ఉక్రెయిన్. ఒకప్పటి అందాల దేశం. ఇప్పుడు రష్యా రక్త దాహానికి బలైన శిథిల చిత్రం. యుద్ధం మిగిల్చే బీభత్సానికి సాక్షి. పోరులో ప్రాణాలొదిలిన వేలాది మంది ఉక్రెయిన్ యువ సైనికుల జీవిత భాగస్వాములది మాటలకందని దైన్యం. వారిలోనూ అసలు సంతానమే లేనివారిదైతే చెప్పనలవి కాని వ్యథ. ఎవరి కోసం బతకాలో తెలియని నైరాశ్యం. అయితే తమ జీవిత భాగస్వాములు ముందుజాగ్రత్తగా భద్రపరిచి వెళ్లిన వీర్యం/అండాలు వారిలో కొత్త ఆశలు నింపుతున్నాయి. వాటి సాయంతో బిడ్డలను కంటున్నారు. తమను శాశ్వతంగా వీడి వెళ్లిన తోడు తాలూకు నీడను వారిలో చూసుకుంటున్నారు. భవిష్యత్తుపై ఆశలు పెంచుకుంటున్నారు...
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలై రెండేళ్లవుతోంది. 2022 ఫిబ్రవరి 24న ఆ దేశంపై రష్యా సైన్యం హఠాత్తుగా విరుచుకుపడింది. రోజుల్లో తల వంచుతుందనుకున్న ఉక్రెయిన్ దీటుగా పోరాడుతోంది. దాంతో రెండేళ్లయినా పోరు కొనసాగుతూనే ఉంది. యుద్ధమంటేనే ప్రాణనష్టం! ఇప్పటిదాకా ఏకంగా 70,000 మంది ఉక్రెయిన్ జవాన్లు మరణించినట్లు అంచనా. మరో లక్షన్నర మందికి పైగా క్షతగాత్రులుగా మారారు.
యుద్ధంలో జవాను వీరమరణం పొందితే అతడి/ఆమె వంశం అంతమైపోవాల్సిందేనా? బతికుండగానే అండాలు, వీర్యం భద్రపర్చుకొని, తాము లేకపోయినా జీవిత భాగస్వామి ద్వారా సంతానం పొందే వెసులుబాటును ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఇలాంటి ప్రశ్నలు ఉక్రెయిన్ సైన్యం నుంచి గట్టిగా వినిపించాయి. దీనిపై ప్రభుత్వమూ సానుకూలంగా స్పందించింది. పార్లమెంటులో ఇటీవలే ఒక బిల్లును ఆమోదించింది. అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్‌స్కీ సంతకం చేస్తే చట్టంగా మారనుంది. ఇదొక విప్లవాత్మక చట్టం కానుందని నిపుణులు ప్రశంసిస్తున్నారు. యుద్ధంలో మరణించినవారి వీర్యం/అండాలతో సంతానం పొందే అవకాశం ఇప్పటిదాకా ఉక్రెయిన్‌లో చట్టపరంగా లేదు. ఇక ఈ పరిస్థితి మారనుంది...
► ఉక్రెయిన్ పార్లమెంట్‌లో ఆమోదించిన బిల్లు ప్రకారం జవాన్లు తమ వీర్యం, అండాలు భద్రపర్చుకోవచ్చు. వారు యుద్ధంలో అమరులైతే వాటి సాయంతో జీవిత భాగస్వాములు సంతానం పొందవచ్చు.
► ఈ కొత్త చట్టాన్ని అంతా స్వాగతిస్తున్నారు. దీని ద్వారా అమర సైనికుల కుటుంబ వారసత్వం కొనసాగుతుందంటున్నారు.
► జవాన్ల వీర్యం/అండాలు ఉచితంగా భద్రపరుస్తామని ఉక్రెయిన్‌లో పలు సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. యుద్ధం మొదలైనప్ప టి నుంచే ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నాయి.
► ఇందుకు వీలుగా యుద్ధంలో మృతి చెందిన జవాన్ల వీర్యం/అండాలను మూడేళ్ల పాటు భద్రపరుస్తారు. ఇందుకు ప్రభుత్వమే ఆర్థిక సాయం అందిస్తుంది.
► వీర్యం/అండాలు భద్రపర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్న సైనికుల సంఖ్య ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. ప్రభుత్వం అనుమతితో పాటు ఆర్థిక సాయమూ అందిస్తుందని స్పష్టత రావడమే కారణమని తెలుస్తోంది.
► యుద్ధంలో క్షతగాత్రులై, ఆరోగ్యం దెబ్బతిని సంతానోత్పత్తికి, బిడ్డలకు జన్మనిచ్చే సామర్థ్యానికి దూరమైన సైనికులు కూడా వీర్యం/అండాలను భద్రపర్చుకుని సంతానం పొందవచ్చు.
► యుద్ధంలో గాయపడిన పలువురు జవాన్లు ఈ సేవలు ఉపయోగించుకుంటున్నారు.
► ఇలా భద్రపర్చిన వీర్యం/అండాలతో పుట్టే పిల్లలకు చట్టబద్ధంగా అన్ని హక్కులూ ఉంటాయి. అమర వీరులైన తల్లి/తండ్రి పేరును వారి బర్త్ సరి్టఫికెట్‌లో ముద్రిస్తారు!
► ఇప్పటికే ఒక బిడ్డ ఉన్నవారు కూడా మరో బిడ్డను కనడానికి ముందుకొస్తున్నారు. ఇలా భద్రపర్చుకుంటున్న జవాన్లలో మహిళల కంటే పురుషుల సంఖ్య అధికంగా ఉంది.
మన పాప నవ్వుల సాక్షిగా...
నువ్వెప్పటికీ నాతోనే...
మనసుతో చూడగలిగితే లక్ష భావాలను, కోటి ఊసులను కళ్లకు కట్టే ఫొటో ఇది. ఇందులో నేపథ్యంలోని పోస్టర్లో కనిపిస్తున్నది రష్యాతో పోరులో మరణించిన ఉక్రెయిన్ సైనికుడు విటాలీ. బుల్లి పాపాయిని ఎత్తుకున్నది అతని భార్య విటాలినా. భర్త మరణానంతరం ఆయన వీర్యంతో గర్భం దాల్చి ఈ పండంటి పాపాయికి జన్మనిచి్చందామె. కూతురిని భర్త ఫొటోకు చూపిస్తూ ఇలా భావోద్వేగానికి గురైంది. రష్యాతో యుద్ధం మొదలయ్యే కొద్ది నెలల ముందే విటాలీ ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు.
ఫ్రంట్ లైన్‌లో పోరాడుతూ యుద్ధం మొదలైన తొలి నాళ్లలోనే మరణించాడు. అప్పటికే విటాలినా 13 వారాల గర్భవతి. కానీ ఆ గర్భం నిలవలేదు. భర్త క్షేమం తాలూకు ఆందోళనే అందుకు ప్రధాన కారణమని ఇప్పటికీ కన్నీళ్లపర్యంతం అవుతుంటుంది విటాలినా. ‘‘అటు జీవితాంతం తోడుండాల్సిన భర్తను, ఇటు ఇంకా లోకమే చూడని మా కలల పంటను కొద్ది రోజుల తేడాతో శాశ్వతంగా కోల్పోయా. బతుకంతా ఒక్కసారిగా శూన్యంగా తోచింది’’ అంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకుందామె. ‘‘ఇలాంటి పరిస్థితిని ఊహించే నా భర్త వీర్యాన్ని భద్రపరిచి వెళ్లాడు. దాని సాయంతో తల్లిని కావాలని నిర్ణయించుకున్నా.
అలా ఈ చిట్టి తల్లి ఈ లోకంలోకి అడుగు పెట్టింది. తన రాకతో నాకు నిజంగా సాంత్వన చేకూరింది. పాప వాళ్ల నాన్న పోలికలనే గాక హావభావాలను కూడా ముమ్మూర్తులా పుణికి పుచ్చుకుంది. దైవ కృప అంటే బహుశా ఇదేనేమో. నిజానికి గంపెడు సంతానాన్ని కనాలని, మాది పెద్ద కుటుంబం కావాలని పెళ్లికి ముందు నుంచీ ఎన్నెన్నో కలలు కన్నాం. కానీ విధి రాత మరోలా ఉంది. అయినా తను ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఈ చిట్టితల్లి రూపంలో ఇలా ఫలించింది’’ అంటుంటే విని చెమర్చని కళ్లు లేవు. కాస్త అటూ ఇటుగా ఉక్రెయిన్ సైనిక వితంతువులందరి గాథ ఇది...!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment