మెడనొప్పి భుజానికీ పాకుతోంది..! | However, lack of parenting four years ... loading tests? | Sakshi
Sakshi News home page

మెడనొప్పి భుజానికీ పాకుతోంది..!

Published Wed, Aug 12 2015 1:49 PM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

మెడనొప్పి భుజానికీ పాకుతోంది..!

మెడనొప్పి భుజానికీ పాకుతోంది..!

గైనకోమాజియా కౌన్సెలింగ్
 

 గాటు లేకుండా  గైనకోమాజియా చికిత్స సాధ్యమా?
 నా వయసు 23. నాకు మహిళల్లో ఉన్నట్లుగా రొమ్ములు పెద్దవిగా కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే చిన్న సర్జరీ ద్వారా ఈ పరిస్థితిని సరిచేయవచ్చని చెప్పారు. సర్జరీ తర్వాత గాటు కనిపిస్తుంది కదా అంటే అది చాలా చిన్న గాటు అని చెప్పారు. ఎలాగూ రొమ్ములు పెద్దగా ఉన్నందున మొదట షర్ట్ విప్పలేని పరిస్థితి. అలాగే ఇప్పుడు శస్త్రచికిత్స చేయించుకున్నా గాటు వల్ల షర్ట్ విప్పలేను కదా అనిపిస్తోంది. నా సమస్యకు ఏదైనా పరిష్కారం ఉందా?
 - వినోద్, జనగామ

కొందరు యువకుల్లో మహిళల్లాగా పెద్ద పెద్ద రొమ్ములు రావడం వారిని న్యూనతకు గురిచేస్తుంటుంది. దీంతో వారు మానసిక సమస్యలు లేదా డిప్రెషన్ బారిన పడుతుంటారు. స్నేహితులతో కలవలేరు. యువకుల్లో రొమ్ములు పెరిగే ఈ సమస్యను గైనకోమాజియా అంటారు. ఈ కండిషన్ ఎందుకు వస్తుందనే విషయంపై అంతగా అవగాహన లేదు. అయితే మూత్రం ఎక్కువగా పోవడానికి వాడే డైయూరెటిక్స్ మందుల వాడకం వల్ల, అతిగా మద్యం తాగే కొందరిలో ఇలా రొమ్ములు పెద్దవిగా మారతాయి. మరికొందరిలో హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. స్థూలకాయుల్లోనే కాకుండా బాగా సన్నగా ఉన్నవారిలోనూ కొందరిలో ఈ సమస్య రావచ్చు. అయితే దీన్ని చక్కదిద్దడానికి చాలా మార్గాలు (టెక్నిక్స్) అందుబాటులో ఉన్నాయి.

 మీరు చెప్పినట్లుగా మామూలు చర్మం, నిపుల్ వద్ద రంగు మారే చర్మం వద్ద చిన్న గాటు పెట్టి అదనపు కొవ్వును తీసేసి, మళ్లీ కుట్టడం ఒక టెక్నిక్. దీనివల్ల సాధారణ చర్మం, రంగుమారే చర్మం జంక్షన్‌లో (ఏరియోలా అంచున) గాటు పెడతారు. కాబట్టి అది అంత ప్రస్ఫుటంగా కనిపించదు. అయితే ఈ చిన్నపాటి గాటు కూడా కనిపించడానికి ఇష్టపడని వారు కూడా ఉంటారు. అందుకే ఈ సమస్యను అధిగమించేందుకు మరో టెక్నిక్ కూడా అభివృద్ధి చేశారు. ఈ టెక్నిక్‌లో నిపుల్, దాని చుట్టూ ఉండే రంగు మారేచోట ఉండే గ్రంధితో పాటు, మిగతా భాగంలో ఉండే కొవ్వు... ఈ రెండింటినీ తొలగిస్తారు. అంటే ఒకరకంగా చూస్తే ఇది లైపోసక్షన్, సర్జరీ... ఈ రెండూ కలిసిన ప్రక్రియ అన్నమాట. లైపోసక్షన్ ద్వారా రొమ్ము ప్రాంతంలోని కొవ్వును తొలగించడాన్ని చంకలోంచి చేస్తారు. ఈ గాటు చంకలో ఉంటుంది కాబట్టి బయటకు కనిపించదు. అలాగే రొమ్ము ఉబ్బుగా కనిపించేలా చేసే గ్రంథిని సరిగ్గా రొమ్ము మధ్యన గాటు పెట్టి తీస్తారు. ఈ సరికొత్త టెక్నిక్ వల్ల అసలు సర్జరీ చేసిన గుర్తు గానీ, లైపోసక్షన్ చేసిన గాటుగానీ కనిపించవు. కాబట్టి యువత అభిరుచి మేరకు వారికి నచ్చేలా ఈ టెక్నిక్ ఉంటుంది.
 
జనరల్ కౌన్సెలింగ్
 
నిద్రలో పిక్కలు పట్టేస్తున్నాయి..!
 రాత్రివేళ్లల్లో నా పిక్కలు పట్టుకుపోతున్నాయి. దాంతో నిద్రాభంగమై మధ్యలోనే నిద్రలేస్తున్నాను. ఎంత బాధగా ఉంటుందో వర్ణించలేను. చాలాసేపు కుంటుతూ నడిచాక కాస్త చక్కబడుతుంది. మళ్లీ నిద్ర కోసం పక్కమీదికి ఒరగగానే మళ్లీ పిక్కలు పట్టుకుబోతాయి. దాంతో గంటలు గంటలు నిద్రలేక బాధపడుతున్నాను. ఈ మజిల్‌క్రాంప్స్ తగ్గడానికి తగిన సలహా ఇవ్వండి.
 - టి. వెంకటేశ్వర్లు, నర్సంపేట

మీలా కండరాలు పట్టేసి చాలా బాధపడే లక్షణాలు కనిపించేవారిలో అందుకు కారణాలు చాలా ఉంటాయి. ఒకవేళ మీరు డయాబెటిస్ అయి మీలో చక్కెరపాళ్లను నియంత్రణలో ఉంచుకోకపోయినా ఇలా జరగవచ్చు. ఇక సాధారణంగా మన శరీరంలో ద్రవాలు తగ్గి, తద్వారా పొటాషియమ్ లోపించడం వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. ఒక్కోసారి విటమిన్ బి12 లోపం వల్లగానీ లేదా థైరాయిడ్ సమస్య వల్లగానీ ఇవే లక్షణాలు కనిపించవచ్చు. మీ సమస్యకు అసలు కారణం ఏమిటో తెలుసుకోవడం ముందుగా జరగాల్సిన పని. ఆ కారణాన్ని బట్టి చికిత్స చేస్తే మీ సమస్య నయమవుతుంది.
 
నా వయసు 40. రాత్రివేళల్లో నిద్రపట్టదు. చాలా కష్టమ్మీద ఉదయం వేళలో కాస్త నిద్రపడుతుంది. ఇలా సూర్యోదయానికి ముందు నిద్రపట్టడం వల్ల ఉదయం పది, పదకొండు గంటల వరకు నిద్రపోతున్నాను. దాంతో నా పనులు చాలా చెడిపోతున్నాయి. ఒక డాక్టర్‌గారిని కలిసి నా సమస్య వివరిస్తే కొన్ని నిద్రమాత్రలు ఇచ్చారు. అవి వేరే సందర్భంలో మరో డాక్టర్ గారికి చూపిస్తే, ఆయన వాటిని చూసి, అవి ఫిట్స్ రోగులకు ఇస్తారని, వాటిని వాడవద్దని సూచించారు. దాంతో నేను అయోమయంలో పడిపోయాను. నేనిప్పుడు ఆ మాత్రలు వాడాలా, వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాను. ఈ విషయంలో నేను ఏ నిపుణుడిని కలవాలో తగిన సలహా ఇవ్వండి.
 - సుకుమార్, నిజామాబాద్

మీరు రాసిన లేఖలో మీరు వాడుతున్న టాబ్లెట్ల పేరు రాయలేదు. నిద్ర కోసం ప్రిస్క్రయిబ్ చేసే మందుల్లో కొన్నింటిని తలనొప్పి కోసం లేదా ఫిట్స్ కోసం కూడా ఉపయోగిస్తుంటారు. మీకు రాసిన మందులు మీరు ఉపయోగించవచ్చో లేదో తెలుసుకోడానికి ఒకసారి మీకు దగ్గర్లోని ఫిజీషియన్‌ను సంప్రదించండి. ఈరోజుల్లో నిద్రలేమి సమస్యను చక్కదిద్దడానికి సురక్షితమైన చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడటం వల్ల అవి అలవాటు కావు, వాటి మీదే ఆధారపడాల్సిన పరిస్థితి కూడా రాదు. అయితే మీ వ్యాధిచరిత్ర, మీ లక్షణాలు, ఇతరత్రా అంశాలు పరిశీలించాక మీకు తగిన మందులు వాడాల్సి ఉంటుంది. కాబట్టి మీకు దగ్గర్లోని ఫిజీషియన్‌ను కలిసి మీకు తగిన మందులు రాయించుకోండి.
 
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్

 
మెడనొప్పి భుజానికీ పాకుతోంది..!

 నా వయసు 27. నేను ఒక సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌ను. చాలా ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయాల్సి ఉంటుంది. గత రెండువారాలుగా నాకు మెడ నొప్పి చాలా తీవ్రంగా వస్తోంది. అది మెడ నుంచి కుడి భుజంలోకి పాకుతోంది. డాక్టర్‌గారిని కలిస్తే వెన్నుపూసల్లోని డిస్క్ వాపు వచ్చిందనీ, సర్జరీ అవసరం అని చెప్పారు. నాకు సర్జరీ అంటే భయం. శస్త్రచికిత్సకు బదులుగా ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.
 - ప్రసేన్, హైదరాబాద్

మీలా చాలా సేపు కూర్చొని పనిచేసే వారిలో ఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అదేపనిగా గంటలకొద్దీ అనుసరణీయం కాని భంగిమల్లో కూర్చొని పనిచేసేవారిలో వెన్నుపూసల్లోని డిస్క్‌లు బలహీనపడతాయి. ఒక్కోసారి వాటిలో వాపు కూడా రావచ్చు. దీని వల్ల కొద్ది నెలల తర్వాత తీవ్రమైన నొప్పి వస్తుంది. అయితే మంచి ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో తగిన వ్యాయామాలు చేయడం వల్ల, వెన్నెముకకు అనువైన, తగిన భంగిమలో కూర్చోవడం వల్ల పరిస్థితి మెరుగుపడి కొద్దిరోజుల్లోనే పరిస్థితి మెరుగుపడుతుంది. ఇలాంటివారు తాము కూర్చొని పనిచేసే సమయంలో ప్రతి రెండు గంటలకు లేదా మూడు గంటలకు ఒకసారి లేచి తమ మెడను కాస్త అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మీరు కూడా అటు ఇటు తిరుగుతూ ఉండాలి.ఇక సర్జరీ విషయానికి వస్తే ఇలాంటి కేసుల్లో శస్త్రచికిత్స చాలా అరుదుగా అవసరమవుతుంది. నొప్పి భరించలేనంత ఉండి ఆర్నెల్ల తర్వాత ఏదైనా శరీరభాగం స్పర్శ కోల్పోవడం లేదా కేవలం రెండు శాతం కంటే తక్కువ మందికే శస్త్రచికిత్స అవసరం పడుతుంది. కాబట్టి మీరు అప్పుడే శస్త్రచికిత్స గురించి ఆలోచించకండి.
 తొలుత మీరు మంచి ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి మీ మెడ నొప్పి తగ్గడానికి అవసరమైన వ్యాయామాల గురించి తెలుసుకొని, వాటిని చేయండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన ప్రత్యామ్నాయం గురించి ఆలోచించవచ్చు.
 
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్

 
నాలుగేళ్లుగా సంతానలేమి... పరీక్షలేమైనా చేయించాలా?
 నా వయసు 30. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. గత నాలుగేళ్లుగా మేం గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నాం. అయినా ఫలితం లేదు. మేము ఏదైనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకని నాకు ఇంకా గర్భం రావడం లేదు? దయచేసి వివరించండి.
 - సుశాంతి, హైదరాబాద్

మీ విషయంలో ఒకసారి మీరూ, మీతో పాటు మీ భర్త కూడా కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నా గర్భం ఎందుకు రావడం లేదనే కారణం తెలుసుకోవడం కోసం కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. సంతానలేమికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒవ్యూలేటరీ డిజార్డర్స్, వీర్యకణాలను తీసుకెళ్లే ట్యూబుల్లో లోపాలు... ఇలా అనేక సమస్యల వల్ల సంతానలేమి కలగవచ్చు. ఒక్కోసారి పరీక్షల్లో అంతా సవ్యంగానే ఉన్నా సంతానం కలగకపోవచ్చు. అప్పుడు కారణాలేమిటో కూడా తెలియదు. దీన్నే ‘అన్‌ఎక్స్‌ప్లెయిన్‌డ్ ఇన్‌ఫెర్టిలిటీ’ అంటారు. ఇక సంతానలేమితో బాధపడే దంపతుల్లోని 40 శాతం కేసుల్లో ఇద్దరిలోనూ లోపాలు ఉండవచ్చు. కాబట్టి లోపం ఎక్కడుందో తెలుసుకోడానికి మీరిద్దరూ ఒకసారి కొన్ని పరీక్షలు చేయించుకోవడం అవసరం.
 
నా వయసు 40. నా భార్య వయసు 35. మాకు ఇద్దరు పిల్లలు. ఒకసారి ఈతకు వెళ్లి ఇద్దరూ నీళ్లలో మునిగి చనిపోయారు. రెండో సంతానం తర్వాత  పిల్లలు పుట్టకుండా నా భార్య లాపరోస్కోపిక్ ప్రక్రియ ద్వారా ట్యూబెక్టమీ చేయించుకుంది. ఇప్పుడు మాకు పిల్లలు కావాలని ఉంది. మాకు సంతానం కలిగే అవకాశం ఉందా?
 - ఒక సోదరుడు, కర్నూలు

మొదట మీరిద్దరూ కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. మీ వీర్యపరీక్ష కూడా అవసరమవుతుంది. ఇది చాలా సులభమైన పరీక్ష. ఇక మీ భార్య విషయానికి వస్తే ఆమె అండాల వద్దకు వీర్యకణాలను తీసుకెళ్లే ట్యూబ్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలించాలి. అవసరమైతే ట్యూబల్ కన్‌స్ట్రక్షన్ అనే శస్త్రచికిత్స చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ శస్త్రచికిత్స విజయవంతమై, ఆమెలో అండం ఉత్పత్తి సరిగా ఉంటే స్వాభావిక పద్ధతిలోనే మీరు సంతానం పొందే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ మీ భార్య విషయంలో ట్యూబల్ సర్జరీ విజయవంతం కాకపోయినా లేదా అండం విడుదల సరిగా లేకపోయినా లేదా మీ వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నా ఐవీఎఫ్ (ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్) అనే ప్రక్రియను ఆలోచించవచ్చు. ఈరోజుల్లో సంతానలేమికి మంచి చికిత్సలే అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకసారి ఫెర్టిలిటీ నిపుణులను కలవండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement