సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యం క్షీణిస్తోందా? 4.85 కోట్ల జంటలు సంతానలేమితో బాధ పడటానికి ఇదే కారణమా? ఐదారు వందల సంవత్సరాల తర్వాత పరిస్థితి మరింత తీవ్రం కానుందా? అంటే... అంతర్జాతీయ అధ్యయనాలు అవుననే అంటున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్లే ఈ పరిస్థితి నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పురుషుల్లో శుక్రకణాలు తగ్గడమే సంతానోత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణమని చెబుతున్నాయి. సమాజంలో సాధారణంగా స్త్రీల పునరుత్పత్తి సామర్థ్యంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంటుందని, పురుషులకు సంబంధించి పెద్దగా చర్చ జరగడం లేదని పలు నివేదికలు చెబుతున్నాయి. పితృస్వామ్య వ్యవస్థ కారణంగానే ఇలా జరుగుతోందని అంటున్నాయి.
ఆఫ్రికా, ఆసియా వంటి దేశాల్లోనైతే సంతానలేమికి స్త్రీనే కారణంగా పేర్కొంటూ నిందిస్తారు. కాగా కొన్ని ప్రాంతాల్లో బహు భార్యత్వం ఇప్పటికీ కొనసాగుతుండటానికి గల కారణాలలో సంతానలేమిని అధిగమించాలన్నది ఒకటని అంటున్నారు.
51 శాతం తగ్గిన శుక్రకణాలు
ప్రపంచ వ్యాప్తంగా సంతానలేమిపై ‘çహ్యూమన్ రిప్రొడక్షన్ అప్‌డేట్–2023’నివేదిక వెలువడింది. 20, 21 శతాబ్దాలలో ఏం జరిగిందనేది దీని సారాంశం. 1973 నుంచి 2020 వరకు 50 ఏళ్ల కాలంలో పరిస్థితిని నివేదిక వివరించింది. 1970లో 20–30 వయస్సు గల ఒక యువకుడికి వంద మిలియన్ల శుక్రకణాలు ఉన్నాయనుకుంటే.. 2020 వచ్చే నాటికి అదే వయస్సుగల వారు కొందరిలో 50 శాతం వరకు తగ్గిపోయాయి.
అంటే 50 మిలియన్లకు శుక్రకణాలు తగ్గిపోయాయన్న మాట. అలాగే 1972లో ఒక వ్యక్తికి శుక్రకణాలు 101 మిలియన్లు ఉంటే... 2018లో అదే వయస్సు గల వారిలో శుక్రకణాల సంఖ్య 49 మిలియన్లకు పడిపోయాయి. ఇలా గడిచిన ఐదు దశాబ్దాలలో మానవ శుక్రకణాల సాంద్రత 100 మిలియన్ల నుంచి 49 మిలియన్లకు పడిపోయింది.
అంటే సుమారుగా 51 శాతం తగ్గిందన్న మాట. అంటే పునరుత్పత్తి సామర్థ్యం ఆ మేరకు తగ్గిపోయిందన్నమాట. ప్రతి ఆరు జంటల్లో ఒకరు సంతానలేమి సమస్యతో బాధపడుతుండటం గమనార్హం.
భారత్‌లో 2.75 కోట్ల మంది..
సంతానలేమితో బాధపడేవారిలో 80 శాతం మందికి ప్రధానంగా శుక్రకణాలు తక్కువగా ఉంటాయి. ఒక్కోసారి జీరో కూడా ఉండొచ్చు. జీరో శుక్రకణాలు ఉండేవారు జనాభాలో 7 నుంచి 10 శాతం మంది ఉంటారని అంచనా. ఇక ఇండియాలో 2.75 కోట్ల మంది సంతాన లేమితో బాధపడుతున్నారు.
48 శాతం మందిలో స్త్రీలు కారణం కాగా, 20.4 శాతం ఇద్దరిలో సమస్యల వల్ల, 31.6 శాతం మందిలో పురుషుల కారణంగా సంతాన సమస్య ఏర్పడింది. ఇక ప్రపంచవ్యాప్తంగా సంతానలేమితో బాధపడే జంటలు 4.85 కోట్లు ఉన్నట్లు అంచనా. సంతానలేమితో బాధపడేవారిలో శుక్రకణాల సంఖ్య 15 మిలియన్ల నుంచి 20 మిలియన్ల కంటే తక్కువగా ఉంటుంది.
పురుషులలో హార్మోన్ల లోపం, మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పుట్టుకతో వచ్చే లోపాలు, పురుష ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఇన్‌ఫెక్షన్లు, మారుతున్న జీవన విధానం, మానసిక, శారీరక, వృత్తిపరమైన ఒత్తిడులు, ఆలస్యంగా జరుగుతున్న వివాహాలు, ఆహార కల్తీలు, ధూమ మద్యపానానికి అలవాటు పడడం, మాదకద్రవ్యాలకు బానిసలవటం, వాతావరణ కాలుష్యం, మొబైల్స్ విపరీత వినియోగం లాంటివి సంతానలేమికి కారణాలుగా చెబుతున్నారు.
వైద్య చికిత్సలతోసమస్యను అధిగమించొచ్చు
సంతానోత్పత్తి సవ్యంగా జరగాలంటే ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. శుద్ధిచేసిన ఆహారాన్ని తీసుకోకూడదు. ధూమ, మద్యపానానికి దూరంగా ఉండాలి. నిత్యం వ్యాయామం చేయడం, ధ్యానం లాంటివి అలవరుచుకోవాలి. ఏడెనిమిది గంటల నిద్ర ఉండాలి. అయితే శుక్రకణాల సంఖ్యను పెంచాలన్నా, పునరుత్పత్తి సామర్థ్యం పెంచాలన్నా అనేక వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సరైన చికిత్స చేయించుకుంటే సంతానోత్పత్తి సమస్యలను అధిగమించవచ్చు.
ఎజోస్పెర్మియా (జీరో స్పెర్మ్ కౌంట్) లోపాన్ని సరిదిద్దేందుకు ఆధునిక చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. రెండు రకాలైన (నాన్ అబ్‌స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా, అబ్‌స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా) ఎజోస్పెర్మియా లోపాలను వైద్యపరంగా సరిదిద్దేందుకు అవకాశం ఉంది. ఇక వ్యారికోసి సమస్య కారణంగా శుక్రకణాలు తగ్గిన పురుషులకు మైక్రోసర్జికల్ వ్యారోకోసిలెక్టమీ చేయడం ద్వారా వాటిని పెంపొందించవచ్చు. – డాక్టర్ రాఘవేంద్ర కోస్గి, సీనియర్ కన్సల్టెంట్‌యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్,అపోలో ఆస్పత్రి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment