lack of parenting
-
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..
రమేష్– రాగిణి పెద్ద కంపెనీలో ఉద్యోగం. దండిగా వేతనం. సొంత ఫ్లాటు. పెళ్లయి నాలుగేళ్లవుతోంది. కానీ కడుపు పంట కలగానే మిగిలింది. ఇరు కుటుంబాల నుంచి ఎంతో నిరీక్షణ. ఇక లాభం లేదని వైద్యనిపుణులను కలిస్తే... సమస్యను గుర్తించి చికిత్స ప్రారంభించారు. కానీ దంపతులు ఆశించిన ఫలితం కనపడడం లేదు. నగరంలో ఈ తరహా దంపతులకు కొదవ లేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని మాదిరిగా జీవితంలో సకల సౌకర్యాలూ సమకూరినా అమ్మా నాన్నా అనే పిలుపునకు నోచుకోలేని దంపతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బొమ్మనహళ్లి: బతుకు పోరాటంలో అలసిపోతున్న నగరవాసులు సంతానలేమికి దూరమవుతున్నారు. ఒత్తిడితో కూడిన జీవనం దంపతుల్లో వంధ్యత్వానికి దారి తీస్తోంది. దశాబ్దం కిందటి వరకు నగర దంపతుల్లో పది శాతం మంది సంతానలేమితో బాధ పడేవారు. ఇప్పుడది 15 శాతానికి పెరిగింది. దీనికి కారణాలను విశ్లేషిస్తే, పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్, పెరుగుతున్న పని గంటలతో పాటు దంపతులు ఎదుర్కొంటున్న పలురకాల ఇబ్బందులని తేలింది. దీనికి తోడు దంపతుల ఆకాంక్షలు కూడా వారిని సంతాన ప్రాప్తికి దూరం చేస్తున్నాయి. సంతానానికి ముందే జీవితంలో బాగా స్థిరపడాలనేది నేటి యువ జంటల సంకల్పం. అయితే 30 సంవత్సరాలు దాటితే సంతాన యోగానికి క్రమంగా దూరమవుతామని వారు గ్రహించలేక పోతున్నారు. జీవనశైలి జబ్బులతో తంటా జీవనశైలిలో వస్తున్న మార్పులు కూడా దంపతులకు ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతున్నాయి. మధుమేహం, రక్తపోటు, స్థూలకాయం లాంటివి సంతానలేమికి సర్వ సాధారణ కారణాలని ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ కామినీరావు తెలిపారు. గత దశాబ్దంలో సంతానలేమి కేసులు 50 శాతం దాకా పెరగడం కాస్త ఆందోళన కలిగించే విషయమేనని ఆమె పేర్కొన్నారు. సంతానలేమితో వారానికి 25 నుంచి 30 కొత్త కేసులు తన వద్దకే వస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతా ల్లో సంతాన లేమికి చికిత్సకు స్త్రీలను మాత్రమే పంపిస్తున్నారని, అయితే నగరాల్లో దంపతు లిద్దరూ సంతానలేమికి కారణాలను కనుక్కోవాల్సిన ప్రాముఖ్యతను గుర్తించారని తెలిపారు. సామర్థ్యలేమి, ప్లాస్టిక్ బెడద భౌతిక సామర్థ్యం లోపించడం, అనాసక్తి లాంటి అంశాలు కూడా సంతాన లేమికి దోహదపడుతున్నాయని ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ షఫాలికా తెలిపారు. ఫ్రిడ్జిలలో దాచి ఉంచిన, ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు కూడా కారణమవుతున్నాయని చెప్పారు. హార్మోన్లను విచ్ఛిన్నం చేసే ప్లాస్టిక్ సామాగ్రిని మితిమీరి వినియోగించడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. దీనికి తోడు ట్రాఫిక్ రద్దీ కారణంగా గంటల తరబడి రోడ్ల మీద ఉండడం వల్ల కాలుష్యం కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని ఆమె విశ్లేషించారు. ఆశలు, ఆశయాలు కూడా కారణమే ⇔ తమ ఆశయాలు, ఆకాంక్షల వల్ల కొత్త దంపతులు ఇప్పుడే పిల్లలు వద్దని వాయిదా వేసుకుంటున్నారని, కొంతమందైతే ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారని మరో వైద్యురాలు డాక్టర్ చిత్రా రామమూర్తి చెప్పారు. సంతానలేమికి ఇవన్నీ కారణాలవుతున్నాయని చెప్పారు. ⇔ పురుషులు, స్త్రీలలో వంధ్యత్వం అనేది ప్రధాన సమస్యగా మారిందని తెలిపారు. ⇔ గతంలో 20–30 ఏళ్ల వయసున్న దంపతులు సంతానలేమితో చికిత్స కోసం వచ్చే వారని, ఇప్పుడు వస్తున్న వారంతా 35–40 ఏళ్ల వయసున్న వారని వివరించారు. ⇔ గతంలో సంతాన లేమికి ప్రధానంగా మహిళల్లోనే లోపాలున్నాయని అనుకునే వారని, ఇప్పుడు పురుషులు కూడా పరీక్షలు చేయించుకుంటున్నారని చెప్పారు. ⇔ గత దశాబ్దంలో వంధ్యత్వం 50 శాతం దాకా పెరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. ⇔ సంతానలేమికి 40 శాతం చొప్పున స్త్రీ, పురుషులిద్దరూ కారకులు కావచ్చని, పది శాతం కేసుల్లో ఉభయుల్లోనూ లోపాలుంటాయని, పది శాతం కేసుల్లో కారణాలు తెలియడం లేదన్నారు. బహుశా దీనికి జీవన శైలిలో మార్పులు, చేర్పులు కారణమై ఉండవచ్చన్నారు. ⇔ మద్యం, ధూమపానం లాంటి దురలవాట్ల వల్ల రెండు నుంచి మూడు శాతం మంది సంతానానికి దూరమవుతున్నారని ఆమె చెప్పారు. మంచి అలవాట్లు, మంచి ఆహారం ⇔ ఇవి రెండూ ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజా పండ్లు కూరగాయలను పుష్కలంగా తీసుకోవాలి. ⇔ కనీసం వారానికి అయిదు రోజులు చొప్పున, రోజుకు 40 నిముషాల పాటు వాకింగ్, జాగింగ్ వంటి కసరత్తులు చేయాలి. ⇔ మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించుకోవాలి. రోజుకు 20 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. ⇔ జంక్‌ఫుడ్, ప్రాసెస్డ్ ప్రత్యేక ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ⇔ ప్లాస్టిక్‌కు హార్మోన్లను దెబ్బతీసే స్వభావం ఉన్నందున, వాటిల్లో ఆహార పదార్థాలను నిల్వ ఉంచరాదు. ⇔ వీలైనంత వరకు ప్రయాణ సమయాన్ని తగ్గించుకోవాలి. కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్త వహించాలి. ⇔ నిర్లిప్తతతో కూడిన జీవనశైలిని వదిలేసి చురుకుగా ఉండాలి. -
‘అవా’తో అమ్మతనం!
సంతానలేమితో బాధపడుతున్న వారికో శుభవార్త. పండంటి బిడ్డను జన్మనివ్వాలన్న వారి ఆకాంక్ష నెరవేర్చేందుకు ఓ హైటెక్ పరికరం అందుబాటులోకి వచ్చింది. మహిళలు చేతికి తొడుక్కునే వీలుండే ఈ పరికరం నెలసరిలో గర్భం దాల్చేందుకు ఎక్కువ అవకాశాలున్న ఐదు రోజులను గుర్తించి ఆ సమాచారాన్ని అందిస్తుంది. భార్యాభర్తల్లో వైద్యపరమైన సమస్యలేవీ లేకున్నా చాలా మందికి సంతానం కలగకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి వారికోసం ‘అవా’ అనే కంపెనీ ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది. రాత్రి సమయంలో దీన్ని ధరించి పడుకుంటే చాలు. గుండె కొట్టుకునే వేగం, శరీర ఉష్ణోగ్రత, శ్వాసక్రియ రేటు వంటి అంశాలను గుర్తించి మహిళల్లో అండాలు విడుదలయ్యే సమయాన్ని లెక్కిస్తుంది. ఈస్ట్రాడయోల్, ప్రొజెస్టిరాన్ హర్మోన్ల మోతాదు పెరిగినపుడు వచ్చే సూచనలను గుర్తిస్తుంది. సరైన సమయాన్ని గుర్తించడంలో ఈ పరికరం 89 శాతం విజయవంతమైందని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలో అందుబాటులో ఉన్న ‘అవా బ్రేస్లెట్’ ఖరీదు దాదాపు రూ.14 వేలు! -
దేశంలో సంతానలేమి సమస్య తీవ్రం
బంజారాహిల్స్: దేశంలో సంతానలేమి సమస్య తీవ్రంగా ఉందని, స్టెమ్‌సెల్ పద్ధతి ద్వారా దీనికి పరిష్కారం సాధ్యమవుతుందని, ఈదిశగా సైన్స్ గణనీయ పురోగతి సాధిస్తోందని ముంబయికి చెందని ప్రముఖ సంతాన సాఫల్య నిపుణురాలు డాక్టర్ ఫిరుజాపారిఖ్ అన్నారు. ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ (ఫిక్కి ఫ్లో) ఆధ్వర్యంలో శనివారం బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో ‘గిఫ్ట్ ఆఫ్ లైఫ్’ పేరుతో నిర్వహించిన పరిచయ వేదికలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ దేశంలో సంతానలేమి సమస్యగా మారిందని, కనీసం 10శాతం మంది దంపతులు సంతానలేమితో బాధపడుతున్నారన్నారు. యూరప్ దేశాల్లో ప్రభుత్వాలు ఉచితంగా ఐవీఎఫ్ చికిత్సలు అందిస్తున్నాయని, మనదేశంలో కూడా ప్రభుత్వాలు ఈదిశగా ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో రోబోటిక్ సర్జన్, గైనకాలజిస్ట్ డాక్టర్ రోమాసిన్హా, ఎఫ్ఎల్వో చైర్పర్సన్ పద్మారాజగోపాల్ పాల్గొన్నారు. సవితాదాటే మీనన్ కార్యక్రమం అనుసంధానకర్తగా వ్యవహరించారు. -
మీటింగ్స్‌లోనూ నిద్రపోతున్నారా?
హోమియో కౌన్సెలింగ్ నాకు 28 ఏళ్లు. మా వారికి 34 ఏళ్లు. మా పెళ్లయి నాలుగేళ్లయింది. ఇంతవ రకూ సంతానం కలగలేదు. మాకెంతో నిరాశగా ఉంది. సంతాన లేమికి హోమియోలో మందులు ఏమైనా ఉంటే సూచించగలరు. - హైమ, ఆదోని సంతానలేమి సమస్య స్త్రీ పురుషులిరువురిలోనూ 30 శాతం వరకు కొద్దిపాటి లోపాల వల్ల ఏర్పడుతుంది. మగవారిలో సంతానలేమికి కారణాలు శుక్రకణాలు లేకపోవడం లేదా శుక్రకణాల ఉత్పత్తి జరగకపోవడం, శుక్రకణాలు ఉత్పత్తి అయినప్పుడు వాటి కదలికలు సాధారణంగా లేకపోవడం, శుక్రకణాల నిర్మాణంలో తేడాలు, హైడ్రోసీల్ లేదా వెరికోసీల్ వల్ల శుక్రకణాలు దెబ్బతిని సంతానలేమికి కారణం కావచ్చు. స్త్రీలలో సంతానలేమికి కారణాలు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, గర్భసంచీ చిన్నగా ఉండటం, అసలు గర్భసంచి లేకపోవడం, గర్భసంచి రెండు గదులుగా ఉండటం, ఫెలోపియన్ ట్యూబ్స్ లేకపోవడం లేదా ట్యూబ్స్ మూసుకుపోవడం, అండాశయంలో ఎదుగుదల లేకపోవడం, యోనిమార్గం చిన్నదిగా ఉండటం లేదా మూసుకుపోవడం, వీటితోపాటు థైరాయిడ్ సమస్యలు, పి.సి.ఒ.డి, ఎఫ్.ఎస్.హెచ్, ఎల్.హెచ్, ప్రొలాక్టిన్ హార్మోన్ల అసమతుల్యత, రుతుక్రమంలో అపసవ్యతలు, ఎండోమెట్రియాసిస్, గర్భసంచిలో కణుతులు ఏర్పడి ఫెలోపియన్ ట్యూబ్స్‌కు అడ్డుపడటం వల్ల సంతానలేమి ఏర్పడుతుంది. నిర్ధారణ: మగవారిలో: సీబీపీ, ఇ.ఎస్.ఆర్, సీయూఈ, ఎఫ్.ఎస్.హెచ్, ఎల్.హెచ్, థైరాయిడ్ ప్రొఫైల్, యూ.ఎస్.ఎస్. అబ్డామిన్, యూ.ఎస్.జి. స్క్రోటమ్, కంప్లీట్ సెమెన్ ఎనాలిసిస్, సీరమ్ టెస్టోస్టీరాన్, థైరాయిడ్ ప్రొఫైల్, ఎఫ్.ఎస్.హెచ్, ఎల్. టెస్టిక్యూలార్ బయాప్సీ. ఆడవారిలో: సీబీపీ, ఇ.ఎస్.ఆర్, సీయూఈ, హెచ్.ఎస్.జి, లాప్రోస్కోపీ, థైరాయిడ్ ప్రొఫైల్, సీరం ప్రోలాక్టిన్, ఫాలిక్యులార్ స్టడీ హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యం: సంతానలేమికి హోమియోపతిలో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా స్త్రీ పురుషులలో లోపాలను సరిచేస్తూ శాశ్వత పరిష్కారం అందించటమే కాకుండా రెండవ మూడవ సంతానానికి మార్గం సుగమం చేస్తుంది. వైద్యవిధానం ద్వారా 50-60 శాతం వరకు సత్ఫలితాలను అందుకోవచ్చు. న్యూరో కౌన్సెలింగ్ నా భర్త వయసు 50. ఇటీవల ఆయనకు మెదడులో కణితి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అది పరిమాణంలో చాలా పెద్దగా ఉండి, అత్యంత సున్నితమైన భాగంలో ఉందని డాక్టర్ చెప్పారు. న్యూరోనావిగేషన్ విధానంలో శస్త్రచికిత్స చేయాలని అంటున్నారు. న్యూరోనావిగేషన్ అంటే ఏమిటి? ఆపరేషన్ అంటే మాకు చాలా ఆందోళనగా ఉంది. మీరిచ్చే సలహాపైనే మా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. - ప్రభావతి, నిజామాబాద్ మీరు తెలిపిన వివరాలను బట్టి మీ భర్తకు అత్యంత కీలకమైన భాగంలో పెద్ద కణితి ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూరోనావిగేషన్ ద్వారా శస్త్రచికిత్స చేయడం రోగికి ఎంతో ఊపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల రోగికి భవిష్యత్తులో ఎదురయ్యే దుష్ర్పభావాలు తగ్గుతాయి. మెదడులోని భాగాలను 3-డీ ఇమేజ్‌లో చూస్తే సరిగ్గా కణితి ఎక్కడ ఉందో నిర్ధారణ చేసుకొని, అక్కడికి మాత్రమే చేరేందుకు అధునాతనమైన ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. మీ భర్తకు మెదడులోని అత్యంత సున్నితమైన భాగంలో, పెద్ద పరిమాణంలో కణితి ఉన్నందున ఈ ప్రక్రియ ద్వారా శస్త్రచికిత్స చేయడమే ఉత్తమం. ఈ విధానంలో మిగతా మెదడు భాగాలు దెబ్బతినకుండా శస్త్రచికిత్స చేయడానికి వీలువుతుంది. తక్కువ కోతతో శస్త్రచికిత్స చేయడం వల్ల నొప్పి కూడా తక్కువగా ఉండటంతో పాటు, రోగి కోలుకునే వ్యవధి కూడా తక్కువ. బ్రెయిన్ ఆపరేషన్స్ చేసే సమయంలో వైద్యులు శస్త్రచికిత్స వల్ల ఎదురయ్యే రిస్క్‌లను అంచనావేసి, రోగి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. అలాంటప్పుడు అత్యంత సున్నితమైన భాగాల్లో శస్త్ర చికిత్స చేసే సమయంలో రోగి సురక్షితంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. న్యూరోనావిగేషన్ ప్రక్రియ వల్ల మెదడు లోపలి భాగాలను స్పష్టంగా చూడటం సాధ్యమవుతుంది. కాబట్టి క్లిష్టమైన ప్రాంతాలకు సర్జన్ తేలిగ్గా చేరేందుకు అవకాశం ఉండటం వల్ల న్యూరో నావిగేషన్ విధానంలో సర్జరీ అంటే మీరు గానీ, మీ భర్తగానీ అందోళన పడాల్సిన అవసరం లేదు. పైగా న్యూరోనావిగేషన్ ప్రక్రియను అనుసరించడం వల్ల కలిగే ఫలితాలు మరింత మెరుగ్గానూ ఉంటాయి. స్లీప్ కౌన్సెలింగ్ నా వయసు 35. సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నా నిద్రపై నాకు ఎలాంటి నియంత్రణా ఉండటం లేదు. మీటింగ్స్‌లో ఉంటున్నప్పుడూ, తింటున్నప్పుడు కూడా నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతున్నాను. దీనివల్ల నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం చూపండి. - నవీన్, హైదరాబాద్ మీరు చెబుతున్న దాన్ని బట్టి మీరు నార్కొలెప్సీ అనే నిద్ర సంబంధమైన రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నార్కొలెప్సీ అనే సమస్యలో నిద్ర, మెలకువ రావడం... ఈ రెండూ ప్రభావితమవుతాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు పగటివేళ కూడా నిద్రలోకి జారిపోతుంటారు. ఏ పని చేస్తున్నా ఆ సమయంలో తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. సాధారణంగా నిద్రలో దశలు కొన్ని సైకిల్స్‌లో నడుస్తుంటాయి. అంటే ప్రారంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కదిలే దశ... ఇలాగ. కనుపాపలు వేగంగా కదిలే దశను ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఆర్ఈఎమ్ నిద్ర దశ వేగంగా వచ్చేస్తుంది. ఈ ఆర్ఈఎమ్ దశలోనే మనకు కలలు వస్తుంటాయి. ఈ దశలో కనుపాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలు పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి. నార్కొలెప్సీ సాధారణంగా 15 నుంచి 25 ఏళ్ల వయసులో మొదలవుతుంది. అయితే అది ఏ వయసువారిలోనైనా కనిపించే అవకాశం ఉంది. నార్కొలెప్సీ ఎందుకు వస్తుందనే అంశం ఇంకా తెలియదు. ఇది జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి పిల్లల్లో ఇది కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. మరికొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నదాని ప్రకారం మెదడులోని హైపోక్రెటిన్ అనే రసాయన లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో ఆర్ఈఎమ్ దశకు సంబంధించిన సైకిల్‌ను కొనసాగించే మెదడులోపాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ లోపాల వల్లనే మెలకువగా ఉండగానే అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే లక్షణాలు కనిపిస్తాయని వారి పరిశోధనల్లో తేలింది. అయితే నాడీవ్యవస్థకు చెందిన ఒకటి కంటే ఎక్కువ అంశాలు నార్కొలెప్సీని కలగజేస్తాయని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిపోతాయి. మాటకూడా ముద్దముద్దగా వస్తుంది. బాధితులు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. దీనికి పూర్తిగా చికిత్స లేకపోయినా కొన్ని యాంటీ డిప్రసెంట్స్, యాంఫిటమైన్ మందులతో చికిత్స చేయవచ్చు. -
మెడనొప్పి భుజానికీ పాకుతోంది..!
