రాగనయని | Flares community | Sakshi
Sakshi News home page

రాగనయని

Published Mon, Mar 30 2015 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM

రాగనయని

రాగనయని

మిణుగురులు
 
సమాజానికి దివిటీలు
 
 
కీర్తిరాణి మునివేళ్లు కాసేపైనా సితార తీగలను
మీటకుండా విశ్రమించవు.
ఈమె వేలి స్పర్శ తగలనిదే ఆ సితారకు మెలకువరాదు.
చపులేని కీర్తిరాణికి సితారతో చూపులు కలిసిన
అనుబంధం వయసు పాతికేళ్లు.
అలా సితారకీర్తిగా గుర్తింపు పొందుతున్న కీర్తిరాణి
 స్ఫూర్తిదాయక జీవితమే ఈవారం మిణుగురులు.
 
పాతికేళ్లుగా కీర్తిరాణి ఎన్నో వేదికల మీద సితార ప్రదర్శనలు ఇచ్చారు. ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. సితార తన ప్రాణం అని చెప్పే కీర్తిరాణితో కాసేపు ముచ్చటిస్తే అంచెలంచెలుగా ఆమె పెంపొందించుకుంటూ వచ్చిన ఆత్మస్థయిర్యం ఆద్యంతం మన కళ్లకు కనిపిస్తుంది. కీర్తిరాణి వయసు ముప్పై ఐదేళ్లు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివాసం. పాండురంగారావు (ఏడాది క్రితం మరణించారు), సావిత్రిబాయిల ముగ్గురు సంతానంలో ఒకరు కీర్తిరాణి. ఆరేళ్ల వయసులో  కీర్తికి బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. అప్పుడు ఆమె రెండో తరగతి చదువుతోంది. జబ్బు కారణంగా మూడు నెలల పాటు కోమాలోనే ఉండిపోయింది. తల్లీతండ్రీ తల్లడిల్లిపోయారు. బిడ్డను బతికించమని వేయి దేవుళ్లకు మొక్కుకున్నారు. వారి మొక్కులు ఫలించాయి. కీర్తి కోమా నుంచి బయట పడింది. కానీ, తనకేమీ కనిపించడం లేదని, అంతా చీకటిగా ఉందని చెప్పింది! ఎవరినీ గుర్తుపట్టలేని స్థితి. వైద్యులను అడిగితే ‘జబ్బు వల్ల చూపు పూర్తిగా పోయింది. గతం కూడా మర్చిపోయింది. ఆమెకు ఇది పునర్జన్మ’ అని చెప్పారు.
 
బాలభవన్‌లో సంగీతం

కూర్చోవడం, నిల్చోవడం, నడక.. అన్నీ పసిపాపకు నేర్పించినట్టే కీర్తికి మళ్లీ నేర్పారు ఆమె తల్లిదండ్రులు. నాటి రోజుల గురించి కీర్తి తల్లి సావిత్రిబాయి మాట్లాడుతూ- ‘‘మా ఇల్లు ఎప్పుడూ బంధువులు, వారి పిల్లలతో కళకళలాడుతుండేది. పిల్లలందరూ ఆడుకుంటుంటే కీర్తి వెళ్లి ఒక చోట దిగులుగా కూర్చునేది. పిల్లలు బడి గురించి మాట్లాడుకుంటుంటే, ‘అక్కడెలా ఉంటుంది?’ అంటూ ప్రశ్నలు వేసేది. రెండో తరగతి వరకు బడికి వెళ్లినా, ఆ జ్ఞాపకాలేవీ తనకు లేవు. కీర్తి తాతగారు ఆ వివరాలన్నీ తన కళ్లకు కట్టినట్టు చెప్పేవారు. కీర్తికి జబ్బు నయం అయిన మూడేళ్ల దాకా ఆమెకు ఎలాంటి దారి చూపాలో మాకూ అర్థం కాలేదు. బడిలో ఇబ్బంది పడుతుందేమోనని స్కూల్‌కి కూడా పంపించలేదు. అయితే చక్కగా పాటలు పాడుతుండటంతో బాలభవన్‌లో సంగీతం నేర్పించడానికితీసుకెళ్లేదాన్ని’’ అని చెప్పారు.
 అమ్మ మాటలను కీర్తి అందుకుంటూ - ‘‘మా అమ్మ నాకోసం బ్రెయిలీ కూడా నేర్చుకున్నారు. పుస్తకాలు తెప్పించి తను చదువు నేర్చుకుని మరీ నాకు చెప్పేవారు. సంగీతం క్లాసులకు తనే తీసుకెళ్లేవారు. పెద్దయ్యాక వంట పని, ఇంటి పని.. ఇలా అన్నీ ఎవరి సాయమూ లేకుండా నేనే సవ్యంగా ఎలా చేసుకోవాలో నేర్పించారు. మా అమ్మ అండ లేకపోతే ఈ రోజుకు నేనిలా ఉండేదాన్ని కాదు’’ అన్నారు అమ్మను హత్తుకుంటూ.

స్కూల్‌కైతే వెళ్లలేదు కాని, ట్యూషన్లు పెట్టించుకొని చదివి, పదవతరగతిలో ఇంటి నుంచే పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది కీర్తి. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ చేసింది. హైదరాబాద్ కస్తూర్బా డిగ్రీ కళాశాలలో చదివే సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా సహకార శాఖలో జూనియర్ ఇన్స్‌పెక్టర్‌గా విధులను నిర్వర్తిస్తున్నారు కీర్తి.

 సితార శృతి చేసింది

సితారతో కీర్తి పరిచయం గురించి సావిత్రిబాయి మాట్లాడుతూ - ‘‘ఊళ్లోనే సితార వాయించే మాస్టారు శంకర్‌గారు ఉన్నారని తెలిసింది. వారి వద్దకు తీసుకెళితే, వారం రోజుల్లోనే ఆ సంగీత పాఠాలు కీర్తి వంట పట్టించుకుంది. మాస్టారు చాలా మెచ్చుకున్నారు. అప్పటికి కాని మాకు అర్థం కాలేదు కీర్తికి సంతోషం కలిగించే వ్యాపకం ఏదో! అలా సితారను ఆమెకు కానుకగా ఇచ్చాం’’ అని తెలిపారు. అలా ఎన్నో వేదికల మీద సితారతో ప్రదర్శనలు ఇచ్చిన కీర్తి... సర్టిఫికెట్ కోర్సు చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని భక్తరామదాసు సంగీత కళాశాలలోలో చేరి డిప్లమా పూర్తి చేశారు. పుణె యువ ఉత్సవ్‌లో తన ప్రతిభతో సత్కారాలు అందుకున్నారు. 2008లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు పండిట్ రవిశంకర్ వెయ్యి మంది సితార వాయిద్యకారులతో నొయిడాలో బ్రహ్మనాథ్ కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ కార్యక్రమంలో కీర్తి సితారతో తన సంగీత పటిమను ప్రదర్శించారు. గ్రూపుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం మారిషస్‌లో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారు. తన సితారప్రదర్శనతో ప్రత్యేక అభినందనలను అందుకున్నారు.
 
విధుల్లోనూ రాణింపు


కీర్తిరాణి రోజూ వేకువ జామునే సితార సాధన చేస్తారు. ఇంటి పనులు ముగించుకుని విధుల్లోకి వెళతారు. విధి నిర్వహణ పూర్తయ్యాక తిరిగి సితారతో సంగీత సాధన మొదలుపెడతారు. ‘‘నేను పనిచేసేది ఎక్కువగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్. సిస్టమ్‌ని ఎలా ఆపరేట్ చేయాలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. అలాగే ముఖ్యమైన పాయింట్స్ ఉంటే ముందుగానే అవి బ్రెయిలీ లిపిలో రాసుకుంటాను. ఆ తర్వాత కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేసి, ప్రింట్స్ తీసి నా పై అధికారులకు ఇస్తాను. ‘కనపడదు కదా, ఏం తెలుస్తుంది ఈమెకు’ అనుకుంటారు కొంతమంది. కానీ, ప్రతి చిన్న విషయం కూడా తెలుసుకోవడంలో నేనే ముందుంటాను. పని చేసే చోట నా సహోద్యోగులూ ఎంతో సహాయకారిగా ఉంటారు. మనం బాగుంటే అందరూ మనతో బాగుంటారు’’ అని అంటున్న కీర్తి ‘‘భృతి కోసం ఉద్యోగం సంపాదించుకున్నాను. సంతృప్తిగా జీవనం కొనసాగించేందుకు సితార అక్కున చేరాను. అందుకే వైవాహిక జీవితం వద్దనుకున్నాను’’ అని చెప్పారు.
 జీవన గమనంలో అనుకోకుండా ఒక విపత్తు వచ్చిపడితే, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి. మరో దారిలో గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి. కీర్తిరాణి అలాగే తన జీవితాన్ని మలుచుకున్నారు. చూపున్నవారికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
 ఫొటోలు: జె.మురళీమోహన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement