
మహాత్ముని మార్గం
గాంధీమనందరికీ ఒక ఒక రాజకీయనేతగా, అహింసావాదిగా, స్వాతంత్య్ర సమర యోధునిగా, న్యాయవాదిగా, సత్యాన్వేషకునిగా మాత్రమే తెలుసు. అయితే ఆయనను ఒక ఆధ్యాత్మికవేత్తగా కూడా పరిశీలిస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు అవగతమవుతాయి. మతం పట్లఆయన అభిప్రాయాలు నిజంగా ఎంత ఉన్నతమైనవో తెలుస్తుంది. ‘అసలైన మతం భౌతికమైనది కాదు, అది హృదయానికి సంబంధించినది. సత్యం, అహింసలపై శ్రద్ధకలిగించేది. దేవుడికి మాత్రమే కట్టుబడి ఉండేది. పరమాత్మకు, ఆత్మకు సంబంధించిన వ్యక్తిగత అంశం అంటూ తన దృష్టిలో మతం అంటే ఏమిటో చెబుతాడు మహాత్ముడు.
చిన్ననాటే నాటుకున్న రామబీజం
తనకు చిన్నతనంలో భూతాలు, ప్రేతాలు అంటే భయమని, ఆ భయం పోవాలంటే రామస్మరణే మందు అని దాసి రంభ చెప్పిన మాటల ప్రేరణ తనను జీవితాంతం వదలలేదని చెప్పేవారు. అలా చిన్ననాట హృదయంలో నాటుకున్న రామనామ బీజం తరువాత కూడా అలాగే నిలిచిపోయిందని, రామరక్షాస్తోత్రాన్ని నిత్యం పారాయణ చేసేవాడినని ఆత్మకథలో చెప్పుకున్నారు.
ఎప్పుడైనా నిరాశ, నిస్పృహ తనను ఆవరించినప్పుడు తాను భగవద్గీతను వల్లెవేసేవాడినని, క్షణాల్లో అవి మటుమాయమయ్యేవని ఆయన భగవద్గీత ఔన్నత్యాన్ని బోధించేవారు. భగవద్గీతను తల్లిలా భావించేవారు. ఒక్క భగవద్గీతనే కాదు, ఖురాన్, బైబిల్, బౌద్ధ సూత్రాలు అన్నీ ఆయన పఠించారు. వాటిలో దాగున్న ఔన్నత్యాన్ని గ్రహించారు. అన్ని మతాల సారం ఒక్కటేనని, ఈశ్వరుడిని కొలిచినా, అల్లాను వేడుకున్నా, జీసస్‌ను ప్రార్థించినా, అన్ని విధానాలు ఆయన్ని చేరుకునేందుకేనని గాంధీజీ చెప్పేవారు. ఎవరి హృదయం నిర్మలంగా ఉంటుందో, ఎవరు తమ లక్ష్యాన్ని దైవంగా భావిస్తారో వారివెంట దైవం ఉంటుంది. సత్యం, ప్రేమ, ధర్మం, నిజాయితీ, నిర్భయత... కలిగి ఉండే వారికి పరమాత్ముడు స్వయంగా తోడ్పాటు అందిస్తాడని ప్రబోధించేవారు.
గాంధీగీత
భగవద్గీతలో శ్రీకృష్ణుడు రథసారథి, అర్జునుడు రథికుడు. గాంధీ గీతలో ఆత్మ రథికుడు, తెలివితేటలు, మేధస్సు దానిని నడిపించే సారథి, మనస్సు ఆ రథచక్రాలు, జ్ఞానేంద్రియాలు గుర్రం. గాంధీజీ చెప్పిన ఈ ఒక్క వాక్యాన్ని బట్టే తెలుస్తుంది మనల్ని మనం నియంత్రణలో ఉంచుకోగలిగితే దేనినైనా సాధించవచ్చునని.
సత్యమే గాంధీ దైవం
సత్యాన్ని పరమాత్ముని రూపంగా, సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపంగా భావించారు మహాత్ముడు. సత్యంలో భగవంతుడిని ఆయన చూసినంత నిశితంగా మరొకరు పరికించి ఉండరు. సత్యానికి ఆయన ఇచ్చినంత ప్రాముఖ్యం వేరొకరు ఇవ్వలేదు. మనకు రుషులు, మతబోధకులు బోధించే భగవ త్ సాక్షాత్కార సూత్రాలన్నింటినీ సత్యాన్వేషణలో గాంధీజీ స్పష్టంగా సూచించారు.
ప్రార్థన మానవత్వానికి పిలుపు. ఆత్మశుద్ధికి మార్గం. మనలోని బలహీనతలను గుర్తించే ప్రక్రియే ప్రార్థన అన్నది గాంధీజీ భావన. శరీరానికి ఆహారం ఎంత అవసరమో మనసుకు ప్రార్థన అంతే అంటారాయన. అయితే ప్రార్థన అంటే కేవలం పెదవులతో ఉచ్చరించేదే కాదు. ఎలాంటి భేదభావాలు, తారతమ్యాలకు తావివ్వకుండా హృదయ ప్రక్షాళన కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే కళ్లు మూసుకుని ధ్యానం చేస్తూ కూర్చోవడం కాదు. ప్రార్థనకు కావలసింది మనసులేని మాటలు కాదు, మాటలు లేని మనసు అన్నది మహాత్ముడి మార్గం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర్ అల్లా తేరేనామ్, సబ్‌కో సన్మతి దే భగవాన్... ఇది మహాత్ముడికి అత్యంత ప్రీతికరమైన ప్రార్థన.
స్వచ్ఛగాంధీ
ప్రస్తుతం ప్రభుత్వాలు, పర్యావరణవేత్తలు కోట్లాది రూపాయల వ్యయంతో చేస్తున్న స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని గాంధీజీ ఏనాడో అమలు చేశారు. దళితవాడలకు, మురికివాడలకు వెళ్లి, వారికి పరిశుభ్రత గురించి ప్రబోధించారు. అలా మాటలు చెప్పి ఊరుకోకుండా, తానే స్వయంగా చీపురు పట్టి, వీధులను శుభ్రం చేశారు. మలాన్ని ఎత్తి పారబోశారు. తద్వారా పరిశుభ్రత అంటే ఏమిటో వారికి తెలిసేలా చేశారు.
ఆత్మప్రక్షాళనే మార్గం
మనిషి అటు మృగమూ కాదు, ఇటు పరమాత్మ కాదు. పరమాత్మ సృష్టించిన ప్రాణిగా తనలోని దైవత్వాన్ని గుర్తించే దిశగా నడవాలి. అందుకు పశ్చాత్తాపం, ఆత్మప్రక్షాళనే మార్గం. మన తప్పుల్ని తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నంలో పరమాత్మను శరణువేడితే కొత్త జీవితానికి నాంది పలికినట్లవుతుంది. అహింస, శాంతి, సహనం, సత్యం, సమైక్యతలే ఆ మహాత్ముడు దేవుని అర్చించే పూజాపుష్పాలు. మనం ఆ పుష్పాలను అందుకుందాం. మాలిన్యం లేనటువంటి స్వచ్ఛమైన మనస్సుతో మనం ఆయన చూపిన మార్గంలో నడుద్దాం.
- డి.వి.ఆర్.