గైనకోమాజియా కౌన్సెలింగ్ గాటు లేకుండా గైనకోమాజియా చికిత్స సాధ్యమా? నా వయసు 23. నాకు మహిళల్లో ఉన్నట్లుగా రొమ్ములు పెద్దవిగా కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే చిన్న సర్జరీ ద్వారా ఈ పరిస్థితిని సరిచేయవచ్చని చెప్పారు. సర్జరీ తర్వాత గాటు కనిపిస్తుంది కదా అంటే అది చాలా చిన్న గాటు అని చెప్పారు. ఎలాగూ రొమ్ములు పెద్దగా ఉన్నందున మొదట షర్ట్ విప్పలేని పరిస్థితి. అలాగే ఇప్పుడు శస్త్రచికిత్స చేయించుకున్నా గాటు వల్ల షర్ట్ విప్పలేను కదా అనిపిస్తోంది. నా సమస్యకు ఏదైనా పరిష్కారం ఉందా? - వినోద్, జనగామ కొందరు యువకుల్లో మహిళల్లాగా పెద్ద పెద్ద రొమ్ములు రావడం వారిని న్యూనతకు గురిచేస్తుంటుంది. దీంతో వారు మానసిక సమస్యలు లేదా డిప్రెషన్ బారిన పడుతుంటారు. స్నేహితులతో కలవలేరు. యువకుల్లో రొమ్ములు పెరిగే ఈ సమస్యను గైనకోమాజియా అంటారు. ఈ కండిషన్ ఎందుకు వస్తుందనే విషయంపై అంతగా అవగాహన లేదు. అయితే మూత్రం ఎక్కువగా పోవడానికి వాడే డైయూరెటిక్స్ మందుల వాడకం వల్ల, అతిగా మద్యం తాగే కొందరిలో ఇలా రొమ్ములు పెద్దవిగా మారతాయి. మరికొందరిలో హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. స్థూలకాయుల్లోనే కాకుండా బాగా సన్నగా ఉన్నవారిలోనూ కొందరిలో ఈ సమస్య రావచ్చు. అయితే దీన్ని చక్కదిద్దడానికి చాలా మార్గాలు (టెక్నిక్స్) అందుబాటులో ఉన్నాయి. మీరు చెప్పినట్లుగా మామూలు చర్మం, నిపుల్ వద్ద రంగు మారే చర్మం వద్ద చిన్న గాటు పెట్టి అదనపు కొవ్వును తీసేసి, మళ్లీ కుట్టడం ఒక టెక్నిక్. దీనివల్ల సాధారణ చర్మం, రంగుమారే చర్మం జంక్షన్లో (ఏరియోలా అంచున) గాటు పెడతారు. కాబట్టి అది అంత ప్రస్ఫుటంగా కనిపించదు. అయితే ఈ చిన్నపాటి గాటు కూడా కనిపించడానికి ఇష్టపడని వారు కూడా ఉంటారు. అందుకే ఈ సమస్యను అధిగమించేందుకు మరో టెక్నిక్ కూడా అభివృద్ధి చేశారు. ఈ టెక్నిక్‌లో నిపుల్, దాని చుట్టూ ఉండే రంగు మారేచోట ఉండే గ్రంధితో పాటు, మిగతా భాగంలో ఉండే కొవ్వు... ఈ రెండింటినీ తొలగిస్తారు. అంటే ఒకరకంగా చూస్తే ఇది లైపోసక్షన్, సర్జరీ... ఈ రెండూ కలిసిన ప్రక్రియ అన్నమాట. లైపోసక్షన్ ద్వారా రొమ్ము ప్రాంతంలోని కొవ్వును తొలగించడాన్ని చంకలోంచి చేస్తారు. ఈ గాటు చంకలో ఉంటుంది కాబట్టి బయటకు కనిపించదు. అలాగే రొమ్ము ఉబ్బుగా కనిపించేలా చేసే గ్రంథిని సరిగ్గా రొమ్ము మధ్యన గాటు పెట్టి తీస్తారు. ఈ సరికొత్త టెక్నిక్ వల్ల అసలు సర్జరీ చేసిన గుర్తు గానీ, లైపోసక్షన్ చేసిన గాటుగానీ కనిపించవు. కాబట్టి యువత అభిరుచి మేరకు వారికి నచ్చేలా ఈ టెక్నిక్ ఉంటుంది. జనరల్ కౌన్సెలింగ్ నిద్రలో పిక్కలు పట్టేస్తున్నాయి..! రాత్రివేళ్లల్లో నా పిక్కలు పట్టుకుపోతున్నాయి. దాంతో నిద్రాభంగమై మధ్యలోనే నిద్రలేస్తున్నాను. ఎంత బాధగా ఉంటుందో వర్ణించలేను. చాలాసేపు కుంటుతూ నడిచాక కాస్త చక్కబడుతుంది. మళ్లీ నిద్ర కోసం పక్కమీదికి ఒరగగానే మళ్లీ పిక్కలు పట్టుకుబోతాయి. దాంతో గంటలు గంటలు నిద్రలేక బాధపడుతున్నాను. ఈ మజిల్క్రాంప్స్ తగ్గడానికి తగిన సలహా ఇవ్వండి. - టి. వెంకటేశ్వర్లు, నర్సంపేట మీలా కండరాలు పట్టేసి చాలా బాధపడే లక్షణాలు కనిపించేవారిలో అందుకు కారణాలు చాలా ఉంటాయి. ఒకవేళ మీరు డయాబెటిస్ అయి మీలో చక్కెరపాళ్లను నియంత్రణలో ఉంచుకోకపోయినా ఇలా జరగవచ్చు. ఇక సాధారణంగా మన శరీరంలో ద్రవాలు తగ్గి, తద్వారా పొటాషియమ్ లోపించడం వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. ఒక్కోసారి విటమిన్ బి12 లోపం వల్లగానీ లేదా థైరాయిడ్ సమస్య వల్లగానీ ఇవే లక్షణాలు కనిపించవచ్చు. మీ సమస్యకు అసలు కారణం ఏమిటో తెలుసుకోవడం ముందుగా జరగాల్సిన పని. ఆ కారణాన్ని బట్టి చికిత్స చేస్తే మీ సమస్య నయమవుతుంది. నా వయసు 40. రాత్రివేళల్లో నిద్రపట్టదు. చాలా కష్టమ్మీద ఉదయం వేళలో కాస్త నిద్రపడుతుంది. ఇలా సూర్యోదయానికి ముందు నిద్రపట్టడం వల్ల ఉదయం