Brain Fever
-
చత్తీస్‌గఢ్‌కు సోకిన బీహార్ వైరస్
సాక్షి, రాయ్‌పూర్: ఎన్సెఫాలైటిస్ అనే సిండ్రోమ్ బారినపడి బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో 136 మంది చనిపోయిన ఘటన మరుమకముందే చత్తీస్‌గఢ్‌లో మరో ముగ్గురి చిన్నారులకు వైరస్ సోకింది. చత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్ జిల్లాలో ముగ్గురు చిన్నారులు జ్వరం బారీన పడటంతో వారి బంధువులు తీవ్ర అందోళన చెందుతున్నారు. జ్వరం బారిన పడిన చిన్నారులను అధికారులు దిమ్రపాల్ మెడికల్ కాలేజీలో చెర్పించి.. వైద్య సేవలను అందిస్తున్నారు. వారికి చికిత్స చేసిన వైద్యులు.. చిన్నారులు బ్రేన్ ఫీవర్‌తో బాధపతున్నారని తెలిపారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వారిలో కొంతమందికి జపనీస్ జ్వరం లక్షణాలు ఉన్నట్లు మెడికల్ కాలేజ్ వైద్యుడు అయిన డాక్టర్ అనుపమ్ సాహు తెలిపారు. ‘అక్యూట్ ఎన్సెఫాలైటిస్ సిండ్రోమ్’ ఇది రాష్ట్రంలోనే మొదటి కేసు అని దీనిని ‘చమ్కీ బుకర్’ అని కూడా పిలుస్తారని ఆయన అన్నారు. హస్పిటల్ చెర్పించిన ఈ ముగ్గురు చిన్నారులలో నాలుగేళ్ల భువనే నాగ్‌కు మొదట వైద్య పరీక్షలు నిర్వహించగా ఎన్సెఫాలిటిస్‌గా వైద్యులు నిర్ధారించారు. మిగతా చిన్నారులు మాండవి కుమార్(7), ఇటియాసా (3)లు కిలెసాల్ పరప్పా ప్రాంతానికి చెందినవారు. దీంతో అధికారులు అక్కడి ప్రాంత ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. కాగా ‘అక్యూట్ ఎన్సెఫాలైటిస్ సిండ్రోమ్ కారణంగా బిహార్‌లో ఇప్పటి వరకు 136మందికి పైగా చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. -
పిల్లలు మరణిస్తుంటే పట్టని ప్రభువులు
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడు వాపు వ్యాధిగా వ్యవహరిస్తున్న ‘ఎన్సిఫలిటీస్ సిండ్రోమ్’కు పిల్లలు పిట్టల్లా రాలిపోతుంటే ‘వికాస్ పురుష్’గా తనను తాను అభివర్ణించుకునే బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ముజఫరాపూర్‌కు రావడానికి రెండు వారాలు పట్టింది. ఆయన ఉంటున్న పట్నా నగరానికి ముజఫరాపూర్ కేవలం రెండు గంటల దూరంలో ఉంది. ఆయన బుధవారం ముజఫరాపూర్‌లోని కష్ణా మెడికల్ కాలేజ్ ఆస్పత్రిని సందర్శించారు. అప్పటికీ 114 మంది (నేటికి 115) పిల్లలు మరణించారు. ముఖ్యమంత్రి నితీష్‌ను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లల తల్లిదండ్రులు అడ్డుకొని ధర్నా చేశారు. అధికార యంత్రాంగం సకాలంలో స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని వారు వాపోయారు. మెదడు వాపు వ్యాధితో దాదాపు 400 మంది పిల్లలు ఆస్పత్రిలో చేరారు. బిహార్ ఆరోగ్య మంత్రి మంగల్ పాండే వ్యవహారం మరీ విడ్డూరంగా ఉంది. ఎన్సిఫలిటీస్ను ఎలా ఎదుర్కొనాలనే అంశంపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్విణి కుమార్ చౌబేతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మధ్యలో భారత్–పాక్ క్రికెట్ స్కోర్ వివరాలు మంగల్ పాండే వాకబ్ చేయడం వినిపించింది. ఇది ఆ కార్యక్రమం వీడియోలో కూడా రికార్డయింది. పిల్లల ఆరోగ్యం పట్టని ఆయనకు స్కోర్ వివరాలు ముఖ్యమయ్యాయి. మెదడువాపు వ్యాధిని ఎలాఎదుర్కోవాలో బీహార్ డాక్టర్లకు అనుభవ పూర్వకంగా తెలుసు. 