సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడు వాపు వ్యాధిగా వ్యవహరిస్తున్న ‘ఎన్సిఫలిటీస్ సిండ్రోమ్’కు పిల్లలు పిట్టల్లా రాలిపోతుంటే ‘వికాస్ పురుష్’గా తనను తాను అభివర్ణించుకునే బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ముజఫరాపూర్‌కు రావడానికి రెండు వారాలు పట్టింది. ఆయన ఉంటున్న పట్నా నగరానికి ముజఫరాపూర్ కేవలం రెండు గంటల దూరంలో ఉంది. ఆయన బుధవారం ముజఫరాపూర్‌లోని కష్ణా మెడికల్ కాలేజ్ ఆస్పత్రిని సందర్శించారు. అప్పటికీ 114 మంది (నేటికి 115) పిల్లలు మరణించారు. ముఖ్యమంత్రి నితీష్‌ను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లల తల్లిదండ్రులు అడ్డుకొని ధర్నా చేశారు. అధికార యంత్రాంగం సకాలంలో స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని వారు వాపోయారు. మెదడు వాపు వ్యాధితో దాదాపు 400 మంది పిల్లలు ఆస్పత్రిలో చేరారు.
బిహార్ ఆరోగ్య మంత్రి మంగల్ పాండే వ్యవహారం మరీ విడ్డూరంగా ఉంది. ఎన్సిఫలిటీస్‌ను ఎలా ఎదుర్కొనాలనే అంశంపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్విణి కుమార్ చౌబేతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మధ్యలో భారత్–పాక్ క్రికెట్ స్కోర్ వివరాలు మంగల్ పాండే వాకబ్ చేయడం వినిపించింది. ఇది ఆ కార్యక్రమం వీడియోలో కూడా రికార్డయింది. పిల్లల ఆరోగ్యం పట్టని ఆయనకు స్కోర్ వివరాలు ముఖ్యమయ్యాయి.
మెదడువాపు వ్యాధిని ఎలాఎదుర్కోవాలో బీహార్ డాక్టర్లకు అనుభవ పూర్వకంగా తెలుసు. 2012 నుంచి 2014 వరకు ఈ వ్యాధి బీహార్ ప్రజలను వణికించింది. బీహార్‌లో విరివిగా పండించే లిచీ పండ్లను తిని, రాత్రి పూట పౌష్టికాహారం తినకపోవడం వల్ల నాడు మెదడువాపు వ్యాధికి ఎక్కువ మంది పిల్లలు మరణించారని వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ విరోలోజిస్ట్ టీ జాకబ్ జాన్ తేల్చారు. వాస్తవానికి దాన్ని ఎన్సిఫలటీస్ అనకూడదని, ఎన్సిఫోలోపతి అనాలని కూడా ఆయన చెప్పారు.
ఈసారి ఆస్పత్రి పాలైన 400 మంది పిల్లలు కూడా మురికి వాడల్లో నివసిస్తున్న పేదల పిల్లలే. వారికి సమీపంలో కూడా లిచీ పండ్ల తోటలు ఉన్నాయి. వారు వాటిని తినడం వల్లనే వారు జబ్బుపడ్డారని అంటున్నారు. పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లలకు ఈ పండ్లు మంచివని తినిపిస్తారు. ఇవి తిని, రాత్రిపూట ఆహారం తీసుకోకపోతే అవి ప్రాణాంతకం అవుతాయట. వాంతులు చేసుకోవడం, మగతలో ఉండడం, కాస్త పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మెదడువాపు లక్షణాలు. ముఖ్యంగా ఉదయం 4 నుంచి 7 గంటల మధ్య పిల్లల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని రోజుల్లోనే వారు మరణించే ప్రమాదం ఉంటుంది. సకాలంలో వైద్యం అందించడం అవసరం. వైద్యానికి స్పందించి పిల్లలు బతకాలంటే కూడా పిల్లల్లో పౌష్టికాహార లోపం ఉండకూడదట. బిహార్‌లో మొన్నటి వరకు వీచిన వడగాడ్పులకు 70 మంది మత్యువాత పడ్డారనే విషయాన్ని జీర్ణించుకునేలోపే ఇలా పిల్లలు రాలిపోవడం వారి తల్లిదండ్రలకు కడుపుకోతే కాకుండా ప్రభుత్వం బాధ్యతరాహిత్యానికి మాయని మచ్చ.
Comments
Please login to add a commentAdd a comment