హోమియో కౌన్సెలింగ్
మా అబ్బాయి స్వభావసిద్ధంగా చురుగ్గా ఉంటాడు. ఆ చురుకుదనం వల్ల ఆటల్లో పరుగెడుతున్నాడు. కానీ త్వరగా ఆయాసపడుతున్నాడు. అలా ఆయాసం వస్తే అది ఆస్తమానేనా? పిల్లల్లో ఆస్తమాను గుర్తుపట్టడానికి మార్గాలు చెప్పండి.
- శ్రీరేఖ, పెంచికల్‌దిన్నె
పిల్లల్లో ఆస్తమా వచ్చినప్పుడు వారు శ్వాసతీసుకోడానికి ఇబ్బంది పడుతుంటారు. ఆయాసపడుతుంటారు. పడుకున్నప్పుడు పిల్లికూతలు వస్తాయి. రాత్రివేళ దగ్గు కూడా వస్తుంటుంది. పిల్లల స్వభావసిద్ధత వల్ల చాలా చురుగ్గా పరుగెడుతుంటారు. ఇక మాట్లాడినప్పుడు కూడా మాట పూర్తికావడానికి తగినంత దమ్ము అందుతుండదు. ఇలా జరిగినప్పుడు దాన్ని ఆస్తమాగా గుర్తుపట్టడానికి వీలవుతుంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
సీబీపీ, ఈఎస్‌ఆర్, అబ్‌సల్యూట్ ఇజినోఫిల్ కౌంట్, ఛాతీ ఎక్స్‌రే, సీటీ స్కాన్, స్పైరోమెట్రీ, పల్మునరీ ఫంక్షన్ పరీక్షలు మొదలైనవాటిని వ్యాధి నిర్ధారణ కోసం డాక్టర్లు చేయిస్తుంటారు. పైన పేర్కొన్న పరీక్షల ద్వారా ఆస్తమానా లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర వ్యాధి ఏమైనా ఉందా అని వారు నిర్ధారణ చేస్తుంటారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
దుమ్ము, ధూళి నుంచి దూరంగా ఉండాలి శీతలపానీయాలు, ఐస్‌క్రీములు తినకూడదు పెంపుడు జంతువుల నుంచి దూరంగా ఉండాలి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండే పార్థీనియం మొక్కలను తొలగించి, పుప్పొడికి దూరంగా ఉంచాలి కొన్ని జంతువుల విసర్జరకాల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి పెయింట్ వంటి ఘాటైన వాసనలు, వివిధ రకాల స్ప్రేలు, దోమల నివారణకు ఉపయోగించే ఘాటైన వాసనలు వెలువరించే మస్కిటో రిపల్లెంట్స్ వంటివి పిల్లలకు సరిపడటం లేదని గుర్తిస్తే వాటిని వాడకూడదు.
చికిత్స: హోమియో విధానంలో అలర్జీలకు సంబంధించిన ఎలాంటి వ్యాధినైనా జెనెటిక్ కాన్‌స్టిట్యూషన్ సిమిలియం ద్వారా నయం చేయవచ్చు. ఈ ప్రక్రియలో రోగనిరోధకశక్తిని పెంపొందించపజేసి, ఎలాంటి అలర్జిక్ ప్రతిచర్యనైనా శరీరం తట్టుకునేలా ఇమ్యూనిటీని పెంచే మందులు ఇస్తారు. ఇలా ఇమ్యూన్ సిస్టమ్‌ను బూస్ట్ చేయడం వల్ల ప్రతికూల పరిస్థితల్లోనూ పిల్లలు ఆరోగ్యంతో ఉండేలా చూడటం హోమియో విధానం ప్రత్యేకత.
-డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
జనరల్ కౌన్సెలింగ్
నాకు కొన్ని పులుపు పదార్థాలంటే చాలా ఇష్టం. ఉదాహరణకు పులుసు కూరలు, చింతకాయ పచ్చడి, పండుమిరపకాయ పచ్చడి వంటివి ఇష్టంగా తింటాను. అవి తిన్న వెంటనే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంటుంది. చాలా మంది డాక్టర్లను కలిస్తే ఇది అల్సర్ వల్ల కావచ్చని అంటున్నారు. నేను ఎప్పటికీ నాకు ఇష్టమైన వాటిని తినలేనా? నాకు తగిన సలహా ఇవ్వండి.
- ఉపేంద్రనాథ్, సిరిసిల్ల
పుల్లటి పదార్థాలు తినడం అన్నది అసిడిటీని పెంచడం మాత్రమే కాదు... ఒకవేళ కడుపులో అల్సర్స్ ఉంటే అవి తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి. మీరు నోట్లో నుంచి ఓరల్ ఎండోస్కోపీ చేయించుకుంటే... మీకు అల్సర్ ఉన్నా లేదా ఇతరత్రా ఏమైనా సమస్యలు ఉన్నా తెలుస్తుంది. మీరు మీ లేఖలో మీకు సరిపడని పదార్థాలు తింటే ఈ విధమైన సమస్యలు వస్తున్నాయో, మీకు కలుగుతున్న ఇబ్బంది ఏమిటో నిర్దిష్టంగా చెప్పలేదు. మీరు ముందుగా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు మీకు ఎండోస్కోపీ చేశాక... అల్సర్స్ ఉన్నట్లు నిర్ధారణ అయితే... పాంటాప్రొజోల్ లేదా ఒమెప్రొజోల్ మందులను సూచిస్తారు.
నా వయసు 45 ఏళ్లు. నాకు కొద్ది రోజులుగా కుడి డొక్కలో నొప్పి వస్తోంది. కాసేపటి తర్వాత దానంతట అదే తగ్గుతోంది. ఆ తర్వాత నాకు ఎలాంటి సమస్యా ఉండదు. చాలాకాలం నుంచి ఈ సమస్య ఉంది. కొందరు ఇది తీవ్రమైన సమస్య కావచ్చని అంటుండటంతో ఆందోళనగా ఉంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.
- టి. రవికుమార్, ఒంగోలు
మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు గాల్‌బ్లాడర్‌లో రాయి ఉండే అవకాశం ఉంది. చాలా మందిలో ఈ సమస్య ఉన్నప్పుడు బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ కొంత మందిలో మధ్యమధ్యలో నొప్పి కలగడం ద్వారా ఆ సమస్య బయటపడుతుంది. మీరు అల్ట్రా సౌండ్ అబ్డామిన్ స్కాన్ చేయించుకోవాలి. సీరమ్ అమిలేజ్ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్షల్లో రాయి ఉన్నట్లు నిర్ధారణ అయితే మీరు సర్జన్‌ను సంప్రదించాలి. రాయి పరిమాణాన్ని బట్టి నిపుణులు తగిన శస్త్రచికిత్స మార్గాన్ని సూచిస్తారు.
డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి
కన్సల్టెంట్-ఇంటర్నల్ మెడిసిన్ అండ్ డయాబెటిస్, సెంచరీ హాస్పిటల్, బంజారాహిల్స్, హైదరాబాద్
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్
నా వయసు 30 ఏళ్లు. గృహిణిని. పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. ఇంకా పిల్లలు లేరు. నేను మందులు వాడినప్పుడే నాకు రుతుక్రమం వస్తోంది. లేడీడాక్టర్ కొన్ని పరీక్షలు చేయించారు. నా ఎఫ్‌ఎస్‌హెచ్ పాళ్లు 50 ఇంటర్నేషనల్ యూనిట్స్/ఎమ్‌ఎల్ అన్నారు. దాంతో పాటు ఏఎమ్‌హెచ్ కూడా చాలా తక్కువగా ఉందని చెప్పారు. నా అండాశయ సామర్థ్యం (ఒవేరియన్ కెపాసిటీ) చాలా తక్కువగా ఉందన్నారు. నా భర్త శుక్రకణాల సంఖ్య నార్మల్‌గానే ఉంది. ఇప్పుడు మేము ఏం చేయాలి?
- ధనలక్ష్మి, విశాఖపట్నం
మీ కండిషన్‌ను ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. సాధారణంగా ఇది శాశ్వతమైన సమస్య. అయితే కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా గర్భం రావచ్చు కూడా. ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్‌కు కారణాలూ పెద్దగా తెలియదు. కొన్నిసార్లు క్రోమోజోముల్లోని లోపాలు, తమ వ్యాధి నిరోధక శక్తి తమనే దెబ్బతీసే ఆటో ఇమ్యూన్ సమస్యలు, గాలాక్టోసీమియా వంటివి కారణమవుతాయి. ఈ కండిషన్ ఉన్నవారి కుటుంబాలలో ఇది తరచూ కనిపిస్తుంటుంది.
ఈ సమస్య ఉన్నవారికి ఆటోఇమ్యూన్ పరీక్షలూ, ఫ్రాజైల్ ఎక్స్ క్రోమోజోమ్ పరీక్షలూ, డెక్సాస్కాన్ వంటివి అవసరమవుతాయి. సాధారణంగా ఈ కండిషన్ ఉన్నవారిలో గర్భధారణ అవకాశాలు తక్కువ కాబట్టి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) చేయించుకోవాల్సిందిగా సూచిస్తాం. ఉన్న కొద్దిపాటి అండాలను సేకరించడం కష్టమైతే, అప్పుడు దాతల నుంచి సేకరించి, వాటితో మీ భర్త శుక్రకణాలతో ఫలదీకరణ చేయించి, పిండాన్ని రూపొందించి, దాన్ని మీ గర్భసంచిలోకి ప్రవేశపెడతాం.
ఇలాంటి సమస్య ఉన్నవారు తమ సాధారణ ఆరోగ్యాన్నీ కాపాడుకోవాల్సి ఉంటుంది. మీరు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం (ఫిజికల్ ఫిట్‌నెస్) కోసం రోజూ వ్యాయామం చేయడం, క్యాల్షియమ్, విటమిన్-డి ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం అవసరం. మీకు ప్రిమెచ్యుర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ ఉన్నందుకు మీ డాక్టర్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీని సూచిస్తారు. ఆ హార్మోన్లను సుమారు యాభై, యాభైయొక్కఒక్క ఏళ్లు వరకు వాడాల్సి ఉంటుంది. వేర్వేరు వైద్య విభాగాలకు చెందిన మల్టీడిసిప్లనరీ టీమ్‌తో మీరు సత్ఫలితాలను పొందవచ్చు.
- డాక్టర్ కె. సరోజ
సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్
పులుపు తగ్గిస్తే కానీ అల్సర్ తగ్గదా?
Published Tue, Dec 8 2015 1:55 PM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM
Advertisement
Advertisement