ఆత్మీయ స్పర్శ :పవన్‌కల్యాణ్
ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తన అభిమానిని పరామర్శించేందుకు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ శుక్రవారం ఖమ్మం బాట పట్టారు. విశాఖపట్టణం నుంచి నేరుగా ఆయన మధ్యాహ్నం నగరానికి చేరుకున్నారు. బ్రెయిన్‌ఫీవర్‌తో బాధపడుతున్న శ్రీజ(12) అనే బాలిక చివరి కోరికను తన ఆత్మీయ స్పర్శతో నెరవేర్చారు. సుమారు గంటపాటు ఆస్పత్రి లో గడిపి ఆ చిన్నారి ఆరోగ్యపరిస్థితిపై వాకబు చేశారు. ‘శ్రీజ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా..’ అని పవన్ భావోద్వేగాల మధ్య ప్రకటించారు. పవన్ రాకతో ఆస్పత్రి పరిసరాలు ఆయన అభిమానులతో నిండిపోయాయి. వారిని అదుపుచేయటం పోలీసులకు కష్టమైంది.
ఖమ్మం: ‘జిల్లాలోని పాల్వంచకు చెందిన శ్రీజ (12) అనే బాలిక బ్రెయిన్‌ఫీవర్‌తో బాధపడుతోంది. కొద్దిరోజులుగా ఆమెకు ఖమ్మంలోని కార్తీక్ ఆస్పత్రిలో వైద్యసేవలు అందిస్తున్నారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంలేదు. తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను చూడాలని ఆ చిన్నారి కోరిక. ఆమె తల్లిదండ్రులు, నాగయ్య, నాగమణి తమ కూతురు చివరి కోరిక తీర్చాలని పవన్‌కల్యాణ్‌ను మీడియా ద్వారా కోరారు. ఖమ్మం రావాల్సిందిగా అభ్యర్థించారు. పవన్ స్పందించారు. తన అభిమాని కోసం కదలివచ్చారు.
ఆ బాలికను పరామర్శించేందుకు శుక్రవారం ఖమ్మం వచ్చిన పవన్‌కల్యాణ్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. తన అభిమాని ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోందని..తనను చూడాలంటోందని తెలిసిన వెంటనే విశాఖపట్టణం నుంచి పవన్ నేరుగా ఖమ్మం వచ్చారు. పవన్‌రాకను తెలుసుకున్న అభిమానులు ఆస్పత్రి వద్ద గుమిగూడారు. కార్తీక్ ఆస్పత్రి నలుదిక్కుల ఉన్న వీధులు పోటెత్తాయి. భవనాలపైకి ఎక్కి పవన్ కోసం నిరీక్షించారు.
బందోబస్తు నడుమ ఆస్పత్రిలోకి..
పరిస్థితిని గమనించి ఖమ్మం డీఎస్పీ బాలకిషన్‌రావు నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్న సమయంలో ఖమ్మానికి చేరిన పవన్‌ను పోలీసులు అతికష్టమ్మీద ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి వెనుకభాగంలో ఉన్న లిఫ్ట్ నుంచి పవన్ హాస్పిటల్‌లోకి వెళ్లారు. శ్రీజను చూశారు. ఆ చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. ‘మృత్యువుకు చేరువలో ఉన్న తన అభిమాని చివరి కోరిక తీర్చలేకుండా ఉండలేకపోయాను..’ అన్నారు. శ్రీజ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి డాక్టర్ అసాధరణ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకునేందుకు మెరుగైన చికిత్స చేయాలని కోరారు. ‘ఆమె బతికితే తిరిగి ఖమ్మం వస్తాను. ఆ చిన్నారితో మాట్లాడి వెళ్తాను. భగవంతుడు శ్రీజకు ప్రాణం పోయాలని ప్రార్థిస్తున్నాను.’ అని పవన్ భావోద్వేగాల మధ్య ప్రకటించారు.
తమ కూతురి ఆరోగ్యం గురించి పరితపించిన పవన్‌కల్యాణ్‌ను చూసి శ్రీజ తల్లిదండ్రులు కన్నీరుపెట్టారు. తమ కుమార్తె చివరి కోరిక తీర్చినందుకు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు గంటసేపు పవన్ ఆస్పత్రిలోనే గడిపారు. అశేష అభిమానులు, వారి కేరింతలకు స్పందించి చేతులూ ఊపుతూ ఆస్పత్రి నుంచే అభివాదం చేశారు. ఆస్పత్రికి వచ్చేటప్పుడు కారులో వచ్చిన ఆయన అభిమానుల ఉత్సాహాన్ని చూసి కారుపైకి ఎక్కి వారికి అభివాదం చేశారు.
పవన్ అభిమానులను ఆపడం పోలీసులకు కష్టతరమైంది. లాఠీలకు సైతం పని చెప్పాల్సి వచ్చింది.
పవన్ రాక విషయం తెలిసి ప్రముఖ పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర మధ్యాహ్నభోజనం కోసం ఏర్పాట్లు చేశారు. పవన్ అంగీకరించినా అభిమానులు, భద్రతాపరమైన ఇబ్బందుల వల్ల రవిచంద్ర ఇంటికి వెళ్లలేకపోయారు. రవిచంద్ర కుమారుడు నితిన్ బైపాస్‌రోడ్‌లో పవన్‌కల్యాణ్ ఆపి మార్గంమధ్యలో భోజనం చేయాల్సిందిగా తయారు చేసిన వంటకాలను అందించారు.
పవన్ వెంట పవన్‌కల్యాణ్, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు కొప్పురావూరి సుమంత్, రుద్రగాని ఉపేందర్, వీరేశ్, ఉపేందర్‌చౌదరి, గంగిశెట్టి శ్రీను ఉన్నారు.