గంధర్వ విజయం! | Gandharva success! | Sakshi
Sakshi News home page

గంధర్వ విజయం!

Published Mon, Dec 9 2013 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM

Gandharva success!

ఐఐటీ చదువు అతడిని ఎవరి దగ్గరా ఉద్యోగం చేయనీయలేదు, ఊరికే ఉండనీయలేదు. సొంత కాళ్ల మీద నిలబడాలి, కొంతమందికైనా ఉపాధిని చూపించగలగాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించింది. మదిలో ఉన్న ఆలోచన, సేవింగ్స్ ఖాతాలో ఉన్న డబ్బు అందుకు సహకరించాయి. సక్సెస్‌కు దారి చూపెట్టాయి. ఈ దారిలో భార్య కూడా తోడయ్యింది. సగం శ్రమ తగ్గించింది. గంధర్వ్, లవీనా బక్షీ అనే యువజంట సాధించిన విజయం ఇది...
 
ఇటీవల బెంగళూరులో నాస్కామ్ ఆధ్వర్యంలో జరిగిన ‘స్టార్టప్ రియాలిటీ షో’తో వెలుగులోకి వచ్చాడు గంధర్వ్. ఈ షో లో తన ప్రాజెక్ట్ గురించి ఎనిమిది నిమిషాల పాటు గంధర్వ్ ఇచ్చిన ప్రెజెంటేషన్ అనేకమంది పారిశ్రామికవేత్తలను ఆకట్టుకొంది. గంధర్‌‌వ ఆలోచనపై పెట్టుబడి పెట్టడానికి వారు ముందుకు వచ్చారు. గంధర్‌‌వ ఐడియా పాతిక లక్షల రూపాయల బహుమతిని, కోటి రూపాయల పెట్టుబడులను సాధించి పెట్టింది! ఇరవై ఆరేళ్ల గంధర్వ్‌బక్షీ ఐఐటీ మద్రాస్‌లో ఇంజినీరింగ్, బెంగళూరు ఐఐఎమ్‌లో ఎమ్‌బీఏ పూర్తి చేశాడు. మంచి జీతం ఇచ్చే ఉద్యోగాలు ఎన్నో వచ్చాయి. అయితే ఉద్యోగం చేయడం అంటే ఒకరకంగా రాజీపడిపోవడం అనే భావనతో, సొంతంగా పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరాలనే లక్ష్యాన్ని పెట్టుకొన్నాడు. గంధర్వ్ మదిలో లక్ష్యాలే కాదు... ఇన్నోవేటివ్ ఐడియాలు కూడా ఉన్నాయి. అవకాశం కూడా కలిసి రావడంతో సూపర్ సక్సెస్‌ను సాధించాడు.


 చార్జింగ్ ఇబ్బందులు తప్పించేందుకే...
 
  ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. అలాగే వీటి చార్జింగ్ విషయంలో ఇబ్బందులు పడే వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. బిజీ లైఫ్‌లో ల్యాప్‌టాప్‌లకు, స్మార్ట్‌ఫోన్లకు చార్జింగ్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేకుండా, జర్నీలోనే అవి చార్జింగ్ అయ్యే ఐడియాను ఆవిష్కరించాడు గంధర్వ్. ఇక్కడ క్యారీబ్యాగ్ సోలార్ ప్యానల్‌గా ఉపయోగపడుతుంది. అందులో పెట్టిన ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌లు చార్జింగ్ అవుతాయి. ఆ బ్యాగ్‌ను భుజానికి తగిలించుకొని నడుచుకొని వెళ్లినా, సైకిల్‌పై వెళ్లినా తక్కువపాటి సూర్యరశ్మితోనే ఎలక్ట్రానిక్ గాడ్జెట్ బ్యాటరీని ఫిల్ చేయవచ్చు.
 
బెంగళూరులో ‘లూమస్’ అనే  కంపెనీని స్థాపించి, ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్న గంధర్‌‌వ తన  ఐడియా నచ్చితే తనతో కలిసి రావొచ్చని షోకు హాజరైన ప్రముఖ వ్యాపారవేత్తలను  కోరాడు. దీనికి మంచి స్పందన వచ్చింది. గూగుల్ ఇండియా ఎమ్‌డీ ఆనంద్ రాజన్‌తో సహా అనేకమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు ‘లూమస్’కు సహకారం అందిస్తామని ప్రకటించారు. ఈ బడ్డింగ్ కంపెనీలో కొంతశాతం వాటాలను కొంటూ  కోటి రూపాయల పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించారు.  దీంతో గంధర్‌‌వ దశ తిరిగింది. ఆలోచనను అమల్లో పెట్టడానికి కావాల్సిన పెట్టుబడి లభించింది.
 
 ఎన్నో ఐడియాల మధ్య వికసించింది...


 బెంగళూరులో జరిగిన ‘స్టార్టప్ రియాలిటీ షో’కు తమ ఐడియాలతో ఎంతోమంది యువతీ యువకులు హాజరైనా ఎక్కువమందిని ఆకట్టుకొన్నది, నవ్యతతో కూడుకొన్నది... అనే పేరు మాత్రం ‘లూమస్’కే వచ్చింది. ఇది ఒక సామాజిక అవసరమని, తక్కువ ధరలో రీచార్జింగ్ బ్యాగ్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తే మంచిదని పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానించారు. పునరుద్ధరింపదగిన ఇంధన వనరు అయిన సౌరశక్తిని చార్జింగ్‌కు ఉపయోగించుకోవడం మంచి విషయమని, చార్జింగ్ కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరాన్ని నిరోధించడం అభినందించాల్సిన విషయం అని షో కు వచ్చిన వ్యాపారవేత్తలు అభిప్రాయపడ్డారు.
 
 భార్య సహకారం గొప్పది...


 పాతికేళ్ల వ యసులోనే లవీనాను వివాహం చేసుకొన్నాడు గంధర్వ్. వీరిద్దరూ కలిసి ‘లూమస్’ కంపెనీని నెలకొల్పారు. తను చేస్తానన్న ఈ ప్రయోగానికి భార్య సహకరించిందని, తన సేవింగ్స్ ఖాతాలో ఉన్న డబ్బును పెట్టుబడిగా పెట్టడానికి అనుమతి ఇచ్చిందని గంధర్‌‌వ చెప్పాడు. ఈ విధంగా తన విజయంలో భార్యకు వాటా ఉందంటూ ఆమెను వేదికపైకి పిలిచి, జంటగా అవార్డును, అభినందనలను అందుకొన్నాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement