పద్ధతి కావడంతో రోజుకు కేవలం వెయ్యి లీటర్ల నీరు మాత్రమే అవసరం అవుతుంది. 484 చదరపు అడుగుల పంజరాలలో చేపలు పెంచుతారు. అయితే, నీటి శుద్ధి పరికరాలకు, షేడ్‌నెట్ వేసుకోవడానికి మొత్తం 200 చదరపు మీటర్ల విస్తీర్ణం చోటు అవసరమవుతుంది. రైతులకు నెల నెలా చెప్పుకోదగిన ఆదాయం పొందే ఈ పద్ధతి ద్వారా నీటి వనరులకు తీవ్ర కొరత ఉండే జిల్లాల్లో కూడా యువతను ఆక్వా సాగులోకి ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్.ఎఫ్.డి.బి.), జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్.) ఆవరణలో ఈ రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. రైతులు, యువత స్వయంగా వెళ్లి చూసి అవగాహన కలిగించుకోవచ్చు.
యూనిట్ వెల రూ. 5.6 లక్షలు
22 “ 22 చదరపు అడుగుల్లో ఒక రీ–సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడానికి రూ. 5.6 లక్షలు ఖర్చవుతుంది. జనరల్, ఒబిసి అభ్యర్థులకు 40%, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యుర్థులకు 60% మేరకు ఎన్.ఎఫ్.డి.బి. సబ్సిడీ ఇస్తుంది. మిగతా సొమ్ముకు బ్యాంకు రుణం పొందవచ్చు. పక్కపక్కనే మూడు కేజ్‌లను (ఈ మూడూ కలిపి 22 “ 22 చదరపు అడుగులే) ఏర్పాటు చేస్తారు. ఒక్కో కేజ్‌లో 45 రోజుల తేడాతో చేప పిల్లలను వదులుకుంటే.. 3 నెలల తర్వాత నుంచి ఏడాది పొడవునా దశల వారీగా చేపల దిగుబడి వస్తుందని, తద్వారా రైతుకు ప్రతి నెలా ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రోజుకు వెయ్యి లీటర్ల నీరు చాలు..
మొదట్లో 90 వేల లీటర్ల నీరు నింపుతారు. గిఫ్ట్ తిలాపియా, జెల్ల (పంగాసియస్), కొర్రమేను (ముర్రెల్), కషిమీర (పెర్ల్ స్పాట్) వంటి చేప పిల్లలను వదులుతారు. రెండు వేల నుంచి మూడు వేల చేప పిల్లలను వదులుతారు. అనుదినం నీటిని శుద్ధి చేసే యంత్రాలను ఏర్పాటు చేస్తారు. కాబట్టి రోజుకు 800–1,000 లీటర్ల మడ్డి నీటిని బయటకు తోడేసి, ఆ మేరకు మంచి నీటిని నింపాల్సి ఉంటుంది. ఈ మడ్డి నీరు పోషకాలతో కూడి ఉంటుంది. రోజూ చేపల వయసును బట్టి నీటిపై తేలాడే బలపాల (పెల్లెట్స్) మేత వేస్తారు. మేత అవశేషాలు, చేపల విసర్జితాలు కలిసిన ఈ నీటిలో నత్రజని వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషక జలాన్ని కూరగాయలు, ఇతర పంటలకు పారగట్టవచ్చు. ఇలా పెరిగే చేప పిల్లలు మూడు నెలల్లో మంచి సైజుకు పెరుగుతాయి. నీరు ఎప్పటికప్పుడు శుద్ధి అవుతూ ఉంటుంది కాబట్టి జబ్బుల సమస్య ఉండదు.
ప్రతి మూడు నెలలకు 1,620 కిలోల చేపల దిగుబడి వస్తుందని, కిలో రూ. 180 నుంచి 200 వరకు గిట్టుబాటవుతుందని నిపుణుల అంచనా. ప్రతి 3 నెలలకు రూ. లక్షా 40 వేల వరకు మేత, తదితర ఖర్చులు ఉంటాయి. ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసుకునే వారికి మొదటి 3 నెలలకు అవసరమైన పెంపకం ఖర్చు రూ. లక్షా 40 వేలను ఎన్.ఎఫ్.డి.బి. అందిస్తుందని అధికారులు తెలిపారు.
ప్రతి 3 నెలలకు రూ. 2.4 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఏడాదికి 4 పంటలు తీయవచ్చు. అంటే మొత్తం రూ. 7.29 లక్షల ఆదాయం వస్తుంది. ఇందులో రూ. 4.2 ఖర్చులు పోను నికరంగా రైతుకు రూ. 3.09 లక్షల(నెలకు రూ. 25,750 చొప్పున) నికరాదాయం వస్తుందని ఎన్.ఎఫ్.డి.బి., ఎన్.ఐ.ఆర్.డి. నిపుణులు అంచనా వేస్తున్నారు. కిలో రూ. 400 ధర పలికే కాట్ ఫిష్‌ను కూడా పెంచుకోవచ్చు.
ఎవర్ని సంప్రదించాలి?
తక్కువ స్థలంలో అధిక సాంద్రతలో చేపలను ఉత్పత్తి చేసే ఈ బాక్‌యార్డ్ రీ–సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయదలచుకునే వారు సబ్సిడీ, సాంకేతిక సహాయం కోసం హైదరాబాద్‌లోని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్.ఎఫ్.డి.బి.) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (టెక్నికల్) ను 040–24000113 నంబరు లో సంప్రదించవచ్చు. లేదా హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్.కు చెందిన రూరల్ టెక్నాలజీ పార్క్‌లోని శేఖర్‌ను 98487 80277 నంబరులో సంప్రదించవచ్చు. ఈ రెండు చోట్లా ఈ కేజ్ కల్చర్‌కు సంబంధించిన నమూనాలను ప్రదర్శనకు ఉంచారు. ఎవరైనా వెళ్లి చూడవచ్చు.
ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ జిల్లాలోనైనా ఈ పెరటి చేపల చెరువులను ఏర్పాటు చేసుకోవచ్చని.. అయితే, వీటిపై నీడ కోసం, పక్షుల నుంచి రక్షణ కోసం షేడ్‌నెట్ షెడ్ వేసుకోవడం తప్పనిసరి. అయితే, షేడ్‌నెట్ హౌస్ ఖర్చును రైతులే భరించాల్సి ఉంటుందని రూరల్ టెక్నాలజీ పార్క్ డైరెక్టర్ రమేశ్ శక్తివేల్ ‘సాక్షి’తో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment