పాదాల చర్మం మృదువుగా..!
బ్యూటిప్స్
పాదాల పగుళ్లు పెద్ద సమస్యగా బాధిస్తుంటుంది. పాదాల అందాన్ని దెబ్బతీయడమే కాదు, నొప్పినీ తెచ్చే సమస్యలకు విరుగుడుగా!పావు కప్పు వెనిగర్, అరకప్పు వెచ్చని నీళ్లలో కలపాలి. ఆ నీళ్ళను పాదాలకు, మడమలకు రాయాలి. మిగిలిన నీళ్లను వెడల్పాటి టబ్‌లో పోసి అందులో పాదాలను ఉంచాలి. 10-15 నిమిషాల తర్వాత తడి క్లాత్‌తో అదిమిపట్టి తుడవాలి. మృతకణాలు తొలగిపోవడమే కాకుండా పాదాలకు పట్టిన బాక్టీరియా కూడా నశిస్తుంది. తర్వాత మంచి నీళ్లతో శుభ్రపరుచుకొని, పొడి క్లాత్‌తో తుడిచి బాడీ లోషన్ రాయాలి. రెండు-మూడు రోజులకు ఒకసారి ఈ విధంగా చేస్తుంటే పగుళ్లు తగ్గుతాయి. పాదాల చర్మం మృదువుగా అవుతుంది.
మరిగించిన నీళ్లలో నిమ్మరసం, రాతిఉప్పు కలపాలి. ఈ నీళ్లుగోరువెచ్చగా అయ్యాక అందులో పది నిమిషాల సేపు పాదాలను ఉంచితే ఫంగస్ నశించడమే కాకుండా దుర్వాసనా తగ్గుతుంది.రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసానికి టేబుల్ స్పూన్, పెట్రోలియమ్ జెల్లీ కలిపి శుభ్రం చేసుకున్న పాదాలకు రాయాలి. తర్వాత సాక్స్‌లు వేసుకోవాలి. రోజూ రాత్రిపూట ఈ జాగ్రత్త తీసుకుంటే నిమ్మరసం మృతకణాలను తొలగిస్తుంది. పెట్రోలియమ్ జెల్లీ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
టేబుల్ స్పూన్ బియ్యప్పిండిలో రెండు టేబుల్ స్పూన్ల తేనె, టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంతో పాదాలను, మడమలను బాగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. రాత్రి పడుకునే ముందు పాదాలకు నువ్వుల నూనె రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.