విద్యార్థికి మెదడు వాపు
కోవూరు : మండలంలోని వేగూరు వసంతపురానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి తుమ్మ నాగవెంకట ప్రవీణ్ (12)కు మెదడు వాపు వ్యాధి సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గత ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి టీపీగూడురుకు వెళ్లిన ప్రవీణ్ ఆ తర్వాత నుంచి నలతగా ఉండటంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యుల వైద్యం చేయించారు. అయినప్పటికీ బాలుడి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో నెల్లూరులోని సింహపురి వైద్యశాలకు తరలించారు. అక్కడ రెండ్రోజుల చికిత్స అనంతరం బాలుడికి మెదడు వాపు వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని శుక్రవారం కాంచీపురంలోని కంచి కామకోటి పిల్లల ఆసుపత్రికి తరలించారు.
తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
మెదడు వాపు వ్యాధి సోకిన కుమారుడిని కంచి కామకోటి ఆసుపత్రికి తరలించడంతో అక్కడ వైద్యం కోసం భారీగా ఖర్చవుతోంది. కూలి పనులు చేసుకుని బిడ్డను చదివించుకుంటున్న బాలుడి తల్లిదండ్రులు అరుణ, పోలయ్యకు ఆర్థిక ఇబ్బందులు ప్రతిబంధకంగా మారింది. నెల్లూరులోనే అష్టకష్టాలు పడి రూ.లక్ష వరకు వెచ్చించారు. వీరి దయనీయ పరిస్థితిని స్వయంగా చూసిన వేగూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రూ.20 వేలు ఆర్థిక సాయం అందించారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా మరికొంత సాయం అందజేశారు. బాలుడు పూర్తి స్థాయిలో మెరుగుపడాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుందని, మరో కొద్ది రోజుల పాటు అక్కడే ఉండాలని వైద్యులు చెబుతుండటంతో ఆ తల్లిదండ్రులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఎవరైనా దాతలు స్పందించి సాయమందిస్తే తప్ప తమకు బిడ్డ దక్కడనే ఆందోళన చెందుతున్నారు. ఒక్కరోజే రూ.80 వేలు ఖర్చు అయినట్లు వాపోయారు. బిడ్డను బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు.