ప్యారిస్ ప్రతిష్ట కోసం..!
పర్యావరణ స్పృహ
పగలు పెర్ఫ్యూమ్ బాటిల్‌లా, రాత్రి షాంపేన్ బాటిల్‌లా ఉండే నగరం ప్యారిస్... అసలుకు ఫ్రాన్స్ అంటేనే ఒక ప్రేమదేశం. ప్యారిస్ అంటే రొమాంటిక్ సిటీ. ప్రపంచంలో ఇలాంటి పేరు, ప్రత్యేకత ఉన్న ఈ దేశాన్ని కూడా షరామూమూలైన సమస్యే పలకరిస్తోంది. అదే.. కాలుష్యం! వాయు కాలుష్యం ఫలితంగా వాతావరణం పూర్తి వేడిగా మారుతోంది. ఇంత రొమాంటిక్ ప్లేస్‌లో వేడి వాతావరణం అనేది ఏ మాత్రం సహించరానిది అని భావించింది ఫ్రాన్స్ ప్రభుత్వం. అందుకే కాలుష్యాన్ని నివారించడానికి కంకణం కట్టుకొంది. ప్రధానంగా కార్లు, మోటార్ బైక్‌ల ద్వారానే పారిస్‌లోనూ, ఫ్రాన్స్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ పొల్యూషన్ ఎక్కువవుతోందని భావించి... వాటిని నడిపే విషయంలో కొన్ని కఠినమైన చట్టాలను తీసుకొచ్చింది.
ఆ చట్టాల ప్రకారం ప్రతి సోమవారం ఎవరూ కారును బయటకు తీయడానికి వీల్లేదు. అందరూ పబ్లిక్ సర్వీస్ ట్రావెల్స్‌ను ఉపయోగించుకోవాల్సిందే! ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ప్రయాణించాల్సిందే. ఇక మంగళవారం నుంచి ప్రతిరోజూ కొన్ని నంబర్ల కార్లు మాత్రమే రోడ్డు మీదకు రావాల్సి ఉంటుంది. రోజుకు కొన్ని కార్లకు మాత్రమే పర్మిట్లు ఉంటాయి. అది కూడా కారులో కనీసం ముగ్గురు ప్రయాణిస్తూ ఉండాలి. అంటే కనీసం ముగ్గురు ప్రయాణించే ఉద్దేశం ఉంటేనే కారును బయటకు తీయాలన్నమాట.
మరి ఈ రూల్స్‌ను ప్రజలు కచ్చితంగా అనుసరిస్తున్నారా.. లేదా.. అనే విషయాన్ని పరీక్షించడానికి ఒక్క పారిస్ నగరంలోనే ఏడువందల చెక్‌పాయింట్లను ఏర్పాటు చేసిందట ప్రభుత్వం. ఎవరైనా ఈ నియమాలను అతిక్రమించినట్లయితే తీవ్రస్థాయిలో జరిమానాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలక్ట్రానిక్ వాహనాలకు మాత్రం ఇందులో నుంచి మినహాయింపు ఉంది. కాలుష్య రహితంగా నడిచే వాటిని ఎప్పుడైనా నడుపుకోవచ్చు. ఇలాంటి నియమాల ద్వారా గణనీయమైన మార్పు సాధ్యమవుతుందని ప్రభుత్వాధికారులు, మంత్రులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ కాలుష్యాన్ని అరికడుతూ ప్యారిస్ ప్రతిష్టను నిలబెడతామని అంటున్నారు.