
జల్‌గావ్‌లోని ‘గాంధీ తీర్థ్’
నేడు గాంధీ జయంతి
మహాత్మా గాంధీ! స్వతంత్ర పోరాటంలో ప్రజల నోట పలికిన తారకమంత్రం. విదేశీ దురాక్రమణకారుల పాలిట శరాఘాతం. ఆయన మాట కోట్లాది ప్రజలకు వేదవాక్కు. తారతమ్యాలను మరచి ప్రజలను ఏకతాటిపై నిలిపిన శిలా శాసనం. స్వాతంత్య్ర సమరాంగణంలో జాతీయ సేనను అహింసా పథంలో నడిపిన సేనాని. అలాంటి మహాత్ముడి ఆశయాలకు ఆకృతి దాల్చిన రూపంలా ‘గాంథీ తీర్థ్’ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తోంది.
గాంధీ తీర్థ్ మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో ఉంది. భారతదేశం గర్వించదగ్గ గొప్ప వ్యాపారవేత్త, ప్రముఖ గాంధేయవాది భవర్‌లాల్ జైన్ గాంథీ తీర్థ్‌ను స్థాపించారు. మహాత్ముడి జీవితాన్ని, సిద్ధాంతాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేయాలనే సంకల్పంతో ఆయన దీని నిర్మాణానికి పూనుకున్నారు. 2012లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. లోపలికి ప్రవేశించగానే 300 ఎకరాల్లో విస్తరించిన పచ్చని పచ్చిక బయళ్లు సందర్శకుల బడలికను పోగొట్టి ఆహ్లాదాన్ని పంచుతాయి. గాంధీ తీర్థ్‌లో ప్రధాన ఆకర్షణ మ్యూజియం. మహాత్మాగాంధీ జీవిత విశేషాలతో నిర్మించిన మ్యూజియం ప్రపంచంలో ఇదొక్కటే.
తెరతీయగానే... గాంధీ తీర్థ్‌లో పూర్తి ఎయిర్ కండిషన్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. లోపలికి ప్రవేశించగానే చిరునవ్వులు చిందిస్తూ చరఖా తిప్పుతున్న మహాత్ముడి ప్రతిమ జీవకళ ఉట్టిపడుతూ సాదరంగా ఆహ్వానిస్తుంది. మ్యూజియంలోని మొత్తం 30 కి పైగా విభాగాల్లో లక్షలాది స్మారక చిహ్నాలను భద్రపరచారు. మ్యూజియంలో ఏర్పాటుచేసిన టచ్ స్క్రీన్‌లు మహాత్ముడి జీవితంలోని కొన్ని మధుర ఘట్టాలను మన ముందుంచుతాయి.
డిజిటల్ టచ్‌స్క్రీన్‌పై చేయి పడగానే వరుసగా వెలువడే సూక్తులు సందర్శకులకు గాంధీయిజాన్ని పరిచయం చేస్తాయి. గాంధీ బాల్యజీవితాన్ని చూపేందుకు ఏర్పాటు చేసిన బయోస్కోప్ సందర్శకులను కట్టిపడేస్తుంది. గాంధీ చిన్నతనంలో తిరిగిన ప్రదేశాలకు, పాఠశాలకు చేయిపట్టి తమవెంట నడిపిస్తాయి. ఆయన తోటి స్నేహితుల్లో ఒకరిగా చేస్తాయి.
పఠనానికి... మ్యూజియంలో గాంధీ లైబ్రరీని ఏర్పాటు చేశారు. గాంధీ జీవితాన్ని విభిన్న కోణాల్లో సృశించే 7 వేల పైచిలుకు పుస్తక రాశి ఈ గ్రంథాలయం సొంతం. 7 వేలకు పైగా ఉన్న మహాత్ముడి ఫోటోలు స్వాతంత్య్ర పోరాటంలోని వివిధ ఘట్టాల్లోని ఉద్వేగ స్మృతులను మనముందుంచుతాయి. వివిధ సందర్భాల్లో సభలు, సమావేశాలు, ఉద్యమాల్లోని మహాత్ముడి ప్రసంగాలను 150కు పైగా ఆడియో టేపుల్లో నిక్షిప్తం చేశారు. విభిన్న కోణాల్లో గాంధీజీ జీవితాన్ని చిత్రిక పట్టిన 70కు పైగా సినిమా ప్రింట్‌లను ఇక్కడ భద్రం చేశారు. గాంధీ జీవితంపై రూపొందించిన నాటకాలను ప్రదర్శించేందుకు 250 సీట్లతో ఒక నాటకశాలను ఇందులో నిర్మించారు.
పరిశోధనకు... గాంధీ జీవితంపై పరిశోధన చేసేవారు ఉండేందుకు వసతి గృహాలను నిర్మించారు. వారు కావలసినన్ని రోజులు ఇక్కడ ఉండి గాంధీతత్వంపై తీరిగ్గా తమ పరిశోధనలు చేసుకోవచ్చు. సందర్శకులు వీలయినన్ని రోజులు ఉండి గాంధీ జీవితం గురించి క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఆధునిక హంగులతో అతిథి గృహాలు ఏర్పాటు చేశారు. విజ్ఞాన యాత్రలో భాగంగా గాంధీతీర్థ్‌ను సంద ర్శించే విద్యార్థి బృందాల కోసం, కార్పొరేట్ ఉద్యోగుల కోసం సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు.
ఈ నేలపై అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి జాతిపిత ఆశయాలను మదిలో నింపుకొని తిరుగు పయనమవాలనే భవర్‌లాల్ కల సాకారం చేస్తూ దేశ విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది గాంధీతీర్థ్‌ను సందర్శిస్తున్నారు. మహాత్ముడి తాత్వికధారలో తడిసిముద్దయి మనసులోని మాలిన్యాలను ప్రక్షాళన చేసుకుంటున్నారు. - దండేల కృష్ణ