పది, పదకొండు గంటల వరకు నిద్రపోతున్నాను. దాంతో నా పనులు చాలా చెడిపోతున్నాయి. ఒక డాక్టర్గారిని కలిసి నా సమస్య వివరిస్తే కొన్ని నిద్రమాత్రలు ఇచ్చారు. అవి వేరే సందర్భంలో మరో డాక్టర్ గారికి చూపిస్తే, ఆయన వాటిని చూసి, అవి ఫిట్స్ రోగులకు ఇస్తారని, వాటిని వాడవద్దని సూచించారు. దాంతో నేను అయోమయంలో పడిపోయాను. నేనిప్పుడు ఆ మాత్రలు వాడాలా, వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాను. ఈ విషయంలో నేను ఏ నిపుణుడిని కలవాలో తగిన సలహా ఇవ్వండి. - సుకుమార్, నిజామాబాద్ మీరు రాసిన లేఖలో మీరు వాడుతున్న టాబ్లెట్ల పేరు రాయలేదు. నిద్ర కోసం ప్రిస్క్రయిబ్ చేసే మందుల్లో కొన్నింటిని తలనొప్పి కోసం లేదా ఫిట్స్ కోసం కూడా ఉపయోగిస్తుంటారు. మీకు రాసిన మందులు మీరు ఉపయోగించవచ్చో లేదో తెలుసుకోడానికి ఒకసారి మీకు దగ్గర్లోని ఫిజీషియన్‌ను సంప్రదించండి. ఈరోజుల్లో నిద్రలేమి సమస్యను చక్కదిద్దడానికి సురక్షితమైన చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడటం వల్ల అవి అలవాటు కావు, వాటి మీదే ఆధారపడాల్సిన పరిస్థితి కూడా రాదు. అయితే మీ వ్యాధిచరిత్ర, మీ లక్షణాలు, ఇతరత్రా అంశాలు పరిశీలించాక మీకు తగిన మందులు వాడాల్సి ఉంటుంది. కాబట్టి మీకు దగ్గర్లోని ఫిజీషియన్‌ను కలిసి మీకు తగిన మందులు రాయించుకోండి. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ మెడనొప్పి భుజానికీ పాకుతోంది..! నా వయసు 27. నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్‌ను. చాలా ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయాల్సి ఉంటుంది. గత రెండువారాలుగా నాకు మెడ నొప్పి చాలా తీవ్రంగా వస్తోంది. అది మెడ నుంచి కుడి భుజంలోకి పాకుతోంది. డాక్టర్గారిని కలిస్తే వెన్నుపూసల్లోని డిస్క్ వాపు వచ్చిందనీ, సర్జరీ అవసరం అని చెప్పారు. నాకు సర్జరీ అంటే భయం. శస్త్రచికిత్సకు బదులుగా ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - ప్రసేన్, హైదరాబాద్ మీలా చాలా సేపు కూర్చొని పనిచేసే వారిలో ఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అదేపనిగా గంటలకొద్దీ అనుసరణీయం కాని భంగిమల్లో కూర్చొని పనిచేసేవారిలో వెన్నుపూసల్లోని డిస్క్‌లు బలహీనపడతాయి. ఒక్కోసారి వాటిలో వాపు కూడా రావచ్చు. దీని వల్ల కొద్ది నెలల తర్వాత తీవ్రమైన నొప్పి వస్తుంది. అయితే మంచి ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో తగిన వ్యాయామాలు చేయడం వల్ల, వెన్నెముకకు అనువైన, తగిన భంగిమలో కూర్చోవడం వల్ల పరిస్థితి మెరుగుపడి కొద్దిరోజుల్లోనే పరిస్థితి మెరుగుపడుతుంది. ఇలాంటివారు తాము కూర్చొని పనిచేసే సమయంలో ప్రతి రెండు గంటలకు లేదా మూడు గంటలకు ఒకసారి లేచి తమ మెడను కాస్త అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మీరు కూడా అటు ఇటు తిరుగుతూ ఉండాలి.ఇక సర్జరీ విషయానికి వస్తే ఇలాంటి కేసుల్లో శస్త్రచికిత్స చాలా అరుదుగా అవసరమవుతుంది. నొప్పి భరించలేనంత ఉండి ఆర్నెల్ల తర్వాత ఏదైనా శరీరభాగం స్పర్శ కోల్పోవడం లేదా కేవలం రెండు శాతం కంటే తక్కువ మందికే శస్త్రచికిత్స అవసరం పడుతుంది. కాబట్టి మీరు అప్పుడే శస్త్రచికిత్స గురించి ఆలోచించకండి. తొలుత మీరు మంచి ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి మీ మెడ నొప్పి తగ్గడానికి అవసరమైన వ్యాయామాల గురించి తెలుసుకొని, వాటిని చేయండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన ప్రత్యామ్నాయం గురించి ఆలోచించవచ్చు. ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నాలుగేళ్లుగా సంతానలేమి... పరీక్షలేమైనా చేయించాలా? నా వయసు 30. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. గత నాలుగేళ్లుగా మేం గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నాం. అయినా ఫలితం లేదు. మేము ఏదైనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకని నాకు ఇంకా గర్భం రావడం లేదు? దయచేసి వివరించండి. - సుశాంతి, హైదరాబాద్ మీ విషయంలో ఒకసారి మీరూ, మీతో పాటు మీ భర్త కూడా కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నా గర్భం ఎందుకు రావడం లేదనే కారణం తెలుసుకోవడం కోసం కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. సంతానలేమికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒవ్యూలేటరీ డిజార్డర్స్, వీర్యకణాలను తీసుకెళ్లే ట్యూబుల్లో లోపాలు... ఇలా అనేక సమస్యల వల్ల సంతానలేమి కలగవచ్చు. ఒక్కోసారి పరీక్షల్లో అంతా సవ్యంగానే ఉన్నా సంతానం కలగకపోవచ్చు. అప్పుడు కారణాలేమిటో కూడా తెలియదు. దీన్నే ‘అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ’ అంటారు. ఇక సంతానలేమితో బాధపడే దంపతుల్లోని 40 శాతం కేసుల్లో ఇద్దరిలోనూ లోపాలు ఉండవచ్చు. కాబట్టి లోపం ఎక్కడుందో తెలుసుకోడానికి మీరిద్దరూ ఒకసారి కొన్ని పరీక్షలు చేయించుకోవడం అవసరం. నా వయసు 40. నా భార్య వయసు 35. మాకు ఇద్దరు పిల్లలు. ఒకసారి ఈతకు వెళ్లి ఇద్దరూ నీళ్లలో మునిగి చనిపోయారు. రెండో సంతానం తర్వాత పిల్లలు పుట్టకుండా నా భార్య లాపరోస్కోపిక్ ప్రక్రియ ద్వారా ట్యూబెక్టమీ చేయించుకుంది. ఇప్పుడు మాకు పిల్లలు కావాలని ఉంది. మాకు సంతానం కలిగే అవకాశం ఉందా? - ఒక సోదరుడు, కర్నూలు మొదట మీరిద్దరూ కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. మీ వీర్యపరీక్ష కూడా అవసరమవుతుంది. ఇది చాలా సులభమైన పరీక్ష. ఇక మీ భార్య విషయానికి వస్తే ఆమె అండాల వద్దకు వీర్యకణాలను తీసుకెళ్లే ట్యూబ్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలించాలి. అవసరమైతే ట్యూబల్ కన్స్ట్రక్షన్ అనే శస్త్రచికిత్స చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ శస్త్రచికిత్స విజయవంతమై, ఆమెలో అండం ఉత్పత్తి సరిగా ఉంటే స్వాభావిక పద్ధతిలోనే మీరు సంతానం పొందే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ మీ భార్య విషయంలో ట్యూబల్ సర్జరీ విజయవంతం కాకపోయినా లేదా అండం విడుదల సరిగా లేకపోయినా లేదా మీ వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నా ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) అనే ప్రక్రియను ఆలోచించవచ్చు. ఈరోజుల్లో సంతానలేమికి మంచి చికిత్సలే అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకసారి ఫెర్టిలిటీ నిపుణులను కలవండి. -
35 ఏళ్లు దాటిన మహిళల్లో ‘సంతానలేమి’ సమస్యలు
‘నోవా’ సంస్థ సర్వేలో వెల్లడి బెంగళూరు : భారతదేశంలో సంతానలేమితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని నగరంలోని నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సంస్థ వెల్లడించింది. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ మనీష్ బాంకర్ మాట్లాడుతూ....ముఖ్యంగా 35ఏళ్లు పైబడిన మహిళల్లో అధికంగా సంతానలేమి సమస్య కనిపిస్తోందని అన్నారు. ఇటీవల తమ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని తెలిపారు. సంతానలేమి సమస్యలతో వైద్యులను సంప్రదిస్తున్న వారిలో 36శాతం మంది 31-35సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు కాగా, 32శాతం మంది 35సంవత్సరాలు పైబడిన మహిళలుగా తమ సర్వేలో గుర్తించినట్లు చెప్పారు. ఈ వయసు మహిళల్లో అండాల ఉత్పత్తిలో సమస్యలు ఏర్పడుతున్న కారణంగానే సంతానలేమిని ఎదుర్కొనాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇక స్పానిష్‌తో పాటు ఇతర అనేక దేశాల్లో 37ఏళ్ల వయస్సు నుంచి మహిళల్లో సంతానలేమి సమస్యలు కనిపిస్తుండగా, భారత్‌లో మాత్రం ఈ వయోపరిమితి కేవలం 31.5గానే నమోదు కావడం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. అందువల్ల సంతానం విషయంలో మహిళలు మరీ ఆలస్యం చేయకపోవడమే మంచిదని సూచించారు. -
వ్యక్తిగతం: నిస్సంతతకు పస్ సెల్స్ కారణమా?
డాక్టర్! నా వయస్సు 26 ఏళ్లు. నా ఎడమవైపు వృషణం కుడివైపు కంటే కొంచెం కిందికి జారినట్లుగా ఉంది. స్తంభించినప్పుడు పురుషాంగం కూడా కొంచెం ఎడమవైపునకే వంగినట్లుగా ఉంటుంది. వృషణం అలా జారివుండటంవల్లే ఇది కూడా అలా వంగినట్టు కనబడుతోందా? ఇదేమైనా సమస్యా? నేను పెళ్లికి అర్హుడనేనా? - ఎం.డి.ఎస్., కడప కుడివైపు వృషణంతో పోలిస్తే ఎడమవైపుది కొందరిలో కొంచెం కిందికి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆమాటకొస్తే చాలామందిలో వృషణాలు ఒకే లెవెల్లో ఉండకపోవడం అన్నది సర్వసాధారణమే! పురుషాంగం కూడా స్తంభించినప్పుడు ఎడమవైపునకో, కుడివైపునకో పక్కకు తిరిగి ఉండటం కూడా మామూలు విషయమే! పురుషాంగం అలా వంగినట్టు కనబడటానికీ, వృషణాల్లో హెచ్చుతగ్గులుండటానికీ ఏ సంబంధమూ లేదు. మీకు లైంగికోద్రేకాలు మామూలుగానే కలుగుతూ, అంగస్తంభన మామూలుగానే ఉంటూ, వృషణాల్లో నొప్పిలాంటిది ఏమీ లేకపోతే మీకు ఏ సమస్యా లేనట్టే! మీరు నిశ్చింతగా పెళ్లిచేసుకోవచ్చు. నాకు ఈ మధ్యనే పెళ్లయింది. వయసు 28. ఒకసారి సంభోగం అనంతరం వీర్యంలో కొద్దిగా రక్తం కనబడింది. దాంతో నాకు భయమేసింది. అయితే అంగస్తంభన మాత్రం మామూలుగానే ఉంది. దాంపత్య జీవితంలో కూడా ఏ ఇబ్బందీ లేదు. మరి నాకు ఉన్న సమస్య ఏమిటి? అది భవిష్యత్తులో మరేదైనా జబ్బుకు దారితీస్తుందా? - కె.ఎ.కె., సూర్యాపేట వీర్యంలో రక్తం రావడం అన్నది అంత ప్రమాదకరమైన పరిస్థితి కాకపోవడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉన్నా, టీబీ ఉన్నా, వీర్యం వచ్చే మార్గంలో నీటిబుడగలు (సిస్ట్స్) ఉన్నా, అక్కడ ఏవైనా గడ్డలు ఉన్నా ఇలా వీర్యంతో పాటు రక్తం రావడం పరిపాటి. పైగా ఇలా కనిపించడం చాలా సాధారణం. ఇది చాలా మందిలో జరిగేదే. కొన్నిసార్లు ఇలా జరగడానికి ఏ కారణమూ కనిపించదు. చికిత్స చేసినా చేయకపోయినా ఒక్కోసారి దానంతటదే తగ్గిపోవచ్చు. చాలా సందర్భాల్లో పరిస్థితి దానంతట అదే చక్కబడుతుంది కాబట్టి ఆందోళన కూడా క్రమంగా తగ్గిపోతుంటుంది. అయితే ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో మీరు ఒకసారి యూరిన్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని యూరాలజిస్టును కలిసి, ఏమైనా సాధారణ యాంటీబయాటిక్స్ తీసుకోవాలేమో చూసుకోండి. ఇది ఆందోళన పడాల్సినంత పెద్ద సమస్య కాదనే నమ్మకంతోనే డాక్టరును సంప్రదించండి. నా వయుస్సు 38 ఏళ్లు. పెళ్లయి పదేళ్లు దాటింది. వూకింకా సంతానం కలగలేదు. డాక్టర్‌ను కలిస్తే, పరీక్షలు చేశారు. నా వీర్యంలో పస్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయట. పస్ సెల్స్ ఎక్కువుంటే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయా? సలహా ఇవ్వగలరు. - ఎస్.ఎం.కె., కొత్తగూడెం చాలాకాలంగా సంతానం లేనివారిలో మగవారికి మొదట సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో వీర్యంలో పస్ సెల్స్ ఉండకూడదు. వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉంటే ఈ పస్ సెల్స్ కనిపిస్తారుు. ఈ పస్ సెల్స్ ఉన్నప్పుడు వీర్యం నాణ్యత తగ్గుతుంది. తత్ఫలితంగా పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. మీరు ఒకసారి సెమెన్ కల్చర్ పరీక్ష చేరుుంచుకోండి. డాక్టర్ సలహాపై సరైన యూంటీబయూటిక్స్ వాడటం వల్ల వీర్యంలో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ తగ్గితే సెమెన్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఈ చికిత్సలో భాగంగా విటమిన్ సప్లిమెంట్స్ కూడా వాడాల్సి ఉంటుంది. యూంటీబయూటిక్స్ మొదలుపెట్టిన వుూడు వారాల తర్వాత వుళ్లీ మరోసారి సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేసి, అప్పుడు గనుక వీర్యం క్వాలిటీ వూవుూలుగా ఉంటే మీకు పిల్లలు పుట్టే అవకాశాలు తప్పక మెరుగవుతాయి. - డా. వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ మీ సందేహాలను పంపవలసిన చిరునామా: వ్యక్తిగతం, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. vyaktigatam.sakshi@gmail.com