
వంటింటి పువ్వు...
కుంకుమపువ్వు... పిల్లలు తెల్లగా పుట్టడం కోసం గర్భిణులకు ఇచ్చే ఔషధంగా సుపరిచితం. ఈ కుంకుమపువ్వు ప్రధానంగా స్పెయిన్, ఇరాన్, భారతదేశాలలో పండుతుంది. అయితే కాశ్మీరులో లభించే కుంకుమపువ్వునే ఉత్తమమైనదిగా భావిస్తారు. వందలకొలదీ సంవత్సరాలుగా ఇది కాశ్మీరులో విస్తృతంగా పండుతోంది. దీనిని మొదట గ్రీసుదేశంలో పండించేవారు. భారతదేశంలో కుంకుమపువ్వు అత్యధికంగా కాశ్మీరులో పండుతుంది. దీనిని క్రోకస్ పువ్వు నుంచి తీస్తారు. పువ్వులలోని కేసరాలను వేరుచేస్తే కుంకుమపువ్వు లభిస్తుంది.
అతి చిన్న గ్రామమైన పాంపోర్‌లో వేలకొలదీ హెక్టార్ల భూమిలో ఈ పంట సాగుబడి జరుగుతోంది. ఈ ప్రాంతం కాశ్మీరు రాజధాని అయిన శ్రీనగర్‌కి కేవలం అరగంట ప్రయాణ దూరంలో ఉంది. పాంపోర్‌ని ‘కాశ్మీరీ కుంకుమపువ్వు గ్రామం’గా పిలుచుకుంటారు. ఈ ప్రాంతానికి సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాల నడుమ ఊదారంగులో ఉండే ఈ పూవులు కనువిందు చేస్తాయి.
దాదాపు 75000 పూలనుంచి కేవలం అరకిలో కన్నా తక్కువ కుంకుమపువ్వు మాత్రమే వస్తుంది. అందుకే కిలో కుంకుమపువ్వు ఖరీదు లక్షాఎనభై వేల రూపాయలు. అన్నట్లు కాశ్మీర్‌లో కుంకుమపువ్వు టీ ప్రత్యేకం. కేహ్వా అనే పానీయాన్ని... దాల్చినచెక్క, ఏలకులు, కుంకుమపువ్వులను వేడినీటిలో వేసి మరిగించి, తేనె, బాదంపప్పు తరుగు జతచేసి తయారుచేస్తారు. ఇది బలాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చే పానీయం.