2012 నుంచి 2014 వరకు ఈ వ్యాధి బీహార్ ప్రజలను వణికించింది. బీహార్‌లో విరివిగా పండించే లిచీ పండ్లను తిని, రాత్రి పూట పౌష్టికాహారం తినకపోవడం వల్ల నాడు మెదడువాపు వ్యాధికి ఎక్కువ మంది పిల్లలు మరణించారని వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ విరోలోజిస్ట్ టీ జాకబ్ జాన్ తేల్చారు. వాస్తవానికి దాన్ని ఎన్సిఫలటీస్ అనకూడదని, ఎన్సిఫోలోపతి అనాలని కూడా ఆయన చెప్పారు. ఈసారి ఆస్పత్రి పాలైన 400 మంది పిల్లలు కూడా మురికి వాడల్లో నివసిస్తున్న పేదల పిల్లలే. వారికి సమీపంలో కూడా లిచీ పండ్ల తోటలు ఉన్నాయి. వారు వాటిని తినడం వల్లనే వారు జబ్బుపడ్డారని అంటున్నారు. పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లలకు ఈ పండ్లు మంచివని తినిపిస్తారు. ఇవి తిని, రాత్రిపూట ఆహారం తీసుకోకపోతే అవి ప్రాణాంతకం అవుతాయట. వాంతులు చేసుకోవడం, మగతలో ఉండడం, కాస్త పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మెదడువాపు లక్షణాలు. ముఖ్యంగా ఉదయం 4 నుంచి 7 గంటల మధ్య పిల్లల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని రోజుల్లోనే వారు మరణించే ప్రమాదం ఉంటుంది. సకాలంలో వైద్యం అందించడం అవసరం. వైద్యానికి స్పందించి పిల్లలు బతకాలంటే కూడా పిల్లల్లో పౌష్టికాహార లోపం ఉండకూడదట. బిహార్‌లో మొన్నటి వరకు వీచిన వడగాడ్పులకు 70 మంది మత్యువాత పడ్డారనే విషయాన్ని జీర్ణించుకునేలోపే ఇలా పిల్లలు రాలిపోవడం వారి తల్లిదండ్రలకు కడుపుకోతే కాకుండా ప్రభుత్వం బాధ్యతరాహిత్యానికి మాయని మచ్చ. -
విద్యార్థికి మెదడు వాపు
కోవూరు : మండలంలోని వేగూరు వసంతపురానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి తుమ్మ నాగవెంకట ప్రవీణ్ (12)కు మెదడు వాపు వ్యాధి సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గత ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి టీపీగూడురుకు వెళ్లిన ప్రవీణ్ ఆ తర్వాత నుంచి నలతగా ఉండటంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యుల వైద్యం చేయించారు. అయినప్పటికీ బాలుడి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో నెల్లూరులోని సింహపురి వైద్యశాలకు తరలించారు. అక్కడ రెండ్రోజుల చికిత్స అనంతరం బాలుడికి మెదడు వాపు వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని శుక్రవారం కాంచీపురంలోని కంచి కామకోటి పిల్లల ఆసుపత్రికి తరలించారు. తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు మెదడు వాపు వ్యాధి సోకిన కుమారుడిని కంచి కామకోటి ఆసుపత్రికి తరలించడంతో అక్కడ వైద్యం కోసం భారీగా ఖర్చవుతోంది. కూలి పనులు చేసుకుని బిడ్డను చదివించుకుంటున్న బాలుడి తల్లిదండ్రులు అరుణ, పోలయ్యకు ఆర్థిక ఇబ్బందులు ప్రతిబంధకంగా మారింది. నెల్లూరులోనే అష్టకష్టాలు పడి రూ.లక్ష వరకు వెచ్చించారు. వీరి దయనీయ పరిస్థితిని స్వయంగా చూసిన వేగూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రూ.20 వేలు ఆర్థిక సాయం అందించారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా మరికొంత సాయం అందజేశారు. బాలుడు పూర్తి స్థాయిలో మెరుగుపడాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుందని, మరో కొద్ది రోజుల పాటు అక్కడే ఉండాలని వైద్యులు చెబుతుండటంతో ఆ తల్లిదండ్రులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఎవరైనా దాతలు స్పందించి సాయమందిస్తే తప్ప తమకు బిడ్డ దక్కడనే ఆందోళన చెందుతున్నారు. ఒక్కరోజే రూ.80 వేలు ఖర్చు అయినట్లు వాపోయారు. బిడ్డను బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. -
పవన్‌ను కలిసిన శ్రీజ
హైదరాబాద్: బ్రెయిన్ ఫీవర్ నుంచి పూర్తిగా కోలుకున్న ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన శ్రీజ తన కుటుంబ సభ్యులతో సోమవారం జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ను ఆయన కార్యాలయంలో కలిసింది. గతేడాది బ్రెయిన్ ఫీవర్ కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడిన శ్రీజ తన అభిమాన నటుడు పవన్‌ను చూడాలనుందని కోరడంతో ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ చొరవతో ఆయన స్వయంగా ఖమ్మం వెళ్లి శ్రీజను పరామర్శించిన విష యం తెలిసిందే. అప్పటి నుంచి డాక్టర్ అసాధారణ్ పర్యవేక్షణలో వైద్య చికిత్సలు పొందిన శ్రీజ పూర్తిగా కోలుకుంది. సోమవారం శ్రీజతో పాటు ఆమె తల్లిదండ్రులు నాగయ్య, నాగమణి, సోదరి షర్మిల శ్రీలత పవన్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు వారితో పవన్ కల్యాణ్ గడిపారు. శ్రీజ పూర్తిగా కోలుకొని, ఆరోగ్యవంతంగా ఉండడం పట్ల సంతోషంగా ఉందని చెప్పారు. శ్రీజకు చికిత్స చేసి నయమయ్యేలా చేసిన డాక్టర్ అసాధారణ్‌కు కృతజ్ఞతలు చెప్పారు. -
రాగనయని
మిణుగురులు సమాజానికి దివిటీలు కీర్తిరాణి మునివేళ్లు కాసేపైనా సితార తీగలను మీటకుండా విశ్రమించవు. ఈమె వేలి స్పర్శ తగలనిదే ఆ సితారకు మెలకువరాదు. చపులేని కీర్తిరాణికి సితారతో చూపులు కలిసిన అనుబంధం వయసు పాతికేళ్లు. అలా సితారకీర్తిగా గుర్తింపు పొందుతున్న కీర్తిరాణి స్ఫూర్తిదాయక జీవితమే ఈవారం మిణుగురులు. పాతికేళ్లుగా కీర్తిరాణి ఎన్నో వేదికల మీద సితార ప్రదర్శనలు ఇచ్చారు. ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. సితార తన ప్రాణం అని చెప్పే కీర్తిరాణితో కాసేపు ముచ్చటిస్తే అంచెలంచెలుగా ఆమె పెంపొందించుకుంటూ వచ్చిన ఆత్మస్థయిర్యం ఆద్యంతం మన కళ్లకు కనిపిస్తుంది. కీర్తిరాణి వయసు ముప్పై ఐదేళ్లు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివాసం. పాండురంగారావు (ఏడాది క్రితం మరణించారు), సావిత్రిబాయిల ముగ్గురు సంతానంలో ఒకరు కీర్తిరాణి. ఆరేళ్ల వయసులో కీర్తికి బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. అప్పుడు ఆమె రెండో తరగతి చదువుతోంది. జబ్బు కారణంగా మూడు నెలల పాటు కోమాలోనే ఉండిపోయింది. తల్లీతండ్రీ తల్లడిల్లిపోయారు. బిడ్డను బతికించమని వేయి దేవుళ్లకు మొక్కుకున్నారు. వారి మొక్కులు ఫలించాయి. కీర్తి కోమా నుంచి బయట పడింది. కానీ, తనకేమీ కనిపించడం లేదని, అంతా చీకటిగా ఉందని చెప్పింది! ఎవరినీ గుర్తుపట్టలేని స్థితి. వైద్యులను అడిగితే ‘జబ్బు వల్ల చూపు పూర్తిగా పోయింది. గతం కూడా మర్చిపోయింది. ఆమెకు ఇది పునర్జన్మ’ అని చెప్పారు. బాలభవన్‌లో సంగీతం కూర్చోవడం, నిల్చోవడం, నడక.. అన్నీ పసిపాపకు నేర్పించినట్టే కీర్తికి మళ్లీ నేర్పారు ఆమె తల్లిదండ్రులు. నాటి రోజుల గురించి కీర్తి తల్లి సావిత్రిబాయి మాట్లాడుతూ- ‘‘మా ఇల్లు ఎప్పుడూ బంధువులు, వారి పిల్లలతో కళకళలాడుతుండేది. పిల్లలందరూ ఆడుకుంటుంటే కీర్తి వెళ్లి ఒక చోట దిగులుగా కూర్చునేది. పిల్లలు బడి గురించి మాట్లాడుకుంటుంటే, ‘అక్కడెలా ఉంటుంది?’ అంటూ ప్రశ్నలు వేసేది. రెండో తరగతి వరకు బడికి వెళ్లినా, ఆ జ్ఞాపకాలేవీ తనకు లేవు. కీర్తి తాతగారు ఆ వివరాలన్నీ తన కళ్లకు కట్టినట్టు చెప్పేవారు. కీర్తికి జబ్బు నయం అయిన మూడేళ్ల దాకా ఆమెకు ఎలాంటి దారి చూపాలో మాకూ అర్థం కాలేదు. బడిలో ఇబ్బంది పడుతుందేమోనని స్కూల్‌కి కూడా పంపించలేదు. అయితే చక్కగా పాటలు పాడుతుండటంతో బాలభవన్‌లో సంగీతం నేర్పించడానికితీసుకెళ్లేదాన్ని’’ అని చెప్పారు. అమ్మ మాటలను కీర్తి అందుకుంటూ - ‘‘మా అమ్మ నాకోసం బ్రెయిలీ కూడా నేర్చుకున్నారు. పుస్తకాలు తెప్పించి తను చదువు నేర్చుకుని మరీ నాకు చెప్పేవారు. సంగీతం క్లాసులకు తనే తీసుకెళ్లేవారు. పెద్దయ్యాక వంట పని, ఇంటి పని.. ఇలా అన్నీ ఎవరి సాయమూ లేకుండా నేనే సవ్యంగా ఎలా చేసుకోవాలో నేర్పించారు. మా అమ్మ అండ లేకపోతే ఈ రోజుకు నేనిలా ఉండేదాన్ని కాదు’’ అన్నారు అమ్మను హత్తుకుంటూ. స్కూల్కైతే వెళ్లలేదు కాని, ట్యూషన్లు పెట్టించుకొని చదివి, పదవతరగతిలో ఇంటి నుంచే పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది కీర్తి. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ చేసింది. హైదరాబాద్ కస్తూర్బా డిగ్రీ కళాశాలలో చదివే సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా సహకార శాఖలో జూనియర్ ఇన్స్పెక్టర్గా విధులను నిర్వర్తిస్తున్నారు కీర్తి. సితార శృతి చేసింది సితారతో కీర్తి పరిచయం గురించి సావిత్రిబాయి మాట్లాడుతూ - ‘‘ఊళ్లోనే సితార వాయించే మాస్టారు శంకర్‌గారు ఉన్నారని తెలిసింది. వారి వద్దకు తీసుకెళితే, వారం రోజుల్లోనే ఆ సంగీత పాఠాలు కీర్తి వంట పట్టించుకుంది. మాస్టారు చాలా మెచ్చుకున్నారు. అప్పటికి కాని మాకు అర్థం కాలేదు కీర్తికి సంతోషం కలిగించే వ్యాపకం ఏదో! అలా సితారను ఆమెకు కానుకగా ఇచ్చాం’’ అని తెలిపారు. అలా ఎన్నో వేదికల మీద సితారతో ప్రదర్శనలు ఇచ్చిన కీర్తి... సర్టిఫికెట్ కోర్సు చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని భక్తరామదాసు సంగీత కళాశాలలోలో చేరి డిప్లమా పూర్తి చేశారు. పుణె యువ ఉత్సవ్‌లో తన ప్రతిభతో సత్కారాలు అందుకున్నారు. 2008లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు పండిట్ రవిశంకర్ వెయ్యి మంది సితార వాయిద్యకారులతో నొయిడాలో బ్రహ్మనాథ్ కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ కార్యక్రమంలో కీర్తి సితారతో తన సంగీత పటిమను ప్రదర్శించారు. గ్రూపుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం మారిషస్‌లో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారు. తన సితారప్రదర్శనతో ప్రత్యేక అభినందనలను అందుకున్నారు. విధుల్లోనూ రాణింపు కీర్తిరాణి రోజూ వేకువ జామునే సితార సాధన చేస్తారు. ఇంటి పనులు ముగించుకుని విధుల్లోకి వెళతారు. విధి నిర్వహణ పూర్తయ్యాక తిరిగి సితారతో సంగీత సాధన మొదలుపెడతారు. ‘‘నేను పనిచేసేది ఎక్కువగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్. సిస్టమ్‌ని ఎలా ఆపరేట్ చేయాలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. అలాగే ముఖ్యమైన పాయింట్స్ ఉంటే ముందుగానే అవి బ్రెయిలీ లిపిలో రాసుకుంటాను. ఆ తర్వాత కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేసి, ప్రింట్స్ తీసి నా పై అధికారులకు ఇస్తాను. ‘కనపడదు కదా, ఏం తెలుస్తుంది ఈమెకు’ అనుకుంటారు కొంతమంది. కానీ, ప్రతి చిన్న విషయం కూడా తెలుసుకోవడంలో నేనే ముందుంటాను. పని చేసే చోట నా సహోద్యోగులూ ఎంతో సహాయకారిగా ఉంటారు. మనం బాగుంటే అందరూ మనతో బాగుంటారు’’ అని అంటున్న కీర్తి ‘‘భృతి కోసం ఉద్యోగం సంపాదించుకున్నాను. సంతృప్తిగా జీవనం కొనసాగించేందుకు సితార అక్కున చేరాను. అందుకే వైవాహిక జీవితం వద్దనుకున్నాను’’ అని చెప్పారు. జీవన గమనంలో అనుకోకుండా ఒక విపత్తు వచ్చిపడితే, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి. మరో దారిలో గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి. కీర్తిరాణి అలాగే తన జీవితాన్ని మలుచుకున్నారు. చూపున్నవారికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఫొటోలు: జె.మురళీమోహన్ -
పవన్ కల్యాణ్ అభిమాని శ్రీజ డిశ్చార్జ్
హైదరాబాద్: బ్రెయిన్ ఫీవర్‌తో బాధపడుతూ ఖమ్మం లోని కార్తీక్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందిన పవన్ కల్యాణ్ అభిమాని శ్రీజను డాక్టర్లు డిశ్చార్జి చేశారు. కుటుంబసభ్యులు ఆమెను పాల్వంచ తీసుకువెళ్లారు. చిన్నారి పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న సినీ హీరో పవన్‌కల్యాణ్ అక్టోబర్ 17న ఆస్పత్రికి వచ్చి పరామర్శించిన విషయం విదితమే. ఆమె కోలుకోవడంతో పవన్ అభిమానులు ఆస్పత్రిలో స్వీట్లు పంచిపెట్టారు. -
పవన్ కళ్యాణ్ అభిమాని శ్రీజ కోలుకుంది..
-
పవన్ కళ్యాణ్ అభిమాని శ్రీజ కోలుకుంది..
ఖమ్మం: అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిన శ్రీజ కోలుకుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఇంటెన్సివ్ కేర్ నుంచి బయటకు వచ్చిందని డాక్టర్ అసాధారణ్ ఆదివారం విలేకరులకు తెలిపారు. పాల్వంచకు చెందిన శ్రీజ అక్టోబర్ 2న బ్రెయిన్ ఫీవర్‌తో కోమాలోకి వెళ్లడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అనారోగ్యంతో ఉన్న ఆమె అభిమాన హీరో పవన్‌కల్యాణ్‌ను చూడాలనుందని తండ్రి నాగయ్యకు చెప్పింది. శ్రీజ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. తన కూతురికి పవన్‌ను చూడాలని ఉందని, చిన్నారి తండ్రి మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తికి పవన్ స్పందించారు. అక్టోబర్ 17న ఖమ్మం వచ్చి శ్రీజను చూశారు. కోలుకున్నాక మరోసారి వచ్చి చూస్తానన్నారు. కాగా, ప్రస్తుతం శ్రీజ కోలుకుంది. తన బిడ్డకు మెరుగైన వైద్యం అందించిన డాక్టర్లకు, పవన్‌కు శ్రీజ తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. -
ఆత్మీయ స్పర్శ :పవన్‌కల్యాణ్
ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తన అభిమానిని పరామర్శించేందుకు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ శుక్రవారం ఖమ్మం బాట పట్టారు. విశాఖపట్టణం నుంచి నేరుగా ఆయన మధ్యాహ్నం నగరానికి చేరుకున్నారు. బ్రెయిన్‌ఫీవర్‌తో బాధపడుతున్న శ్రీజ(12) అనే బాలిక చివరి కోరికను తన ఆత్మీయ స్పర్శతో నెరవేర్చారు. సుమారు గంటపాటు ఆస్పత్రి లో గడిపి ఆ చిన్నారి ఆరోగ్యపరిస్థితిపై వాకబు చేశారు. ‘శ్రీజ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా..’ అని పవన్ భావోద్వేగాల మధ్య ప్రకటించారు. పవన్ రాకతో ఆస్పత్రి పరిసరాలు ఆయన అభిమానులతో నిండిపోయాయి. వారిని అదుపుచేయటం పోలీసులకు కష్టమైంది. ఖమ్మం: ‘జిల్లాలోని పాల్వంచకు చెందిన శ్రీజ (12) అనే బాలిక బ్రెయిన్‌ఫీవర్‌తో బాధపడుతోంది. కొద్దిరోజులుగా ఆమెకు ఖమ్మంలోని కార్తీక్ ఆస్పత్రిలో వైద్యసేవలు అందిస్తున్నారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంలేదు. తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను చూడాలని ఆ చిన్నారి కోరిక. ఆమె తల్లిదండ్రులు, నాగయ్య, నాగమణి తమ కూతురు చివరి కోరిక తీర్చాలని పవన్‌కల్యాణ్‌ను మీడియా ద్వారా కోరారు. ఖమ్మం రావాల్సిందిగా అభ్యర్థించారు. పవన్ స్పందించారు. తన అభిమాని కోసం కదలివచ్చారు. ఆ బాలికను పరామర్శించేందుకు శుక్రవారం ఖమ్మం వచ్చిన పవన్‌కల్యాణ్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. తన అభిమాని ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోందని..తనను చూడాలంటోందని తెలిసిన వెంటనే విశాఖపట్టణం నుంచి పవన్ నేరుగా ఖమ్మం వచ్చారు. పవన్రాకను తెలుసుకున్న అభిమానులు ఆస్పత్రి వద్ద గుమిగూడారు. కార్తీక్ ఆస్పత్రి నలుదిక్కుల ఉన్న వీధులు పోటెత్తాయి. భవనాలపైకి ఎక్కి పవన్ కోసం నిరీక్షించారు. బందోబస్తు నడుమ ఆస్పత్రిలోకి.. పరిస్థితిని గమనించి ఖమ్మం డీఎస్పీ బాలకిషన్‌రావు నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్న సమయంలో ఖమ్మానికి చేరిన పవన్‌ను పోలీసులు అతికష్టమ్మీద ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి వెనుకభాగంలో ఉన్న లిఫ్ట్ నుంచి పవన్ హాస్పిటల్లోకి వెళ్లారు. శ్రీజను చూశారు. ఆ చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. ‘మృత్యువుకు చేరువలో ఉన్న తన అభిమాని చివరి కోరిక తీర్చలేకుండా ఉండలేకపోయాను..’ అన్నారు. శ్రీజ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి డాక్టర్ అసాధరణ్ను అడిగి తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకునేందుకు మెరుగైన చికిత్స చేయాలని కోరారు. ‘ఆమె బతికితే తిరిగి ఖమ్మం వస్తాను. ఆ చిన్నారితో మాట్లాడి వెళ్తాను. భగవంతుడు శ్రీజకు ప్రాణం పోయాలని ప్రార్థిస్తున్నాను.’ అని పవన్ భావోద్వేగాల మధ్య ప్రకటించారు. తమ కూతురి ఆరోగ్యం గురించి పరితపించిన పవన్‌కల్యాణ్‌ను చూసి శ్రీజ తల్లిదండ్రులు కన్నీరుపెట్టారు. తమ కుమార్తె చివరి కోరిక తీర్చినందుకు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు గంటసేపు పవన్ ఆస్పత్రిలోనే గడిపారు. అశేష అభిమానులు, వారి కేరింతలకు స్పందించి చేతులూ ఊపుతూ ఆస్పత్రి నుంచే అభివాదం చేశారు. ఆస్పత్రికి వచ్చేటప్పుడు కారులో వచ్చిన ఆయన అభిమానుల ఉత్సాహాన్ని చూసి కారుపైకి ఎక్కి వారికి అభివాదం చేశారు. పవన్ అభిమానులను ఆపడం పోలీసులకు కష్టతరమైంది. లాఠీలకు సైతం పని చెప్పాల్సి వచ్చింది. పవన్ రాక విషయం తెలిసి ప్రముఖ పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర మధ్యాహ్నభోజనం కోసం ఏర్పాట్లు చేశారు. పవన్ అంగీకరించినా అభిమానులు, భద్రతాపరమైన ఇబ్బందుల వల్ల రవిచంద్ర ఇంటికి వెళ్లలేకపోయారు. రవిచంద్ర కుమారుడు నితిన్ బైపాస్‌రోడ్‌లో పవన్‌కల్యాణ్ ఆపి మార్గంమధ్యలో భోజనం చేయాల్సిందిగా తయారు చేసిన వంటకాలను అందించారు. పవన్ వెంట పవన్‌కల్యాణ్, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు కొప్పురావూరి సుమంత్, రుద్రగాని ఉపేందర్, వీరేశ్, ఉపేందర్చౌదరి, గంగిశెట్టి శ్రీను ఉన్నారు. -
అభిమాన ‘పవనం'
శ్రీజను పరామర్శించి కంటతడి పెట్టిన పవర్‌స్టార్ ఆమె కోలుకున్న తర్వాత మళ్లీ చూస్తానని నటుడు పవన్ హామీ ఖమ్మం: ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ శుక్రవారం ఖమ్మం చేరుకొని, తనను అమితంగా అభిమానించే బాలిక శ్రీజ(13)ను పరామర్శించారు. బ్రెయిన్ ఫీవర్‌తో బాధ పడుతూ కోమాలో ఉన్న శ్రీజ పవన్‌ను చూడాలని కోరుకున్న విషయం విదితమే. దీంతో శుక్రవారం రాజమండ్రి నుంచి మధ్యాహ్నం రోడ్డుమార్గంలో ఖమ్మం చేరుకున్న ఆయన గంటకుపైగా శ్రీజ చికిత్స పొందుతున్న గదిలో ఉండి తల్లిదండ్రులను, శ్రీజను పరామర్శించారు. ఈ పరిస్థితిలోనూ శ్రీజ తనను చూడాలని కోరుకోవడం తన పూర్వజన్మ సుకృతమని, శ్రీజ పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆమె తల్లిదండ్రులు నాగయ్య, నాగమణిలతో ఆప్యాయంగా మాట్లాడి కుటుంబ పరిస్థితులను, శ్రీజ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్ అసాధారణ్ను శ్రీజకు సంబంధించిన కేస్‌షీట్‌ను, ఇతర రిపోర్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీజ పరిస్థితిని చూసి చలించిన పవన్ కంటతడి పెట్టారు. శ్రీజకు ఆత్మీయంగా దగ్గరకు వెళ్లి ఆమె తనను గుర్తు పట్టలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ అమ్మా.. నేను పవన్ కల్యాణ్‌ను వచ్చానంటూ చెవిలో పదేపదే చెప్పి ఉద్విగ్నతకు లోనయ్యారు. పవన్ కల్యాణ్ తన కూతురును పరామర్శించడానికి రావడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీజ పూర్తిగా కోలుకున్న తర్వాత మరోసారి వచ్చి కలుస్తానని చెబుతూ.. ఆమెకు వినాయకుడి వెండి ప్రతిమను అందజేశారు. పవన్ వాహనాన్ని ఢీకొట్టిన మరో వాహనం.. పవన్‌కల్యాణ్ ఖమ్మం వస్తుండగా కొణిజర్ల మండలం శాంతినగర్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని కాన్వాయ్‌లోని మరో వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం స్వల్పంగా దెబ్బతినగా పవన్ కొద్ది నిముషాలపాటు ఆగి పరిస్థితిని సరిదిద్ది తిరిగి ప్రయాణమయ్యారు. పవన్ ఖమ్మం వస్తున్నారని ముందుగానే ప్రచారం కావడంతో అభిమానులు పెద్దఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆస్పత్రిలో ఉన్న గోడ కూలి ఇద్దరికి స్వల్పంగా గాయాలవగా, మరో అభిమాని తలకు కూడా గాయమైంది. తనకోసం దాదాపు గంటసేపు ఆస్పత్రి వద్ద వేచి ఉన్న అశేష అభిమానులకు పవన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ అభిమానుల అత్యుత్సాహాన్ని అదుపు చేయలేకపోయారు. దీంతో కొందరు అభిమానులు పవన్ కల్యాణ్‌ను చూడలేకపోయినా పోలీసుల లాఠీ దెబ్బలను మాత్రం రుచిచూశారు.