రమేష్– రాగిణి పెద్ద కంపెనీలో ఉద్యోగం. దండిగా వేతనం. సొంత ఫ్లాటు. పెళ్లయి నాలుగేళ్లవుతోంది. కానీ కడుపు పంట కలగానే మిగిలింది. ఇరు కుటుంబాల నుంచి ఎంతో నిరీక్షణ. ఇక లాభం లేదని వైద్యనిపుణులను కలిస్తే... సమస్యను గుర్తించి చికిత్స ప్రారంభించారు. కానీ దంపతులు ఆశించిన ఫలితం కనపడడం లేదు. నగరంలో ఈ తరహా దంపతులకు కొదవ లేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని మాదిరిగా జీవితంలో సకల సౌకర్యాలూ సమకూరినా అమ్మా నాన్నా అనే పిలుపునకు నోచుకోలేని దంపతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
బొమ్మనహళ్లి: బతుకు పోరాటంలో అలసిపోతున్న నగరవాసులు సంతానలేమికి దూరమవుతున్నారు. ఒత్తిడితో కూడిన జీవనం దంపతుల్లో వంధ్యత్వానికి దారి తీస్తోంది. దశాబ్దం కిందటి వరకు నగర దంపతుల్లో పది శాతం మంది సంతానలేమితో బాధ పడేవారు. ఇప్పుడది 15 శాతానికి పెరిగింది. దీనికి కారణాలను విశ్లేషిస్తే, పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్, పెరుగుతున్న పని గంటలతో పాటు దంపతులు ఎదుర్కొంటున్న పలురకాల ఇబ్బందులని తేలింది. దీనికి తోడు దంపతుల ఆకాంక్షలు కూడా వారిని సంతాన ప్రాప్తికి దూరం చేస్తున్నాయి. సంతానానికి ముందే జీవితంలో బాగా స్థిరపడాలనేది నేటి యువ జంటల సంకల్పం. అయితే 30 సంవత్సరాలు దాటితే సంతాన యోగానికి క్రమంగా దూరమవుతామని వారు గ్రహించలేక పోతున్నారు.
జీవనశైలి జబ్బులతో తంటా
జీవనశైలిలో వస్తున్న మార్పులు కూడా దంపతులకు ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతున్నాయి. మధుమేహం, రక్తపోటు, స్థూలకాయం లాంటివి సంతానలేమికి సర్వ సాధారణ కారణాలని ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ కామినీరావు తెలిపారు. గత దశాబ్దంలో సంతానలేమి కేసులు 50 శాతం దాకా పెరగడం కాస్త ఆందోళన
కలిగించే విషయమేనని ఆమె పేర్కొన్నారు. సంతానలేమితో వారానికి 25 నుంచి 30 కొత్త కేసులు తన వద్దకే వస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతా ల్లో సంతాన లేమికి చికిత్సకు స్త్రీలను మాత్రమే పంపిస్తున్నారని, అయితే నగరాల్లో దంపతు లిద్దరూ సంతానలేమికి కారణాలను కనుక్కోవాల్సిన ప్రాముఖ్యతను గుర్తించారని తెలిపారు.
సామర్థ్యలేమి, ప్లాస్టిక్ బెడద
భౌతిక సామర్థ్యం లోపించడం, అనాసక్తి లాంటి అంశాలు కూడా సంతాన లేమికి దోహదపడుతున్నాయని ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ షఫాలికా తెలిపారు. ఫ్రిడ్జిలలో దాచి ఉంచిన, ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు కూడా కారణమవుతున్నాయని చెప్పారు. హార్మోన్లను విచ్ఛిన్నం చేసే ప్లాస్టిక్ సామాగ్రిని మితిమీరి వినియోగించడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. దీనికి తోడు ట్రాఫిక్ రద్దీ కారణంగా గంటల తరబడి రోడ్ల మీద ఉండడం వల్ల కాలుష్యం కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని ఆమె విశ్లేషించారు.
ఆశలు, ఆశయాలు కూడా కారణమే
⇔ తమ ఆశయాలు, ఆకాంక్షల వల్ల కొత్త దంపతులు ఇప్పుడే పిల్లలు వద్దని వాయిదా వేసుకుంటున్నారని, కొంతమందైతే ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారని మరో వైద్యురాలు డాక్టర్ చిత్రా రామమూర్తి చెప్పారు. సంతానలేమికి ఇవన్నీ కారణాలవుతున్నాయని చెప్పారు.
⇔ పురుషులు, స్త్రీలలో వంధ్యత్వం అనేది ప్రధాన సమస్యగా మారిందని తెలిపారు.
⇔ గతంలో 20–30 ఏళ్ల వయసున్న దంపతులు సంతానలేమితో చికిత్స కోసం వచ్చే వారని, ఇప్పుడు వస్తున్న వారంతా 35–40 ఏళ్ల వయసున్న వారని వివరించారు.
⇔ గతంలో సంతాన లేమికి ప్రధానంగా మహిళల్లోనే లోపాలున్నాయని అనుకునే వారని, ఇప్పుడు పురుషులు కూడా పరీక్షలు చేయించుకుంటున్నారని చెప్పారు.
⇔ గత దశాబ్దంలో వంధ్యత్వం 50 శాతం దాకా పెరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు.
⇔ సంతానలేమికి 40 శాతం చొప్పున స్త్రీ, పురుషులిద్దరూ కారకులు కావచ్చని, పది శాతం కేసుల్లో ఉభయుల్లోనూ లోపాలుంటాయని, పది శాతం కేసుల్లో కారణాలు తెలియడం లేదన్నారు. బహుశా దీనికి జీవన శైలిలో మార్పులు, చేర్పులు కారణమై ఉండవచ్చన్నారు.
⇔ మద్యం, ధూమపానం లాంటి దురలవాట్ల వల్ల రెండు నుంచి మూడు శాతం మంది సంతానానికి దూరమవుతున్నారని ఆమె చెప్పారు.
మంచి అలవాట్లు, మంచి ఆహారం
⇔ ఇవి రెండూ ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజా పండ్లు కూరగాయలను పుష్కలంగా తీసుకోవాలి.
⇔ కనీసం వారానికి అయిదు రోజులు చొప్పున, రోజుకు 40 నిముషాల పాటు వాకింగ్, జాగింగ్ వంటి కసరత్తులు చేయాలి.
⇔ మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించుకోవాలి. రోజుకు 20 నిమిషాల పాటు ధ్యానం చేయాలి.
⇔ జంక్‌ఫుడ్, ప్రాసెస్డ్ ప్రత్యేక ఆహార పదార్థాలను తీసుకోకూడదు.
⇔ ప్లాస్టిక్‌కు హార్మోన్లను దెబ్బతీసే స్వభావం ఉన్నందున, వాటిల్లో ఆహార పదార్థాలను నిల్వ ఉంచరాదు.
⇔ వీలైనంత వరకు ప్రయాణ సమయాన్ని తగ్గించుకోవాలి. కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్త వహించాలి.
⇔ నిర్లిప్తతతో కూడిన జీవనశైలిని వదిలేసి చురుకుగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment