నీదా ఈ కొండ! | The flowers were prepared for Swamiji | Sakshi
Sakshi News home page

నీదా ఈ కొండ!

Published Sun, Jun 9 2019 2:51 AM | Last Updated on Sun, Jun 9 2019 2:51 AM

The flowers were prepared for Swamiji - Sakshi

తిరుమల మాడవీథుల్లో వెడుతుంటే సహస్ర దీపాలంకరణ చేసే ప్రదేశం దాటిన తరువాత ఎడమ పక్కన తిరుమలనంబి దేవాలయం ఉంటుంది. ఎవరీ తిరుమలనంబి? ఈయనకు దేవాలయం ఏమిటి? పూర్వం శ్రీరంగంలో యమునాచార్యులవారు శిష్యులందర్నీ కూర్చోబెట్టుకుని ‘బ్రాహ్మీ ముహూర్తంలో  వేంకటేశ్వర స్వామివారి అభిషేకానికి కావలసిన జలాలను తీసుకు రావడానికి వేంకటాచలం మీద ఎవరయినా ఉండగలరా?’ అని అడిగితే తిరుమలనంబి దానికి సిద్ధపడ్డాడు. ఆయనను శ్రీశైలపూర్వులు అని కూడా అంటారు. ఆయన రోజూ పాపనాశనానికి వెళ్ళి నీళ్ళు కుండతో తలమీద పెట్టుకుని మోసుకుంటూ గోవింద నామ స్మరణ చేస్తూ అభిషేకానికి తీసుకువస్తుండేవారు. ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. వేంకటేశ్వరస్వామి బాలకిరాతుడి వేషంలో వచ్చి ‘తాతా, తాతా! దాహం వేస్తోంది.

నీళ్ళు పొయ్యవా? అని అడుగుతాడు. ‘ఇవి స్వామివారికి అభిషేకానికి తీసుకువెడుతున్నా...తప్పుకో’’ అంటూ ముందుకు సాగిపోతుంటే... బాలకిరాతుడు వెనకనుంచి బాణం వేసి కుండకు చిల్లు కొట్టి నీళ్ళు తాగుతాడు. కుండ బరువు తగ్గడం గమనించిన తిరుమలనంబి వెనక్కి తిరిగి చూసేసరికి కుండనుంచి ధారగా పడుతున్న నీటిని ఆ బాలుడు ఒడిసిపట్టి తాగుతున్నాడు. ‘‘ఎంత దుర్మార్గపు పని చేసావురా, తాగొద్దంటే అవి తాగావా?...’’అని నిందించబోతుంటే... వెంటనే ఆ బాలుడు ‘‘తాతా! బెంగపడొద్దు. నీళ్ళకు పాపనాశనందాకా వెళ్ళడమెందుకు? ఇక్కడే ఉంది, ధార నీకు చూపిస్తాను, రా...అంటూ ఆ కొండలలోకి బాణం వేసి కొట్టాడు. ఆకాశగంగ అలా వచ్చింది. ఆలయంలో స్వామి అర్చకులమీద ఆవహించి ‘‘అభిషేకానికి ఈవేళ నుంచి పాపనాశనం నీళ్ళు అక్కరలేదు. ఆకాశగంగ నీళ్ళతో చెయ్యండి.’’

అని పురమాయించారు. ఇప్పుడు తిరుమలనంబి దేవాలయం ఎక్కడ ఉందో అక్కడ ఆయన పర్ణశాల ఉండేది. అక్కడ అనుష్ఠానం చేసుకుని స్వామివారి అభిషేకానికి పాపానాశనం నుంచి రోజూ తెల్లవారుఝూమునే చాలా సంవత్సరాలపాటు నీళ్ళు మోసుకొచ్చారు. అలా ఆయన్ని ఆప్యాయంగా తాతా! అని పిలుస్తూ ఆయన్ని తరింపచేసావా, ఎంత సులభసాధ్యుడవయ్యా తండ్రీ అని చెప్పడానికి....‘‘అచ్చపు వేడుకతోడ ననంతాళ్వారు వారికి/ముచ్చిలి వెట్టికి మన్ను మోసినవాడు/మచ్చిక దొలక తిరుమలనంబి తోడుత నిచ్చనిచ్చమాటలాడి నోచినవాడు/’’ అనీ అన్నమాచార్యులవారు కీర్తన చేసారు. మరి ఈ అనంతాచార్యులవారెవరు? ఈయన కొండమీద స్వామివారికి పూలుగుచ్చి దండలు సిద్ధం చేసేవారు. ఈయన ఒకరోజున తనపనిలో నిమగ్నమై ఉండగా రమ్మనమని స్వామివారు కబురు పంపారట.

దానికి ఆచార్యులవారు ‘‘ఆయనకు వేరేపని ఏముంది కనుక, హాయిగా పీఠమెక్కి కూచుంటాడు. కబుర్లకోసం నాకు రావడం కుదరదు’ అని చెప్పిపంపి సాయంత్రం ఆ దండలన్నింటినీ గౌరవంగా ఒక బుట్టలో పెట్టుకుని వెళ్ళాడు. ‘‘నేను రమ్మంటే రానప్పుడు, నీ పూలదండలు నాకెందుకు, అక్కరలేదు ఫో!’’ అని స్వామివారు కసురు కున్నారట. దానికి అనంతాచార్యులవారు ‘నీవెవరు నన్నుపొమ్మనడానికి. నీదా ఈ కొండ? వరాహ స్వామిదగ్గర నీవు ఎలా పుచ్చుకుని వచ్చావో, అలా మా గురువుగారు వెళ్ళమంటే నేను వచ్చా. గురువుగారు దండలిమ్మన్నారు. వచ్చి ఇస్తుంటా. పుచ్చుకుంటే పుచ్చుకో. లేదంటే ఊరుకో. ఇక్కడ ఈ తలుపు కొయ్యకు తగిలించి పోతున్నా. నీ ఇష్టం. నేను మాత్రం నా పని వదిలి కబుర్లకు రాను’’ అని చెప్పి వెళ్ళిపోతుంటే స్వామివారే వెంటపడి ఆయనను బుజ్జగించి వెనక్కి తీసుకొచ్చారట. అంత పిచ్చి భక్తి చూపిన అనంతాళ్వారు వారికి వెట్టిచేసావా స్వామీ’’ అని అన్నమయ్య అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement