
గైనిక్ కౌన్సెలింగ్
సేఫ్ పీరియడ్ అంటే ఏమిటి?
నాకు ఇటీవలే పెళ్లయ్యింది. సేఫ్ పీరియడ్ ప్రక్రియను అనుసరించదలచుకున్నాం. దీన్ని గురించి వివరించండి. - రమాదేవి, కొత్తగూడెం
సాధారణంగా రుతుక్రమం నెలరోజులకోసారి వస్తుంది. ఇక్కడ నెల అంటే సరిగ్గా క్యాలండర్‌లోని నెల అని అర్థం కాదు. చాంద్రమానం ప్రకారం నెల అనుకోవచ్చు. అంటే 28 రోజులన్నమాట. ఒక రుతుక్రమంలోని నెలరోజుల వ్యవధిలో జరిగే పరిణామాలను మూడు దశలుగా విభజించవచ్చు. మొదటిది అండం విడుదలకు ముందుదశ. దీన్ని ఫాలిక్యులార్ ఫేజ్ అంటారు. ఇక రెండోది అండం విడుదల దశ. దీన్ని ఒవ్యులేషన్ ఫేజ్ అంటారు. ఇక అండం విడుదలైన తర్వాతది లూటియల్ ఫేజ్.
రుతుస్రావం వచ్చాక రక్తస్రావం కనిపించిన మొదటి రోజు నుంచి లెక్కవేసి ఈ దశలను నిర్ణయించుకోవచ్చు. మొదటి దశలో... అండాశయంలో ఫాలికిల్స్ పెరుగుతాయి. వీటిల్లో ఒకటి అండంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే బాగా అభివృద్ధి చెందిన అండం... అండాశయం (ఓవరీ) నుంచి విడుదల అవుతుంది.
ఇలా విడుదలైన అండం ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా గర్భాశయం (యుటెరస్)లోకి చేరుతుంది. ఈ దశలోనే 24 గంటల వ్యవధిలో వీర్యం అండంతో కలిస్తే ఫలదీకరణ జరిగి అది బిడ్డగా ఎదుగుతుంది. అలా జరగడానికి వీలుగా అండంలో ఉండే కార్పస్ ల్యూటియమ్ అనే జీవరసాయనాలు తోడ్పడతాయి. అండం విడుదల తర్వాతి దశను ల్యూటియల్ ఫేజ్ అంటారు. ఈ లూటియల్ ఫేజ్ 14 రోజులు ఉంటుంది.
సాధారణంగా పీరియడ్స్ క్రమం తప్పకుండా వచ్చే వారిలో మాత్రమే సేఫ్ పీరియడ్‌కు ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు ప్రతి 28 రోజులకు క్రమం తప్పకుండా పీరియడ్స్ వచ్చేవారికి 14 రోజున అండం విడుదలై ఉంటుంది. ఒకవేళ ఆ టైమ్‌లో గర్భధారణ జరగకపోతే ల్యూటియల్ ఫేజ్ మొదలై ఆ తర్వాత 14 రోజున రుతుస్రావం అవుతుంది. ఇక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... అండం ఎప్పుడు విడుదలైనా కూడా గర్భధారణ జరగకపోతే ల్యూటియల్ ఫేజ్ మాత్రం తప్పనిసరిగా 14 రోజులు ఉంటుంది. అంటే ఉజ్జాయింపుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... క్రమం తప్పకుండా పీరియడ్స్ వచ్చే వారిలో పీరియడ్స్ మొదలైన తర్వాత మొదటి ఏడురోజులూ, రుతుస్రావం వస్తుందనుకునే రోజుకు ముందుగా ఉండే ఆ ఏడురోజుల్లో భార్యాభర్తలు కలిసినా గర్భధారణకు అవకాశం ఉండదు.
అయితే రుతుక్రమం అన్నది అందరిలోనూ ఒకేవిధంగా ఉండదు. కొందరికి నెలకంటే ఆలస్యంగానూ కావచ్చు. మరికొందరిలో ముందుగానే నెలసరి రావచ్చు. ఈ విషయంలో 35 రోజులు దాటితే దాన్ని ఆలస్యంగానూ, 21 రోజులైతే దాన్ని ముందుగా వచ్చే నెలసరి అని డాక్టర్లు పరిగణిస్తారు. ఇటువంటి వారిలో గర్భనిరోధానికి ‘సేఫ్ పీరియడ్’ ఉపయోగపడదు. గత ఆర్నెల్ల వ్యవధిలో పీరియడ్స్ సక్రమంగా వస్తున్నవారు మాత్రమే దీనిపై కొంతమేరకు ఆధారపడవచ్చు. ఇక ప్రసవం అయిన మహిళలు దీన్ని అనుసరించదలచుకుంటే తమ రుతుస్రావం పూర్తిగా క్రమబద్ధం అయ్యాక తమ పీరియడ్స్ అయ్యే తీరును కనీసం ఆర్నెల్లు గమనించాక మాత్రమే దీన్ని అనుసరించాల్సి ఉంటుంది.