మీటింగ్స్‌లోనూ నిద్రపోతున్నారా?
హోమియో కౌన్సెలింగ్
నాకు 28 ఏళ్లు. మా వారికి 34 ఏళ్లు. మా పెళ్లయి నాలుగేళ్లయింది. ఇంతవ రకూ సంతానం కలగలేదు. మాకెంతో నిరాశగా ఉంది. సంతాన లేమికి హోమియోలో మందులు ఏమైనా ఉంటే సూచించగలరు. - హైమ, ఆదోని
సంతానలేమి సమస్య స్త్రీ పురుషులిరువురిలోనూ 30 శాతం వరకు కొద్దిపాటి లోపాల వల్ల ఏర్పడుతుంది. మగవారిలో సంతానలేమికి కారణాలు శుక్రకణాలు లేకపోవడం లేదా శుక్రకణాల ఉత్పత్తి జరగకపోవడం, శుక్రకణాలు ఉత్పత్తి అయినప్పుడు వాటి కదలికలు సాధారణంగా లేకపోవడం, శుక్రకణాల నిర్మాణంలో తేడాలు, హైడ్రోసీల్ లేదా వెరికోసీల్ వల్ల శుక్రకణాలు దెబ్బతిని సంతానలేమికి కారణం కావచ్చు.
స్త్రీలలో సంతానలేమికి కారణాలు
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, గర్భసంచీ చిన్నగా ఉండటం, అసలు గర్భసంచి లేకపోవడం, గర్భసంచి రెండు గదులుగా ఉండటం, ఫెలోపియన్ ట్యూబ్స్ లేకపోవడం లేదా ట్యూబ్స్ మూసుకుపోవడం, అండాశయంలో ఎదుగుదల లేకపోవడం, యోనిమార్గం చిన్నదిగా ఉండటం లేదా మూసుకుపోవడం, వీటితోపాటు థైరాయిడ్ సమస్యలు, పి.సి.ఒ.డి, ఎఫ్.ఎస్.హెచ్, ఎల్.హెచ్, ప్రొలాక్టిన్ హార్మోన్ల అసమతుల్యత, రుతుక్రమంలో అపసవ్యతలు, ఎండోమెట్రియాసిస్, గర్భసంచిలో కణుతులు ఏర్పడి ఫెలోపియన్ ట్యూబ్స్‌కు అడ్డుపడటం వల్ల సంతానలేమి ఏర్పడుతుంది.
నిర్ధారణ: మగవారిలో: సీబీపీ, ఇ.ఎస్.ఆర్, సీయూఈ, ఎఫ్.ఎస్.హెచ్, ఎల్.హెచ్, థైరాయిడ్ ప్రొఫైల్, యూ.ఎస్.ఎస్. అబ్డామిన్, యూ.ఎస్.జి. స్క్రోటమ్, కంప్లీట్ సెమెన్ ఎనాలిసిస్, సీరమ్ టెస్టోస్టీరాన్, థైరాయిడ్ ప్రొఫైల్, ఎఫ్.ఎస్.హెచ్, ఎల్. టెస్టిక్యూలార్ బయాప్సీ.
ఆడవారిలో: సీబీపీ, ఇ.ఎస్.ఆర్, సీయూఈ, హెచ్.ఎస్.జి, లాప్రోస్కోపీ, థైరాయిడ్ ప్రొఫైల్, సీరం ప్రోలాక్టిన్, ఫాలిక్యులార్ స్టడీ
హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యం: సంతానలేమికి హోమియోపతిలో జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ విధానం ద్వారా స్త్రీ పురుషులలో లోపాలను సరిచేస్తూ శాశ్వత పరిష్కారం అందించటమే కాకుండా రెండవ మూడవ సంతానానికి మార్గం సుగమం చేస్తుంది. వైద్యవిధానం ద్వారా 50-60 శాతం వరకు సత్ఫలితాలను అందుకోవచ్చు.
న్యూరో కౌన్సెలింగ్
నా భర్త వయసు 50. ఇటీవల ఆయనకు మెదడులో కణితి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అది పరిమాణంలో చాలా పెద్దగా ఉండి, అత్యంత సున్నితమైన భాగంలో ఉందని డాక్టర్ చెప్పారు. న్యూరోనావిగేషన్ విధానంలో శస్త్రచికిత్స చేయాలని అంటున్నారు. న్యూరోనావిగేషన్ అంటే ఏమిటి? ఆపరేషన్ అంటే మాకు చాలా ఆందోళనగా ఉంది. మీరిచ్చే సలహాపైనే మా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. - ప్రభావతి, నిజామాబాద్
మీరు తెలిపిన వివరాలను బట్టి మీ భర్తకు అత్యంత కీలకమైన భాగంలో పెద్ద కణితి ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూరోనావిగేషన్ ద్వారా శస్త్రచికిత్స చేయడం రోగికి ఎంతో ఊపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల రోగికి భవిష్యత్తులో ఎదురయ్యే దుష్ర్పభావాలు తగ్గుతాయి. మెదడులోని భాగాలను 3-డీ ఇమేజ్‌లో చూస్తే సరిగ్గా కణితి ఎక్కడ ఉందో నిర్ధారణ చేసుకొని, అక్కడికి మాత్రమే చేరేందుకు అధునాతనమైన ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. మీ భర్తకు మెదడులోని అత్యంత సున్నితమైన భాగంలో, పెద్ద పరిమాణంలో కణితి ఉన్నందున ఈ ప్రక్రియ ద్వారా శస్త్రచికిత్స చేయడమే ఉత్తమం.
ఈ విధానంలో మిగతా మెదడు భాగాలు దెబ్బతినకుండా శస్త్రచికిత్స చేయడానికి వీలువుతుంది. తక్కువ కోతతో శస్త్రచికిత్స చేయడం వల్ల నొప్పి కూడా తక్కువగా ఉండటంతో పాటు, రోగి కోలుకునే వ్యవధి కూడా తక్కువ. బ్రెయిన్ ఆపరేషన్స్ చేసే సమయంలో వైద్యులు శస్త్రచికిత్స వల్ల ఎదురయ్యే రిస్క్‌లను అంచనావేసి, రోగి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. అలాంటప్పుడు అత్యంత సున్నితమైన భాగాల్లో శస్త్ర చికిత్స చేసే సమయంలో రోగి సురక్షితంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. న్యూరోనావిగేషన్ ప్రక్రియ వల్ల మెదడు లోపలి భాగాలను స్పష్టంగా చూడటం సాధ్యమవుతుంది. కాబట్టి క్లిష్టమైన ప్రాంతాలకు సర్జన్ తేలిగ్గా చేరేందుకు అవకాశం ఉండటం వల్ల న్యూరో నావిగేషన్ విధానంలో సర్జరీ అంటే మీరు గానీ, మీ భర్తగానీ అందోళన పడాల్సిన అవసరం లేదు. పైగా న్యూరోనావిగేషన్ ప్రక్రియను అనుసరించడం వల్ల కలిగే ఫలితాలు మరింత మెరుగ్గానూ ఉంటాయి.
స్లీప్ కౌన్సెలింగ్
నా వయసు 35. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. నా నిద్రపై నాకు ఎలాంటి నియంత్రణా ఉండటం లేదు. మీటింగ్స్‌లో ఉంటున్నప్పుడూ, తింటున్నప్పుడు కూడా నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతున్నాను. దీనివల్ల నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం చూపండి. - నవీన్, హైదరాబాద్
మీరు చెబుతున్న దాన్ని బట్టి మీరు నార్కొలెప్సీ అనే నిద్ర సంబంధమైన రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నార్కొలెప్సీ అనే సమస్యలో నిద్ర, మెలకువ రావడం... ఈ రెండూ ప్రభావితమవుతాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు పగటివేళ కూడా నిద్రలోకి జారిపోతుంటారు. ఏ పని చేస్తున్నా ఆ సమయంలో తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు.
సాధారణంగా నిద్రలో దశలు కొన్ని సైకిల్స్‌లో నడుస్తుంటాయి. అంటే ప్రారంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కదిలే దశ... ఇలాగ. కనుపాపలు వేగంగా కదిలే దశను ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ (ఆర్‌ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఆర్‌ఈఎమ్ నిద్ర దశ వేగంగా వచ్చేస్తుంది. ఈ ఆర్‌ఈఎమ్ దశలోనే మనకు కలలు వస్తుంటాయి. ఈ దశలో కనుపాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలు పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి.
నార్కొలెప్సీ సాధారణంగా 15 నుంచి 25 ఏళ్ల వయసులో మొదలవుతుంది. అయితే అది ఏ వయసువారిలోనైనా కనిపించే అవకాశం ఉంది. నార్కొలెప్సీ ఎందుకు వస్తుందనే అంశం ఇంకా తెలియదు. ఇది జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి పిల్లల్లో ఇది కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. మరికొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నదాని ప్రకారం మెదడులోని హైపోక్రెటిన్ అనే రసాయన లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో ఆర్‌ఈఎమ్ దశకు సంబంధించిన సైకిల్‌ను కొనసాగించే మెదడులోపాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ లోపాల వల్లనే మెలకువగా ఉండగానే అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే లక్షణాలు కనిపిస్తాయని వారి పరిశోధనల్లో తేలింది.
అయితే నాడీవ్యవస్థకు చెందిన ఒకటి కంటే ఎక్కువ అంశాలు నార్కొలెప్సీని కలగజేస్తాయని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిపోతాయి. మాటకూడా ముద్దముద్దగా వస్తుంది. బాధితులు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. దీనికి పూర్తిగా చికిత్స లేకపోయినా కొన్ని యాంటీ డిప్రసెంట్స్, యాంఫిటమైన్ మందులతో చికిత్స చేయవచ్చు.