ఆమె వయసుకు చిన్నదే కాని, విజ్ఞతలో... విజ్ఞానంలో చాలా పరిణతి సాధించింది. పండ్లు, కూరగాయలతో పరిశోధనలు చేసి ఫలితాలు సాధిస్తోంది. తన మేటి ఆలోచనలతో హృదయ సంబంధిత వ్యాధిగ్రస్తులకు భరోసాను నింపింది. కూరగాయలు, పండ్లు నెలరోజులపాటు తాజాగా ఉండే కవచాన్ని తయారు చేసింది. శస్త్రచికిత్సల అనంతరం ఇన్ఫెక్షన్‌లను నివారించేందుకు, నొప్పిని తగ్గించేందుకు ప్యాచ్‌లను తయారు చేసింది. ఆ అత్యుత్తమ పరిశోధనాత్మక ఆలోచనకు ప్రతిష్టాత్మక గాంధీయన్ యంగ్ టెక్నోలాజికల్ ఇన్నోవేషన్ అవార్డును అందుకుంది. అమెరికాలో జరిగిన సెమినార్‌లో నొప్పిని తగ్గించే ప్యాచ్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రశంసలు అందుకుంది.
వరంగల్‌లోని కొత్తవాడకు చెందిన ఆడెపు సదానందం, స్వప్న దంపతుల పెద్ద కుతురు శివకళ్యాణి. వీరిది చేనేత కుటుంబం. ఆ వృత్తిమీద వచ్చే అరకొర సంపాదనే వారికి జీవనాధారం. తమ పరిస్థితి బాగుపడాలంటే చదువుతోనే ఎదగాలనుకుంది శివకల్యాణి. మొదటి నుంచి చదువులో ప్రతిభను చూపించేది. డాక్టర్ కావాలన్న తన లక్ష్యాన్ని అందుకోవడానికి కొద్దిలో అవకాశం చేజారడంతో బీఫార్మసీలో చేరింది. పద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో బీఫార్మసీ, తర్వాత అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ రీసెర్చ్‌లో ఎమ్‌ఫార్మసీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఇండియన్ ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదారాబాద్‌లో పీహెచ్‌డీ చేస్తోంది.
హృదయ సంబంధిత వ్యాధిగ్రస్తులకు భరోసా
గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతే రక్త ప్రసరణ అగిపోయి గుండె జబ్బులకు కారణమవుతుంటుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి శస్త్రచికిత్స ద్వారా స్టెంట్‌లు వేస్తారు. వీటి ఖరీదు సుమారు రూ 30 వేల నుంచి రూ లక్ష వరకు ఉంటుంది. ఇంత ఖరీదైన వైద్యం చేయించినా రోగి బతుకుతాడనే నమ్మకం ఉండదు. కొన్నిసార్లు శస్త్రచికిత్స ఫెయిల్ అయితే, మరికొన్ని సార్లు స్టెంట్లు వేసిన చోట రక్తం గడ్డకట్టి కొత్త ప్రమాదాలు ముంచుకొచ్చి ఊహించని మరణాలు సంభవిస్తుంటాయి. దీనికి విరుగుడుగా కూరగాయల మొక్కల నుంచి తయారు చేసిన ఒక ఔషధాన్ని వాడొచ్చని నిరూపించింది శివకళ్యాణి.
పెయిన్‌కు ప్యాచ్ మందు
యాంటి బయోటిక్స్ వాడటం వలన శరిరంలోని వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే నొప్పుల నివారణ మందులను అధికంగా వాడితే జీర్ణశాయం, మూత్రపిండాలు, ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న ఔషధంలో వెయ్యవ వంతుతోనే వ్యాధి నయం అయ్యే పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది. శరీరంపై అతికించుకునే విధంగా ట్రాన్స్ నిర్మల్ ప్యాచ్‌ను తయారు చేసింది. ఈ ప్యాచ్‌కు సూక్ష్మమైన రంధ్రాలుండటం వల్ల చర్మం ద్వారా తక్కువ మోతాదులో ఎక్కువ గంటల సమయం ఔషధం శరీరంలో కలుస్తుంది. ఈ పరిశోధన ఫలితాలు ఇప్పటికే అప్లయిడ్ సర్ఫేస్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఫ్రిజ్ లేకుండానే పండ్లు, కూరగాయల నిల్వ
పండ్లు, కూరగాయలను ఫ్రిజ్‌లో లేకుండానే నెల రోజుల పాటు నిల్వ ఉండే విధంగా ఒక విధమైన పొరను తయారు చేసింది శివకల్యాణి. నిమ్మజాతులతో పాటు, ద్రాక్ష పండ్ల రసాలను 14 రోజుల పాటు ప్రత్యేక యంత్రాల్లో నిల్వ ఉంచితే బ్యాక్టీరియల్ నానో సెల్యులోస్ ఫైబర్ ఏర్పడుతుంది. శుద్ది చేసిన అనంతరం దానికి వెండి ద్రావణం కలుపుతారు. ఈ ఫైబర్‌లో మూడు నుంచి ఐదు నానో మీటర్ల అతిసూక్ష్మ రంధాలలో ద్రావణ రూపంలో ఉన్న వెండిరేణువులు అతుక్కుపోతాయి. సూక్ష్మ వెండి రేణువులకు బ్యాక్టీరియాను చంపే శక్తి ఉంటుంది. ఇలా రూపొందించిన పొరను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పండ్లు, కూరగాయలపై అతికిస్తే దాదాపు 30 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇదే పొరను శస్త్రచికిత్సల అనంతరం వచ్చే ఇన్ఫెక్షన్‌నూ నివారించేందుకు ఉపయోగించవచ్చు. బ్యాండేజీలో ఈ ఉత్పత్తిని ఉంచి కట్టుకడితే గాయంపై ఉన్న బ్యాక్టీరియా నశించడంతో పాటు గాయం నిరంతరం పొడిగా ఉంటుంది.
యంగ్ టెక్నోలాజికల్ అవార్డు
యువతలో సరికొత్త ఆలోచనలను ప్రోత్సహించి వాటికి ప్రాధాన్యం కల్పించి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కేంద్రప్రభుత్వం గాంధీయన్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. దీనికి దేశ వ్యాప్తంగా దరఖాస్తులొస్తాయి. వచ్చిన ప్రతి ఆలోచనలను దేశంలోని అన్ని ఐఐటీలు, పరిశోధన కేంద్రాలు, ప్రముఖ శాస్త్రవేత్తలకు పంపిస్తారు. వాటిపై ఆధ్యయనం చేసి ఆచరణ సాధ్యమైన ఉత్తమాలోచనలను అవార్డులకు సిఫార్సు చేస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి శివకళ్యాణి ఈ అవార్డును అందుకుంది. అమెరికాలోని బోస్టన్ సిటీలో హైన్స్ కన్వెన్షన్ సెంటర్‌లో మెటీరియల్ రిసెర్చ్ సొసైటీ అర్గనైజేషన్(ఎంఆర్‌ఎస్) ఆధ్వర్యంలో ఇటీవల టూడీ నానో మెటీరియల్స్ ఇన్ హెల్త్ కేర్ సదస్సులు జరిగాయి. ఈ సదస్సుకు ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి పరిశోధకులు విచ్చేశారు. వారిలో భారతదేశం నుంచి హాజరైన ఆరుగురిలో శివకల్యాణి ఒకరు. నొప్పిని తగ్గించే ప్యాచ్‌పై ఆమె ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది అందరినీ ఆకట్టుకుంది.
– గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, వరంగల్‌రూరల్
ఫోటోలు: పెద్దపల్లి వరప్రసాద్, వరంగల్ రూరల్
అమ్మానాన్నల ప్రోత్సాహంతో....
నేను ఇవ్వాళ ఈ స్థాయికి వచ్చానంటే అమ్మానాన్నల ప్రోత్సాహమే కారణం. మా అమ్మానాన్నలు రోజుకు 12 గంటల పాటు కష్టపడి చేనేత పని చేస్తున్నారు. మరిన్ని పరిశోధనలు చేసి పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధమైనవి కనుక్కొంటాను. నా పరిశోధనలకు మా ప్రొఫెసర్‌లు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు ఎంతగానో సహకరిస్తున్నారు.
– శివకళ్యాణి
సాయం చేస్తే... సార్థకం చేస్తుంది
నేను కష్టపడి సంపాదించిన ప్రతి పైసాకూ మా పిల్లలు తగిన గుర్తింపును ఇచ్చారు. పేదకుటుంబమైనా, మా పిల్లల చదువు కోసం వెనుకడుగు వేయలేదు. నేను ఎంత కష్టమైనా పడి పిల్లలను చదివిస్తున్నాను. చేనేత వర్గానికి చెందిన వాళ్ళం మేము. నా కూతురు చేసే పరిశోధనలపైన రాష్ట్రప్రభుత్వం, ఇతర పెద్దలు దృష్టి పెట్టి సహాయం చేస్తే ప్రజలకు ఉపయోగపడే వాటిని నా కూతురు కనుక్కొని చవకగా అందజేస్తది.
Comments
Please login to add a commentAdd a comment