అతి నీరసం, అతి ఆకలి, అతిగా మూత్రవిసర్జన... ఎందుకు?
నా వయసు 35 ఏళ్లు. ఈమధ్య తరచూ ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. అతిగా దాహం వేస్తోంది. ఆకలి బాగా వేస్తుంది. నీరసంగా అనిపిస్తోంది. తరచూ ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. నేను చేస్తున్న పనిలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఈ లక్షణాలు చెబుతుంటే... నాకు షుగర్ వచ్చిందేమోనని నా ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి వివరంగా చెప్పండి. – కె. ప్రద్ముమ్న, విశాఖపట్నం
ఉద్యోగరీత్యా మీరు ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పారు. ఇలా ఎక్కువ ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి డయాబెటిస్‌ను మరింత త్వరగా వచ్చేలా చేస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలన్నీ డయాబెటిస్ లక్షణాలనే పోలి ఉన్నాయి.
డయాబెటిస్ వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, కొన్ని సందర్భాల్లో మీరు చెబుతున్నట్లుగానే ప్రైవేట్ పార్ట్స్‌లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కాబట్టి ఒకసారి మీరు షుగర్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ షుగర్ పరీక్షలు, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, హెచ్‌బీ1ఏసీ వంటి పరీక్షలతో డయాబెటిస్‌ను నిర్ధారణ చేయవచ్చు. వీలైనంత త్వరగా మీరు దగ్గర్లోని ఫిజీషియన్‌ను సంప్రదించి, వారి సూచనలను అనుసరించండి.
అక్యూట్ ప్యాంక్రియాటైటిస్‌కు కారణం ఏమిటి?
నా వయస్సు 42 ఏళ్లు. ఇటీవలే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వల్ల చాలారోజులు ఆసుపత్రిలో ఉండాల్సివచ్చింది. వెంటిలేటర్ కూడా పెట్టారు. ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – కె. జగ్గారావు, విజయవాడ
అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాటిక్ గ్రంథి ఇన్‌ఫ్లమేషన్ వల్ల వచ్చే సమస్య. ఆల్కహాల్ మొదలుకొని పిత్తాశయంలో రాళ్లు, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యల వల్ల ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. ఈ వ్యాధి ఉన్నవారిలో కడుపు నొప్పితో వాంతులు కావడం, ఒక్కోసారి ఇతర అవయవాలు, వ్యవస్థలు పనిచేయకపోవడం (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్) వంటి సమస్యలకు దారితీయవచ్చు.
అందుకే దీన్ని ఒక మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాధి వచ్చిన వారికి చికిత్స తర్వాత కూడా దీర్ఘకాలికంగా మందులు, క్రమం తప్పకుండా డాక్టర్‌కు చూపించుకోవడం అవసరం. మీరు మితాహారం తీసుకోవడం అవసరం. మాంసాహారం, నూనె పదార్థాలు కూడా అతి తక్కువగా తీసుకోవాలి.
ఎప్పుడూ ఆందోళనే.... తగ్గేదెలా?
నా వయసు 36 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ కంపెనీ పనిచేస్తాను. తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాను. ఎప్పుడూ తీవ్రమైన ఆందోళనతో ఉంటాను. త్వరగా ఉద్వేగాలకు గురవుతుంటాను. ఎడతెరిపి లేకుండా ఆలోచనలు వస్తుంటాయి. నిద్ర సరిగా పట్టదు. నా సమస్యలకు తగిన చికిత్సను సూచించండి. – సుధీర్, హైదరాబాద్
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు యాంగై్జటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. మీరు చెప్పిన లక్షణాలైన తీవ్రమైన ఆందోళనలు, ఎడతెరిపి లేని ఆలోచనలు దీన్నే సూచిస్తున్నాయి. సాధారణంగా తీవ్రమైన ఒత్తిళ్లలో పనిచేసేవారిలో ఇది చాలా ఎక్కువ. మీరు ముందుగా ఒకసారి రక్తపరీక్షలు చేయించుకొని, రక్తంలో చక్కెరపాళ్లను పరీక్షించుకోండి. ఎందుకంటే మీ తరహా పనితీరు (సెడెంటరీ లైఫ్‌స్టైల్) ఉన్నవారిలో ఒత్తిడి వల్ల రక్తంలో చక్కెరల విడుదల ఎక్కువగా ఉంటుంది. దాంతో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఇలా మీకు తెలియకుండానే డయాబెటిస్ ఉంటే అది నరాలపై ప్రభావం చూపి, పెరిఫెరల్ నర్వ్స్, అటనామస్ నర్వ్స్ (స్వతంత్రనాడీ వ్యవస్థ)పై ప్రభావం చూపి ఇలా గాభరా, హైరానాపడేలా చేయడం చాలా సాధారణం. మీకు చికిత్స కంటే కూడా జీవనశైలిలో మార్పులు అవసరం. సమస్యతో అవగాహనతో, పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాలి. మీరు ఉదయమే నిద్రలేచి బ్రిస్క్ వాకింగ్ వంటి వ్యాయామాలు, యోగా, మెడిషటేషన్ చేయడం, వేళకు భోజనం తీసుకోవడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆహ్లాదకరమైన వ్యాపకాలను అలవరచుకోవడం వంటి జీవనశైలి మార్పులతో మీ సమస్య చాలావరకు తగ్గుతుంది.
పైన పేర్కొన్న పరీక్షలు చేయించాక ఫిజీషియన్‌ను కలవండి. ఒకవేళ మీకు తెలియకుండా షుగర్ వచ్చి ఉంటే డాక్టర్... ఆ సమస్యకు కూడా కలిపి చికిత్స సూచిస్తారు. ఒకవేళ మీకు షుగర్ లేకపోతే... మీరు చెప్పిన జీవనశైలి వల్ల త్వరగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నందున... ఆ సమస్యను నివారించచడం కోసం జీవనశైలి మార్పులను తప్పక అనుసరిస్తూ, యాంగ్జటీని తగ్గించే మందులైన యాంగ్జియోలైటిక్స్‌ను డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి.
- డాక్టర్ ఎమ్. గోవర్ధన్, సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment